Chandrayaan 3 Tamilnadu Soil: అసామాన్యమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో విజయ ప్రస్థానంలో తమిళనాడుకు చెందిన ప్రముఖులు ముఖ్య పాత్ర పోషించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ మయిల్‌సామి అన్నాదురై, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్ పి లాంటి శాస్త్రవేత్తలు ఇస్రో మిషన్‌ల కోసం ఎంతో కృషి చేశారు. అయితే, ఆ రాష్ట్ర 'మట్టి' కూడా ఇస్రోకు ఉపయోగపడింది. ఇప్పడు చంద్రయాన్-3 ప్రాజెక్టులో కూడా కీలక పాత్ర పోషించింది. మరి ఆ మట్టి ఎక్కడ? ఎందుకు? ఎలా? ఉపయోగపడిందో తెలుసుకుందాం.
Chandrayaan 3 Soft Landing : ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో తమిళనాడుకు చెందిన మట్టి ప్రముఖ పాత్ర పోషించింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, రోవర్.. ప్రోగ్రామ్ చేసిన విధంగా పరిశోధనలు చేపట్టడానికి వాటిని పరీక్షించాల్సి ఉంటుంది. అందుకోసం చంద్రుడిపై ఉన్న వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 60-70 టన్నుల చంద్రునిపై ఉండే మట్టి అవసరమవుతుంది. గతంలో ఈ లక్షణాలు గల మట్టిని అమెరికా నుంచి కిలోకు 150 డాలర్లు వెచ్చించి కొనుగోలు ఇస్రో కొనుగోలు చేసింది. అయితే, భవిష్యత్తులో భారత్ తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా భారీ పరిమాణంలో చంద్ర మృత్తిక పోలిన మట్టి అవసరమవుతుంది. ఇక అమెరికా నుంచి తీసుకోవడం ఖరీదైన వ్యవహారం.
Anorthosite In India : ఈ నేపథ్యంలో చంద్రమృత్తికను దేశీయంగా తయారుచేయటమే పరిష్కారమని శాస్త్రవేత్తలు భావించారు. దీంతో అలాంటి మట్టి కోసం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అందులో భాగంగా చంద్ర శిలలను పోలిన 'అనార్థోసైట్' శిలలు తమిళనాడులోని సేలం వద్ద ఉన్నట్టు గుర్తించారు. చివరకు సీతంపూడి, కున్నమలై గ్రామాలలో లభించే 'అనార్థోసైట్' (Anorthosite Rock) శిలలను చంద్రమృత్తిక తయారీలో వినియోగించేందుకు నిర్ణయించారు. వాటిని నిర్ణీత పరిమాణాల్లోకి మార్చి బెంగళూరులో లూనార్ టెర్రయిన్ టెస్ట్ ఫెసిలిటీ పరీక్షలు నిర్వహించారు. అలా తయారైన ఆవిష్కరణ అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉందని, తయారుచేసిన మట్టి అపోలో 16 మిషన్ ద్వారా చంద్రుని నుంచి తీసుకువచ్చిన నమూనాలతో పోలి ఉందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈ మట్టి పేటెంట్ హక్కులు కూడా ఇస్రోకు ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైకి 400 కిలో మీటర్ల దూరంలోని నమక్కల్ ప్రాంతంలో ఉన్న మట్టి.. చంద్రయాన్ మిషన్ టెస్టింగ్‌కు కోసం 2012 నుంచి సరఫరా అవుతోంది. ఈ మట్టి చంద్రమృత్తికకు దగ్గరగా ఉన్నందున చంద్రయాన్ ల్యాండర్, రోవర్ల సామర్థ్యాలను పరీక్షీంచడానికి, మెరుగుపరచడానికి ఇస్రోకు వీలు కలిగింది. ఇలాంటి మట్టి తమిళనాడులోని నమక్కల్ ప్రాంతంలో సమృద్ధిగా లభ్యమైందని.. అందుకే ఇస్రోకు అవసరం అయినప్పుడల్లా సరఫరా చేశామని పెరియార్ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం డైరెక్టర్ ఎస్ అన్బళగన్ తెలిపారు.
"చంద్రుడిపై ఉన్న మట్టిని పోలిన నేల తమిళనాడులో ఉంది. ప్రత్యేకించి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మట్టిని పోలి ఉంటుంది. అది 'అనార్థోసైట్' (ఇన్ట్రుసివ్ ఇగ్నియస్ రాక్) రకం మట్టి. ఇస్రో చంద్రడి అన్వేషణ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచి మేము ఈ మట్టిని పంపుతున్నాము"
-- ప్రొఫెసర్ ఎస్ అన్బళగన్, డైరెక్టర్ జియాలజీ విభాగం, పెరియార్ యూనివర్సిటీ
అయితే, నమక్కల్‌లో లభ్యమైన మట్టిపై ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ పరీక్షలను చేపట్టారని.. ఆ తర్వాతే ఆ మట్టి చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టితో సరిపోలినట్లు నిర్ధరించారని అన్బళగన్ తెలిపారు. ఆ మట్టి నమక్కల్ సహా దాని చుట్టుపక్కల గ్రామాలు సీతంపూడి, కున్నమలైతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా లభ్యమవుతుందని చెప్పారు. అవసరమైతే చంద్రయాన్-4 మిషన్‌కు కూడా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Chandrayaan 3 VS Chandrayaan 2 : ఓటమి నేర్పిన పాఠం.. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ఖాయం!