- బీటెక్ పూర్తిచేసి రూ.58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన హైదరాబాద్‌వాసి కట్టా అభిజిత్‌రెడ్డి విధుల్లో చేరకముందే గుండెపోటుతో మృతి చెందారు.ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.
- వినాయక చవితి వేడుకల్లో హనుమంతుడి వేషధారణలో నృత్యం చేస్తూ ఉత్తర్ ప్రదేశ్‌లో రవిశర్మ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అతడి వయసు 35.
- కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా తనువు చాలించారు. ఆయన వయసు 46.
- ప్రముఖ గాయకుడు కేకే కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో ఊపిరి విడిచారు. ఆయన వయసు 53.
- చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలు వేధిస్తున్నాయనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనాలు.
Healthy heart tips 2022: శాస్త్రీయంగా మనమెంతో అభివృద్ధి చెందామని చెప్పుకొంటున్నా- ప్రతిరోజూ పెద్దసంఖ్యలో ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నూతన వైద్య సమాచారాన్ని, వైద్య విధానాలను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ మానవాళిని గుండెపోటు మరణాల నుంచి తప్పించే బాధ్యత వైద్యులదే. ఇప్పటికీ చాలామంది వైద్యులు గుండెపోటు ఆకస్మికంగా తలెత్తుతుందని, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లనే కారణాలుగా పేర్కొంటున్నారు. కానీ గత దశాబ్దకాలంగా అందివచ్చిన వైద్య సమాచారాన్ని క్రోడీకరిస్తే- కనీసం 20 ఏళ్ల ముందుగానే గుండెపోటు రావడానికి బీజం పడుతుందని విదితమవుతోంది. గుండె జబ్బుల నిర్ధారణకు అవలంబిస్తున్న పద్ధతులు కొన్నిసార్లు వ్యాధిని గుర్తించడంలో ఆలస్యానికి కారణం అవుతున్నాయి. అయోమయానికీ గురిచేస్తున్నాయి. కొలెస్ట్రాల్ పొర క్రమేపీ 10, 20, 30, 40 శాతం పెరుగుతూ పోతూ అకస్మాత్తుగా చిట్లి రక్తనాళాన్ని పూర్తిగా మూసి వేయడంతో గుండెపోటు సంభవిస్తుంది. అత్యవసరంగా వైద్యచికిత్స అందని పరిస్థితుల్లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు.
గుర్తించడంలో వైఫల్యమా?
రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు 10-20 సంవత్సరాలుగా ఉన్నా- సగం మందిలో గుండెపోటు, పక్షవాతం వంటివి సంభవించవు. కొంతమంది ఇవేవీ లేకపోయినా చిన్న వయస్సులోనే ఆకస్మికంగా గుండెపోటు, పక్షవాతం బారినపడటం వైద్య ప్రపంచాన్ని మూడు దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రశ్న. గతంలో ముప్పుకారకాలు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు సంభవిస్తుందని భావించేవారు. శాస్త్రీయ సమాచారం ప్రకారం వైద్య ప్రపంచానికి అర్థమైంది ఏమిటంటే- గుండెపోటుతో ఐసీయూ విభాగంలో చేరేవారిలో 70శాతానికి ఎలాంటి ముప్పు కారకాలు లేకపోవడం లేదా ఒకటి మాత్రమే ఉంటున్నట్లు తేలింది. యాంజియోగ్రాం చేసిన 100 మందిలో 20 మందికే బ్లాక్స్ ఉండటం, వారిలో కొంతమందికి బైపాస్ సర్జరీ, మరికొంత మందికి స్టెంట్ యాంజియోప్లాస్టీ వంటి చికిత్సల్ని సూచించడాన్ని బట్టి చూస్తే- 80శాతం బాధితులకు క్యాత్ యాంజియో అవసరం లేదని విదితమవుతోంది.
ముప్పు కారకాలపైనే ఆధారపడకూడదా?
ప్రాథమిక దశలోనే గుండె జబ్బుల వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సను సూచించడానికి ఉపయోగపడే సి.టి.స్కాన్ యంత్రాన్ని ఈ శతాబ్దపు అత్యంత విలువైన ఆవిష్కరణగా పేర్కొనవచ్చు. క్యాల్షియం స్కోర్, సి.టి.కరోనరీ యాంజియోగ్రాం పరీక్ష అందుబాటులోకి వచ్చిన తరవాత గత పదేళ్లలో తెలిసింది ఏమిటంటే- వైద్యులు ముప్పు కారకాల మీద ఆధార పడకూడదని. ఇప్పటి వరకు అత్యంత ప్రామాణికాలుగా భావించిన ‘స్ట్రెస్ టెస్ట్’కు కూడా చాలా పరిమితులు ఉంటాయన్న సంగతి తెలిసి వస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ వంటి ఎనిమిది ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు ఒకే తాటి మీదికి వచ్చి- ఒక వ్యక్తిలో నిగూఢంగా దాగి ఉన్న కొలెస్ట్రాల్/క్యాల్షియంలను సి.టి స్కాన్ పరికరం ద్వారా కనుక్కున్నట్లయితే గుండె వ్యాధిని ముందే గుర్తించవచ్చని 2021లో సూచించాయి. బాధితుల్లో 50శాతం వరకు స్టాటిన్ మాత్రలు అనవసరంగా వాడుతున్నారని క్యాల్షియం స్కోర్, సి.టి.కరోనరీ యాంజియోగ్రాం పరీక్షల ద్వారా వెల్లడైంది. మరోవైపు, అవసరమైన వారిలో సుమారు సగం మందికి ముప్పు తక్కువగానే ఉన్నట్లు పొరపడి స్టాటిన్ మాత్రలు సూచించడం లేదని తెలుస్తోంది.
అందరికీ యాంజియోగ్రాం అవసరమా?
15 సంవత్సరాల నుంచి సి.టి.కరోనరీ యాంజియోగ్రాం, క్యాల్షియం స్కోర్ పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ రేడియో ధార్మికత ప్రభావం మోతాదు ఎక్కువని, సి.టి.కరోనరీ యాంజియోగ్రాం చేయించుకున్నప్పటికీ, క్యాత్ యాంజియోగ్రాం కూడా చేయించుకోవాలనే ప్రచారం ప్రజలు, వైద్యుల్లో విస్తృతంగా వ్యాప్తమైంది. నిజానికి సి.టి.యాంజియోగ్రామ్‌లో రేడియోధార్మికత ప్రభావం క్యాత్ యాంజియో కంటే 50శాతం తక్కువ. అంతేకాకుండా సి.టి.యాంజియోగ్రాం పరీక్షా ఫలితాలు 97శాతం కచ్చితత్వంతో ఉంటున్నట్లు తెలుస్తోంది. సి.టి.యాంజియోగ్రాం చేయించుకున్న వారిలో 80శాతం బాధితులకు క్యాత్ యాంజియో అవసరం లేదని, దీనితో పోలిస్తే సి.టి.యాంజియోలో ఇబ్బందులు చాలా తక్కువని అంతర్జాతీయ సంస్థలు నిర్ధారించాయి.
సగం మరణాలు నివారించవచ్చా?
గుండెజబ్బు నివారణలో కుటుంబ వైద్యుల పాత్ర అధికం. గుండెజబ్బును క్యాల్షియం స్కోర్, సి.టి.యాంజియోగ్రాం ద్వారా గుర్తించి మందులు వాడటం ప్రారంభించాలి. జబ్బు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు, స్టెంట్ యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం అయినప్పుడు హృద్రోగ నిపుణుల వద్దకు పంపించాలి. అత్యంత విలువైన సి.టి.కరోనరీ యాంజియోగ్రాం పరీక్ష- ప్రారంభ దశలో గుండెజబ్బును కనుక్కోవడంతోపాటు టెలికార్డియాలజీ, 5జి ఇంటర్నెట్, ఐ.ఒ.టి., డీప్‌లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, 5జి సాంకేతికతతో కూడిన ఆంబులెన్సులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే గుండెపోటు సంభవించిన తొలి గంట వ్యవధి-‘గోల్డెన్ అవర్’లోనే చికిత్స అందించగలుగుతాం. తద్వారా 50శాతం మరణాలను నివారించే అవకాశం ఉంటుంది.
సమస్య రాకుండా వాయిదా వేయవచ్చా?
35 నుంచి 50 సంవత్సరాల మధ్య ఎవరికైనా గుండెజబ్బు, రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, జీవక్రియ సంబంధిత రుగ్మత, ధూమపానం వంటి వాటిలో ఏ ఒక్కటి ఉన్నా- క్యాల్షియం స్కోర్ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఆ తరవాత అవసరమైన వారికి స్ట్రెస్ టెస్ట్/ సి.టి.యాంజియో, క్యాత్ యాంజియో వంటి పరీక్షల్ని సూచించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడం, రక్తపోటు, మధుమేహం వంటివాటిని నియంత్రణలో ఉంచుకొనే ఆరోగ్యకరమైన, నియమబద్ధమైన జీవనశైలి అనుసరించాలి. అలా చేస్తే గుండెపోటు సమస్యను 10 నుంచి 15 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టవచ్చనేది ఒక అంచనా!