ISRO History In Telugu : ఒకటి.. రెండు.. మూడు.. పది.. యాభై.. ఇవి అంకెలు మాత్రమే కాదు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో నింగికి పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి. 2017 ఫిబ్రవరి 15న PSLV-సీ37 రాకెట్‌తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్ఠంగా 37 శాటిలైట్లు ప్రయోగించింది. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్.. ప్రపంచదేశాల వైపు చూసేది. ఇప్పుడు ప్రపంచమే మనవైపు చూస్తోంది. అదీ ఇస్రో సాధించిన ఘనత.
ఇస్రో ప్రయోగిస్తే.. నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది ఉపగ్రహాలు మాత్రమే కాదు. భారత్ ఘనత, సత్తా కూడా. అపార అనుభవం, అత్యంత చవకైన సేవలతో..అంతరిక్ష యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా చేస్తోంది ఇస్రో. అంతరిక్ష పరిశోధనల్లో ప్రధాన దేశాలతో పోలిస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆలస్యంగా వచ్చింది. కానీ, వనరులు సరిగ్గా లేక సైకిల్ మీద రాకెట్లు మోసుకు వెళ్లి ప్రయోగాలు చేసే స్థితి నుంచి నేడు ఇస్రో సాధిస్తున్న విజయాలు, రికార్డులు అసామాన్యం. 1969లో ప్రారంభమైన ఇస్రో చరిత్రలో మరపురాని ఘట్టాలెన్నో. 2008లో చంద్రయాన్-1 ప్రయోగంతో భారత కీర్తిని చంద్రునిపైకి తీసుకువెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
జాబిల్లి కోసం..
Chandrayaan 3 Launch Date Time And Place : చంద్రునిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టిన ఇస్రో చంద్రయాన్-3 ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పుడు ప్రయోగించే చంద్రయాన్-3 చంద్రుడి దగ్గరకు చేరడానికి 40 రోజుల సమయం పడుతుంది. అదే 1969లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా పంపిన అపోలో 11 మానవ సహిత వ్యోమనౌక 4 రోజుల్లోనే గమ్యం చేరుకొని చంద్రునిపై ల్యాండ్ అయింది. కానీ ఇస్రో, ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి 40 రోజులు పడుతోంది. 50 ఏళ్ల కిందటే.. నాసా అంతవేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇప్పుడు ఇస్రో పంపే చంద్రయాన్-3 ఇంకా వేగంగా వెళ్లాలి. ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది? అనే విషయం పరిశీలిస్తే అనేక కారణాలు ఉన్నాయి. 1969 నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ చంద్రయాన్-3పూర్తి బరువు కంటే చాలా ఎక్కువ. చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మాడ్యుల్ 2148కేజీలు, ల్యాండర్, రోవర్ 1752 కేజీలు అంటే చంద్రునిపైకి వెళ్లే పరికరాల బరువు 3900 కేజీలు. తక్కువ ఇంధనం తక్కువ ఖర్చుతో కూడిన చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరుకోవడానికి 40 రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ ఇంధనం.. అందరికన్నా భిన్నం..
ISRO Fuel Efficiency : అతి తక్కువ ఇంధనంతో చంద్రుడి దగ్గరకు చేరుకోవాలనేది ఇస్రో ఆలోచన. తక్కువ ఇంధనంతో ప్రయోగాలు చేస్తుంది కాబట్టే నాసా కంటే ఇస్రోకు ఆలస్యం అవుతుంది. చంద్రయాన్-3ను ప్రపంచదేశాలను ఆకర్షించడానికి కూడా ఇదొక కారణం. ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఈ విధానాన్ని ఎంచుకుంది. దీంతోనే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేయగలుగుతోంది. ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న ఇస్రో అంతరిక్షరంగంలో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
హాలీవుడ్ సినిమాల కన్నా తక్కువ ఖర్చుతో..
ISRO Competitors : అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కన్నా ముందున్న అమెరికా, రష్యా, చైనా, ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తుంటాయి. చంద్రయాన్ -1కు 386 కోట్లను ఖర్చు చేసిన ఇస్రో కంటే 1969లో నాసా.. అపోలో-1 కోసం 10రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళ్‌యాన్‌కు మరింత ప్రత్యేకత ఉంది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే అంతకన్నా తక్కువ వ్యయంతో ఇస్రో మంగళయాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది. ప్రధాని మోదీ సైతం శాస్త్రవేత్తలను అభినందించారు. దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు తమ ఉపగ్రహాలను ఇస్రోలో లాంచ్ చేయడానికి ముందుకు వస్తున్నాయి.
ISRO Gaganyaan Mission : చంద్రయాన్-3 తో పాటు అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్‌యాన్ ద్వారా తొలి మానవసహిత ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు వ్యోమగాములకు నాసా శిక్షణను అందిస్తుంది. గగన్‌యాత్ర గనుక విజయవంతంగా పూర్తైతే అంతరిక్ష పరిశోధన చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లికించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్షయానంలో ఆత్మనిర్భరత..
India Private Space Agencies : అంతరిక్ష ప్రయోగాల కోసం మొదట్లో విదేశాలపై ఆధారపడిన ఇస్రో.. నేడు స్వదేశీ పరికరాలు, ఉపగ్రహాలను సిద్ధం చేసుకుంటుంది. దాంతో పాటు అంతరిక్షరంగంలో పరిశోధనలు, మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు రంగానికి అవకాశమిచ్చింది. ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్-ఇన్ స్పేస్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటికే వందలాది అంకుర సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు కృషి చేస్తున్నాయి. వీటిలో 10 అంకుర సంస్థలు ఉపగ్రహాలు, వాహకనౌకలను అభివృద్ధి చేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అంకుర సంస్థలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ఇస్రో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
చందమామ కోసం.. ముచ్చటగా మూడోసారి..
Chandrayaan 3 South Pole : ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రోకు చంద్రయాన్-3 ప్రయోగం మరింత కీర్తిని తెచ్చిపెట్టనుంది. చంద్రుని దక్షిణకదృవంపై ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని పరిశోధనను ఇస్రో చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చంద్రయాన్-3 అందించే వివరాలు భవిష్యత్‌లో నాసా ప్రయోగించే ఆర్టెమిస్ ప్రయోగానికి సైతం ఉపయోగపడనున్నాయి. దీంతో పాటు అనేక విజయాలు అందుకోవాల్సిన అవసరం ఇస్రోకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించాలి. మానవసహిత ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైతే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ కూడా చేరనుంది.