Three States Election Results Congress Reacts : రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ శ్రేణుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయని సోమవారం కాంగ్రెస్ పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాల్లో తమకు వచ్చిన ఓట్ల శాతం బీజేపీతో పోలిస్తే తక్కువేమీ కాదని స్పష్టం చేసింది. అయితే రెండు పార్టీలు గెలుచుకున్న సీట్ల సంఖ్యలో అనూహ్య తేడాలున్న పోలైన ఓట్లలో మాత్రం పెద్దగా తేడా లేదని పార్టీ తెలిపింది. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ఓడిపోతుందని కాదు. ఎందుకంటే గతంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలే గతంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
'అది పెద్ద విషయం కాదు..'
'మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఒకటి గమనిస్తే.. ఒక ఆసక్తికర విషయం తెలుస్తుంది. మా ఓట్ షేర్ బీజేపీకి చాలా దగ్గరగా ఉంది. అలాగే ఈ రాష్ట్రాలన్నింటిలోనూ మేము దాదాపు 40 శాతం మేర ప్రభావం చూపించాము. అయితే ఇరు పార్టీలు గెలుచుకున్న సీట్ల సంఖ్యలో తేడాలుండవచ్చేమో కానీ.. అది పెద్ద విషయం కాదు. ఆ స్థానం దక్కడానికి మాకు కావాల్సిన కొద్ది శాతం ఓట్లను మేము సాధించలేకపోయాము. కానీ, మెరుగైన స్థితిలో నిలిచాము. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు మంచి స్థితికి చేరుకున్నాయి. ఈ ఫలితాలు మాలో మరిన్ని ఆశలను కల్పిస్తున్నాయి' అని ఏఐసీసీ గుజరాత్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ బీఎం సందీప్ కుమార్ ఈటీవీ భారత్‌తో అన్నారు.
"ఓట్ల విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ మరీ అంత వెనుకబడి లేదని ఓట్ల సరళి, దాని గణాంకాలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి మేము మంచి ఫామ్‌లో ఉన్నాము. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 46.3 శాతం ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 40.4 శాతంపైగా బీజేపీకి 48.6 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రాజస్థాన్‌లో 39.5 శాతం మాకు రాగా బీజేపీకి 41.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ స్వల్ప తేడాలో పార్టీ బలోపేతం అవుతుందనడానికి నిదర్శనం."
-బీఎం సందీప్ కుమార్, ఏఐసీసీ గుజరాత్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ
'ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మూడు హిందీ రాష్ట్రాల ఫలితాలు ప్రజల సెంటిమెంట్‌కు పూర్తిగా విరుద్ధంగా కనిపించాయి. దీంతో కొత్త రకమైన శాస్త్రీయ పోలింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం వివిధ మాధ్యమాల ద్వారా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది' అని యాదవ్ ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ చందన్ యాదవ్ ఈటీవీ భారత్‌తో తెలిపారు.
మూడు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా..
రాష్ట్రం | కాంగ్రెస్ | బీజేపీ |
ఛత్తీస్‌గఢ్ | 66 లక్షలకుపైగా | 72 లక్షలు |
రాజస్థాన్ | 1.56 కోట్లుకుపైగా | 1.65 కోట్లు |
మధ్యప్రదేశ్ | 1.75 కోట్లు | 2.11 కోట్లు |
ఈ పై గణాంకాలను చూస్తే కాంగ్రెస్ బీజేపీకి చాలా దగ్గరగా వచ్చింది.. కానీ సీట్ల విషయంలో ఈ సంఖ్య సరిపోలడం లేదని చందన్ యాదవ్ అన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరచేలా లేవని.. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు కచ్చితంగా మంచి ప్రభావం చూపిస్తాయని ఇద్దరు ఏఐసీసీ నేతలు అభిప్రాయపడ్డారు.
ట్రెండ్ కొనసాగేనా..?
'కాంగ్రెస్ 2003లో ఈ మూడు రాష్ట్రాలను కోల్పోయింది, కానీ రాజధాని దిల్లీలో మాత్రమే గెలిచింది. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత 2018లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది కానీ 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే విధంగా 2023లో కాంగ్రెస్ 3 రాష్ట్రాలు ఓడిపోయింది, అయితే 2024 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి కచ్చితంగా గెలుపొందుతుందన నేను నమ్ముతున్నాను' అని బీఎం సందీప్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పెద్ద రాష్ట్రాల్లోనూ మా జెండా పాతాలన్నదే మా ప్రయత్నం. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలలో మా అధికారాన్ని నిలబెట్టుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో హిట్- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పవర్ కట్- 2024లో కాంగ్రెస్ దారెటు?
12 రాష్ట్రాల్లో బీజేపీ- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్- పొలిటికల్ మ్యాప్‌ను మార్చేసిన సెమీఫైనల్!