నేర చరితులను ఎన్నికల బరిలోకి దింపే రాజకీయ పార్టీలు- అందుకు తగిన కారణాలను వివరించాల్సిందే. ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు తీర్పివ్వడం స్వాగతించదగ్గ పరిణామం. నేరచరిత్ర కలిగినవారికి ఎందుకు టికెట్ ఇచ్చారో చెప్పాలంటూ నిలదీయడం ద్వారా రాజకీయ పార్టీలపై నైతికపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఎన్నికల సంఘానికి(ఈసీ) దక్కే అవకాశం ఉంది. ఒక అభ్యర్థికి టికెట్ ఎందుకు ఇచ్చారనేది ఈసీకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యతా పార్టీలపై పడుతుంది. అయితే, ఈ తీర్పు ద్వారా ప్రశ్నలు అడిగే సాధికారత సంపాదించుకున్న ఎన్నికల కమిషన్లు రాజకీయ పార్టీలపై తగినంత ఒత్తిడిని పెంచుగలుగుతాయా? ఎన్నికల్లో నేరగాళ్లకు అడ్డుకట్ట వేసే దిశగా ముందడుగు వేసేలా ఎన్నికల సంఘానికి ఈ తీర్పు తోడ్పడుతుందా? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే.
పెరుగుతున్న సంఖ్య...
నేరచరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2004లో 15వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 24శాతం సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉండేవి. 2009లో 16వ లోక్‌సభలో ఆ సంఖ్య మరో ఆరు శాతం పెరిగి, 30 శాతానికి చేరిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తరవాత ఈ విషయంలో గుణాత్మక మార్పు వస్తుందని ఆశించినా, పెద్దగా ఫలితం కనిపించలేదు. 2019లో జరిగిన ఎన్నికల ద్వారా 17వ లోక్‌సభలో క్రిమినల్ నేపథ్యంతో 43శాతం సభ్యులు చేరారు. రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లోనూ నేర చరితుల విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది నేర చరిత్ర కలిగినవారే. ఉదాహరణకు- దిల్లీలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగా, నేర చరిత్ర ఉన్నవారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. మొత్తం 70 మంది సభ్యులు ఉండే దిల్లీ శాసనసభలో 2015 ఎన్నికల్లో 24 మంది నేర చరిత్ర ఉన్నవారు గెలిస్తే, ఈసారి ఆ సంఖ్య 42కు పెరిగింది. హత్యలు, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలు నమోదైన సభ్యుల సంఖ్య 2015లో 14 ఉంటే, 2020లో ఆ సంఖ్య 37కి చేరింది. పార్లమెంటులోలాగే రాష్ట్రాల్లోనూ పరిస్థితిలో మార్పు వస్తుందని, కొత్తగా ఏర్పాటైన పార్టీగా అధికారం చేపట్టిన ఆప్ నుంచి ప్రజలు చాలా ఆశించగా, నిరాశే మిగిలింది. నిష్కల్మషమైన రాజకీయ వ్యవస్థను ప్రజల ముందు ఉంచుతామని అటు జాతీయ స్థాయిలో భాజపా, ఇటు దిల్లీలో ఆప్ చేసిన హామీలు మార్పులను ఆవిష్కరించలేకపోయాయి.
గుణగణాలకు విలువేదీ?
సుప్రీంకోర్టు ఇటీవలి తన తీర్పులో రాజకీయ పార్టీలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను సూచించింది. రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను తెలపాలని ఆదేశించింది. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను నామినేట్ చేస్తే... అందుకు రాజకీయ పార్టీలు సరైన కారణాలు చూపగలగాలని తెలిపింది. ముఖ్యంగా నేరారోపణలు లేని అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేకపోయారో కారణాన్ని వివరించాలి. పార్టీలు ఇచ్చిన సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికలతోపాటు ఒక స్థానిక భాష, ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలి. వీటిని పాటించడంలో విఫలమైతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లుగా భావించి ఈసీ నోటీసు జారీ చేయాలి. ఇలాంటి చర్యలెన్ని తీసుకున్నా రాజకీయాల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టడం అంతతేలికేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే, భారతీయ ఓటర్లలో 65శాతం పార్టీని చూసి ఓటు వేసేవారేనని, చాలా కొద్దిమంది మాత్రమే అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేస్తారని 'అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్‌డీఎస్)' నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
సంస్కరణలే శరణ్యం
ఎన్నికల సంఘం అధికారాల పరిమితిని గ్రహించిన సుప్రీంకోర్టు, 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో రాజకీయాల్లో నేరమయ నేతలను అరికట్టే పనిని పార్లమెంటుకే విడిచిపెట్టింది. తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా ఉండేలా చట్టాలను రూపొందించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. రాజకీయాల్లో నేరస్థుల ప్రవేశాన్ని అరికట్టడంలో ఈ తీర్పు ఈసీకి తగినంతగా అధికారం కల్పించకపోవచ్చు. కానీ ప్రస్తుత ప్రపంచంలో విస్తృతమవుతున్న సామాజిక మాధ్యమాలతో ప్రతి విషయం చర్చకు వస్తుండటం వల్ల పార్టీలు తమ అభ్యర్థుల గుణగణాలు, టికెట్ల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరిగితే తప్ప నేరమయ రాజకీయాలను అడ్డుకోవడం కష్టమే. ఫాస్ట్‌ట్రాక్ న్యాయవ్యవస్థ ఏర్పాటు, కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడం తప్పనిసరి. తీవ్రమైన నేరాలు రుజువైతే- కింది స్థాయి న్యాయస్థానంలో సైతం అభ్యర్థులను నిషేధించేలా మరింత కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కాలం వేగంగా మారుతున్న ప్రస్తుత సమయంలో రాజకీయాలను ప్రక్షాళించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ఆలస్యం కాకముందే మార్పు రావాలి.
- సంజయ్ కుమార్ (అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రంలో ఆచార్యులు)