కొవిడ్ కారణంగా ఉపాధి కరవై, వేతనాలు తెగ్గోసుకుపోయి ఎన్నో కుటుంబాల్లో పిల్లలు పోషకాహారం కరవై బక్కచిక్కిపోయారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎంతోమంది బాలలు కొవిడ్ కాలంలో ఊబకాయం బారిన పడ్డారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో చిరుతిళ్లు ఎక్కువగా తినడం, టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువు సంతరించుకున్నారు.
కరోనా తర్వాతే ఎక్కువ..
కరోనా ముందుతో పోలిస్తే ఆ తరవాత ఎక్కువగా పిల్లలు ఊబకాయం బారిన పడినట్లు అమెరికా వైద్య సంఘం పత్రిక అధ్యయనంలో తేలింది. 2020-21లో 5-11 ఏళ్ల మధ్య వయసున్న బాలలు సగటున 2.25 కిలోల చొప్పున బరువు పెరిగారని ఈ అధ్యయనం తేల్చింది. 12-17 సంవత్సరాల మధ్య వయసువారు సగటున రెండు కిలోల బరువు పెరిగినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చైనాలో అత్యధికంగా 1.53 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆ తరవాతి స్థానం భారత్‌దేనని (1.44 కోట్లు) అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌కు ముందు 10 నుంచి 13శాతం పిల్లల్లో మాత్రమే ఉన్న స్థూలకాయ సమస్య- ఆ తరవాత 16శాతానికి పెరిగినట్లు ఇతర పరిశీలనలు చాటుతున్నాయి. దేశంలో ప్రతి వంద మంది బాలల్లో సుమారు నలుగురు ఊబకాయంతో బాధపడుతున్నారని, అయిదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉందని నాలుగో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. బాలల్లో స్థూలకాయ సమస్యను తొలి దశలోనే నివారించకపోతే భవిష్యత్తులో ఎన్నో దుష్ఫలితాలు తలెత్తుతాయి. బాల్యంలోనే ఊబకాయం బారినపడితే అది జీవితాంతం వేధిస్తూ ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు కారణభూతమవుతుంది.
మంచి అలవాట్లతోనే..
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆహార నియమాలు, క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరిస్తేనే ఊబకాయ సమస్యకు తేలిగ్గా అడ్డుకట్ట వేయవచ్చు. స్థూలకాయానికి దారితీసే పిజ్జాలు, బర్గర్లు, చెడు కొలెస్ట్రాల్ ఉన్న ఇతర ఆహార పదార్థాలు, శీతల పానీయాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా అందించాలి. ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేసే పోషక విలువలున్న ఆహారం అందించడం శ్రేయస్కరం. ఇవి వయసుకు సరిపడా బరువు పెరగడానికి తోడ్పడతాయి. పిల్లలు ఆటలు మరచిపోయి ఎప్పుడూ ఫోన్‌లు, ట్యాబ్‌లు, టీవీలు, వీడియోగేమ్‌ల వంటి వాటికి అతుక్కుపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు సరైన వ్యాయామం ఉండటంలేదు. భారత్‌లో 72శాతం బాలలది ఇదే పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి రోజూ వారితో కనీసం గంట సేపు వ్యాయామం చేయించాలి. ఆటలు ఆడించాలి. పాఠశాలల్లో ఆటలకు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలి.
ఒత్తిడి కూడా ఊబకాయానికి ఒక కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకుని హరియాణా ప్రభుత్వం పాఠశాలల్లో యోగాను ప్రత్యేక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేయడానికి ఇతర రాష్ట్రాలూ దీని గురించి ఆలోచించాలి. కార్యాలయాల్లో ఉద్యోగులకు అయిదు నిమిషాలు యోగా విరామం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లోనూ ఈ విధానం కొనసాగేలా కేంద్రం చొరవ చూపాలి. స్థూలకాయ సమస్య విరుగుడుకు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌లోనూ బాలల్లో సైక్లింగ్‌పై ఆసక్తి పెంచాలి. జపాన్‌లోని చిన్నారుల్లో ఊబకాయ సమస్య చాలా తక్కువ. వారికి భోజనం అందించే విధానం ప్రత్యేకంగా ఉండటమే దానికి కారణం. పిల్లలు తమకు నచ్చిన ఆహారం, అదీ తక్కువగా, ఆనందంగా, స్థిమితంగా తీసుకునేలా చూస్తారు. పాఠశాలలకు, ఇతర ప్రదేశాలకు అక్కడ పిల్లలు నడిచి లేదా సైకిల్‌పై వెళ్తారు. మన దగ్గరా పిల్లలకు అలాంటివి అలవాటు చేయాలి. పిల్లల శారీరక, మానసిక ఉల్లాసానికి మేలిమి మార్గాలుగా నిలిచే ఆటపాటలు, వ్యాయామానికి సమ ప్రాధాన్యం దక్కితేనే సుదృఢ భారత్ సాకారమవుతుంది.
- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి
ఇదీ చూడండి: మనకు మనమే బరువవుతున్నామా..?