వర్షాకాలంలో భూఉపరితలంపై ఏర్పడే గుంతల(గోతుల)కు సంబంధించి జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ఇవి కొన్ని చోట్ల సహజంగా మరికొన్ని చోట్ల అసహజంగా ఏర్పడతాయి. సహజమైనవి నీటిలో సులభంగా కరిగే సున్నపురాళ్ళు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో, రెండో రకం- భూఉపరితలంపై ఒత్తిళ్లు అధికంగా ఉన్న చోట్ల ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా 10శాతం భూభాగం సున్నపు రాళ్లతో కప్పి ఉంది. భారత్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో సున్నపురాళ్లు విస్తరించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో సున్నపురాళ్లు ఉన్నప్పటికీ- చెప్పుకోదగిన రీతిలో మాత్రం కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. గుంతల వల్ల గృహాల పునాదులు దెబ్బతింటాయి. రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంది. పచ్చని చెట్లు కూలిపోతాయి. పంటపొలాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టమూ సంభవిస్తుంది. ఈ గోతుల్లో వ్యర్థాలు పేరుకుని- చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఓ అమెరికన్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ గోతుల కారణంగా ప్రపంచంలో ఏటా కనిష్ఠంగా 30 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా!
సున్నపురాళ్ళతో నీటి రసాయనిక చర్య
వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు కారణంగా నీటికి సహజంగానే కొద్దిపాటి ఆమ్లత్వ లక్షణం ఉంటుంది. ఈ నీరు భూగర్భ పొరల్లో ఉన్న సున్నపురాళ్ళల్లోకి చేరి రసాయనిక చర్యలు జరుపుతుంది. తద్వారా సున్నపురాళ్లు శిథిలమవుతాయి. గురవుతాయి. అప్పటికే రాళ్లలో పగుళ్లు ఉన్న చోట చర్యలు త్వరితగతిన చోటుచేసుకొని చివరికి అవి క్రమ క్షయానికి లోనవుతాయి. భూపొరల్లో శూన్యతకు దారితీస్తాయి. ఫలితంగా శూన్యతకుపైన ఉన్న పొరలు గట్టితనాన్ని, దృఢత్వాన్ని కోల్పోయి- కుంగిపోయి గోతులు ఏర్పడతాయి. ఈ చర్యలు ప్రకృతిలో నిరంతరం సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటి సహజ చర్యల మూలంగా 2015, 2017, 2019లలో సున్నపురాళ్లు ఎక్కువగా విస్తరించి ఉన్న కడప జిల్లాలోని బుగ్గవంక చిన్న నీటి పారుదల ప్రాంతాల్లో ఇప్పెంట, బోయనపల్లి ప్రదేశాల్లో సుమారుగా మొత్తం 250 వరకు గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఈ గోతులు 30 మీటర్ల లోతువరకు ఉన్నాయి. వీటివల్ల అక్కడ ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి భయభ్రాంతులకు లోనయ్యారు. సమీప ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో వేసవి, వర్షాకాలాల్లో ఉండే భూగర్భ జల మట్టాల తేడాల వల్ల- భూమిలోని సున్నపురాళ్లు కరిగి 2015, 2017లలో గుంతలు ఏర్పడటానికి కారణమయ్యాయి. ఈ గుంతలు అయిదు నుంచి ఎనిమిది మీటర్ల వ్యాసం, ఏడు నుంచి పది మీటర్ల లోతు కలిగి ఉన్నాయి. ఇటీవల దుంగర్గహ (రాజస్థాన్) ప్రాంతంలోని ఓ పొలంలో మూడు మీటర్లలోతుగల గుంత ఏర్పడింది.
ఎప్పుడు ఎక్కడ ఏర్పడతాయే చెప్పడం కష్టం..
భూ ఉపరితలంపై ముఖ్యంగా రవాణా మూలంగా విపరీతమైన ఒత్తిళ్లు పెరిగి, పై పొరలు దృఢత్వం, గట్టితనం కోల్పోయి రంధ్రాలు, పగుళ్ళు, పెచ్చులు ఊడిపోవటానికి కారణమవుతాయి. ఇలాంటి ఒత్తిళ్లవల్ల కొన్నిసార్లు మురుగు గొట్టాల్లో పగుళ్లు ఏర్పడతాయి. వర్షపు నీటి ప్రవాహాల తాకిడికి అప్పటికే రోడ్లపై ఏర్పడిన రంధ్రాలు, పగుళ్లు, పెచ్చుల ద్వారా నీరు భూ పొరల్లోకి చొచ్చుకుపోతుంది. ఆ నీరు అక్కడున్న మట్టిని కరిగించి, శూన్యతకు దారితీసి, చిన్న చిన్న గుంతలు ఏర్పడి, క్రమంగా పెద్దవిగా మారుతాయి. ఉదాహరణకు 2015లో దిల్లీలోని నేతాజీ సుభాష్ మార్గంలో మురుగు గొట్టం పగిలిపోవడం; 2016 నుంచి నాలుగేళ్లపాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలు, 2017లో చెన్నైలోని అన్నాసలై రోడ్డులో ఉపరితలం కుంగి ఏర్పడిన గుంతల మూలంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సున్నపురాళ్ళు ఉన్న ప్రాంతాల్లో గుంతలు ఎప్పుడు, ఎక్కడ ఏర్పడతాయో చెప్పడం చాలాకష్టం.
ప్రమాదాలబారిన పడకుండా ఇలా చేయడం మేలు..
అయితే, గుంతలు ఏర్పడటానికి ముందు నుంచే భూఉపరితలంపై కొన్ని ప్రకృతి సిద్ధమైన సహజ పరిణామాలు సంభవిస్తాయి. వాటిని సున్నితంగా, నిరంతరం శాస్త్రీయంగా పరిశీలించవలసి ఉంటుంది. చెట్లు తమంతట తామే పడిపోవడం, పునాదులు ఏటవాలుగా మారటం, వర్షాలు పడిన తరవాత చిన్న చిన్న రంధ్రాలు, గుంతలు కొత్తగా ఏర్పడటం, భూఉపరితలంపై పగుళ్లు కనిపించడం, చెరువుల్లో ఆకస్మికంగా నీటిపారుదల పెరగటం, నేలమీద వేగంగా రంధ్రాలు, గుంతలు ఏర్పడటం జరుగుతుంటుంది. సున్నపురాళ్లు లేని ప్రాంతాల్లో గోడల్లో, ఇళ్ల పునాదుల్లో అంతర్గతంగా పగుళ్లు ఏర్పడతాయి. కిటికీలు, తలుపులు బిగుసుకుపోవడం; మైదాన ప్రదేశాల్లో పగుళ్లతోపాటు భూమి కుంగడం సంభవిస్తుంది. సున్నపురాళ్లు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు- ముఖ్యంగా వర్షాకాలంలో ఎప్పటికప్పుడు భూఉపరితలం మీద సంభవిస్తున్న పరిణామాలను గమనించి, వాటిని తక్షణమే ప్రభుత్వ అధికారులకు తెలియపరచాలి. సున్నపురాళ్ళు లేని ప్రాంతాల్లోని వారు సహజ నీటి పారుదలకు, మురుగు నీటి మార్గాలకు ఆటంకాలు కలిగించరాదు. ముందుగా ఈ సమస్యలను గుర్తించి పౌరులు, ప్రభుత్వాలు సకాలంలో స్పందిస్తే తీవ్ర ప్రమాదాలు, నష్టాల బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు.
- ఆచార్య నందిపాటి సుబ్బారావు (భూగర్భ రంగ నిపుణులు)