నాణ్యమైన మానవ వనరులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. కొవిడ్ సృష్టించిన సంక్షోభంతో దాదాపు ఏడాదిన్నరగా విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇటీవల మహమ్మారి వ్యాప్తి కాస్త నెమ్మదించడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకొన్నాయి. తల్లిదండ్రుల్లో తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలనే ఆలోచన మొదలైంది. వివిధ కారణాలతో కొన్నేళ్లుగా సర్కారీ బడుల్లో చేరికలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా విద్యార్థులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. మొదటి దశ కరోనా సమయంలో నిర్వహించిన అసర్-2020 సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య రెండేళ్ల క్రితంతో పోలిస్తే గత విద్యాసంవత్సరం 1.7శాతం అధికంగా నమోదైంది. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడులకు ప్రవేశాల తాకిడి పెరగడంతో కొన్ని పాఠశాలలు 'నో అడ్మిషన్స్' బోర్డులు సైతం పెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో దాదాపు లక్షమంది, ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశం పొందారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
'కరోనా వల్ల బడ్జెట్ లేదు..'
కరోనా మూడోదశ ముప్పు ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారు. ఈ విద్యాసంవత్సరమైనా సజావుగా సాగుతుందన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగడం లేదు. నిరుడు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు రుసుములు కట్టిన తరవాత రెండోదశ కరోనా విజృంభించడంతో అకస్మాత్తుగా బడులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ తరగతులు అంతంత మాత్రమే జరిగినా అధికంగా రుసుములు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు కరోనా సంక్షోభం ప్రజల ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చదువులు భారంగా మారాయి. ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఎక్కువగా చదువుకొనే బడ్జెట్ పాఠశాలలను నడపలేమని కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దాంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్చడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సర్కారు బడుల్లో మంచి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడానికి ముందుకు వస్తున్నాయి. వాటితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారు. తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలైతే పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నాయి. ఆ మేరకు ఏటా అవి సాధిస్తున్న విజయాలు ఎన్నదగినవి. కేవలం చదువుల్లోనే కాదు- పాఠ్యప్రణాళికేతర అంశాల్లోనూ గురుకుల విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది.
అన్ని రాష్ట్రాల్లోనూ..
అందరికీ విద్యను అందించడంలో సర్కారీ బడులే కీలక భూమిక పోషిస్తాయి. దేశవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు అవే ఆధారం. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగినది. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నది నిర్వివాదాంశం. కరోనా సంక్షోభ సమయంలో ఇది ఇప్పటికే నిరూపితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లోని బోధనాభ్యసన కార్యక్రమాలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడతాయి. అయితే, ఆధునికతకు నోచుకోకపోవడం సర్కారీ విద్యావ్యవస్థలోని లోపం. మౌలిక వసతులు, మానవ వనరుల కొరత సైతం వేధిస్తోంది. దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో 11 లక్షల పైచిలుకు ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. వాటిని తక్షణం భర్తీ చేయాల్సి ఉంది. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాబట్టి వాటి ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. నూతన విద్యావిధానం సైతం ప్రభుత్వ విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అందుకే విద్యా హక్కు చట్టం పరిధిని ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేయాలని సిఫార్సు చేసింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. ఉపాధ్యాయులు ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి. బడుల్లో మౌలిక సౌకర్యాలతోపాటు, కరోనా నివారణ చర్యలు చేపట్టాలి. సర్కారు బడుల్లో చదువుకున్న వారికి ఇంజినీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం. సర్కారీ విద్యాలయాలను అందరికీ చేరువ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఇటువంటి మేలిమి విధానాలను అన్ని రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాలి.
- సంపతి రమేష్ మహారాజ్
ఇవీ చదవండి: