చిరకాల మిత్రదేశమైన నేపాల్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలు కొన్నేళ్లుగా ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆ దేశ ప్రధానిగా కేపీ ఓలీ అనుసరించిన విధానాలు- ఇరుపక్షాల నడుమ అనవసర అపనమ్మకాలకు దారితీశాయి. ఇండియా పట్ల తీవ్రస్థాయి వ్యతిరేకతను ప్రదర్శించిన ఓలీ, చైనా వైపు మొగ్గుచూపారు. ఆ పరిణామాలు భారత భద్రతకు ప్రమాదకరంగా పరిణమించాయి. ప్రజాదరణ కోల్పోయిన ఓలీ స్థానంలో నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్‌బా మళ్ళీ బాధ్యతలు స్వీకరించడం వల్ల ఇండియాతో మైత్రి దిశగా ఆశలు చిగురించాయి. గ్లాస్గో 'కాప్' సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న 'పొరుగుకు తొలి ప్రాధాన్యం' విధానంలో భాగంగా రాబోయే రోజుల్లో నేపాల్‌తో మరిన్ని చర్చలు జరగవచ్చు. 'భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలతో పాటు ఇండియాతో మన సంబంధాలు ఆచరణాత్మకం' అని ఆ దేశ మాజీ ప్రధాని జీపీ కొయిరాలా ఉద్ఘాటించడం- కాలపరీక్షకు నిలబడిన ఇండో-నేపాల్ అనుబంధాన్ని చాటుతోంది.
చైనా వలలో ఓలీ
ఆరేళ్ల క్రితం నేపాల్‌లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులోని కొన్ని అంశాలపై అప్పట్లో మాదేషీ జాతీయులు ఆందోళనకు దిగారు. దాని ప్రభావం ఇండియా నుంచి వచ్చే వస్తు సరఫరాలపై పడింది. ఈ దిగ్బంధనం వెనక భారత హస్తం ఉందంటూ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేపీ ఓలీ దుష్ప్రచారానికి పాల్పడ్డారు. దాంతో నేపాల్‌లో భారత వ్యతిరేకత పొడచూపింది. 2016లో ఆర్థిక దిగ్బంధనం తొలగిపోవడం వల్ల క్రమంగా అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. 2017 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఓలీ, ఇండియాకు వ్యతిరేకంగా చైనాతో జట్టుకట్టారు. మొదటి నుంచీ మిత్రదేశాలైన భారత్, నేపాల్‌లు- ఎలాంటి సమస్యలు ఎదురైనా చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ వస్తున్నాయి. చైనాతో సన్నిహితంగా వ్యవహరించిన ఓలీ వైఖరితో ఆ సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.
మరోవైపు పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న డ్రాగన్- సరిహద్దులను అతిక్రమించి నేపాల్ భూభాగాన్ని ఆక్రమించింది. దానిపై ఆగ్రహావేశాలు వ్యక్తంకావడం వల్ల ఆ తరవాత వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంలో ఓలీ సర్దుబాటు వైఖరి ప్రదర్శించడంపై నేపాల్‌లో నిరసనలు పెల్లుబికాయి. తన స్వార్థం కోసం ఏకంగా దేశాన్ని పణంగా పెట్టడం ఆయనకు రాజకీయంగా నష్టం కలిగించింది. తదనంతర పరిణామాల్లో ఓలీ పదవి కోల్పోయారు. అక్కడ అధికార పగ్గాలను దేవ్‌బా తిరిగి చేపట్టాక దిల్లీ, కాఠ్‌మాండూల మధ్య దూరం క్రమేణా తగ్గుతోంది. నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా- తమ తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంపిక చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వివిధ కారణాల రీత్యా దేవ్‌బా ఈసారి ఇండియాకు ఇంకా రాలేదు. గ్లాస్గోలో భేటీ సందర్భంగా పరస్పర పర్యటనలకు మోదీ, దేవ్‌బాలు ఆసక్తి చూపారు. మరోవైపు... సరిహద్దుల్లో వివాదం కొనసాగుతున్న కాలాపానీ తదితర ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని దిల్లీ స్పష్టీకరిస్తోంది. ఆ మేరకు సుగౌలీ ఒప్పందాన్ని గుర్తుచేస్తోంది. ఇరుదేశాల నడుమ 1950లో కుదిరిన శాంతి, స్నేహ ఒప్పందంలోని కొన్ని అంశాలపై నేపాల్ అభ్యంతరాలు తెలుపుతోంది. వాటికి సవరణలు చేయాలని కోరుతోంది. ఏడు దశాబ్దాలుగా ఆ దేశంలోని భారత వ్యతిరేక శక్తులకు ఆ అంశాలు ప్రచారాస్త్రాలుగా మారడం గమనార్హం.
మరుగునపడ్డ నివేదిక
ఇరుగుపొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని భారత ప్రధానిగా ఐ.కె.గుజ్రాల్ గతంలో హామీ ఇచ్చారు. ఇండియా ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉంది. భారత్, నేపాల్‌ల మధ్య ఫలవంతమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం 2016లో ఒక సంఘం ఏర్పాటైంది. ఉభయ దేశాల నుంచి నలుగురు చొప్పున ప్రతినిధులు అందులో నియమితులయ్యారు. భారత బృందానికి ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సారథ్యం వహించారు. 2018లో ఈ సంఘం తన నివేదికను రూపొందించినా- ఇరు దేశాలు ఇప్పటి వరకు దానిపై దృష్టిసారించ లేదు. 1950 ఒప్పందం స్థానంలో ఆ నివేదికను అమలులోకి తీసుకురావాలని సంఘం సిఫార్సుచేసింది. భారత్-నేపాల్ మధ్య రాకపోకలపై ప్రస్తుతం ఎలాంటి నియమ నిబంధనలు లేవు. సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడం కోసం గుర్తింపు పత్రాల తనిఖీని ప్రవేశపెట్టాలని సంఘం సూచించింది. మానవ అక్రమరవాణా, ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని ఉద్ఘాటించింది. వాణిజ్యం, జలవనరులతో సహా ఇరు దేశాల మధ్య సంబంధాలు, సాంస్కృతిక అంశాలకు సంబంధించి సంఘం సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. చైనాకు, ఇండియాకు మధ్య ఉన్న నేపాల్ వ్యూహాత్మకంగా కీలక దేశం. అక్కడ డ్రాగన్ ప్రభావం పెరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేపాల్‌తో తిరిగి పూర్తిస్థాయి సంబంధాలు నెలకొల్పుకోవడానికి సత్వరం చర్యలు తీసుకోవాలి.
- కె.శ్రీధర్
ఇదీ చూడండి : UP election 2022: ఎన్నికల వేడి- ఊపందుకున్న విగ్రహ రాజకీయాలు