ETV Bharat / opinion

రాజకీయ చట్రంలో 'రాజ్యాంగ' సంస్థలు.. అడుగడుగునా అడ్డంకులు.. సంస్కరణలు అవసరమే!

ప్రజాస్వామ్య పరిపుష్టికి, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను భారత రాజ్యాంగం కొలువుతీర్చింది. పార్లమెంటు చట్టాల ద్వారా కొన్ని చట్టబద్ధ సంస్థలూ ఏర్పాటయ్యాయి. పోనుపోను అవి నీరుగారిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

national constitution day special essay
national constitution day special essay
author img

By

Published : Nov 27, 2022, 9:02 AM IST

ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం భారత్‌ సొంతం. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు రాజ్యాంగం విడివిడిగా అధికారాలనిచ్చింది. ఆధునిక కాలంలో పరిపాలన అనేది పోనుపోను సంక్లిష్టంగా మారుతున్నందువల్ల ప్రభుత్వమే అన్ని పనులూ చేయలేదు. అందుకే కొన్ని ముఖ్యమైన పాలన విధుల నిర్వహణకు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలను రాజ్యాంగం కొలువుతీర్చింది.

అవసరమైతే కొత్త సంస్థల ఏర్పాటుకూ అనుమతిస్తోంది. ఈ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను రాజ్యాంగ సంస్థలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసేలా చూడటానికి, పౌరుల ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి న్యాయవ్యవస్థతోపాటు రాజ్యాంగ సంస్థలూ బాధ్యత వహిస్తాయి. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు కొన్ని అంశాల్లో రాజ్యాంగం నిర్దేశించిన పరిధిని దాటకుండా జాగ్రత్త తీసుకుంటాయి.

అడుగడుగునా అడ్డంకులు
ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలంటే స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగడం తప్పనిసరి. రాజ్యాంగం ఆ బాధ్యత నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రజాధనాన్ని ఖర్చు చేసే ప్రతి ప్రభుత్వ విభాగం ఆ పనిని సక్రమంగా చేస్తోందా లేదా అనేది తనిఖీ చేసే బాధ్యతను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు అప్పగించింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీకి ఫైనాన్స్‌ కమిషన్‌ను, అధికార వికేంద్రీకరణకు అంతర్రాష్ట్ర మండలిని, సివిల్‌ సర్వీసు ఉద్యోగాలు, పదవుల భర్తీకి కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ), రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను నెలకొల్పింది.

మైనారిటీలు, వెనకబడిన, అణగారిన వర్గాల కోసం వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేసింది. ఇవన్నీ రాజ్యాంగ సంస్థలే. వీటికి అధికారాలు రాజ్యాంగం ద్వారానే సంక్రమిస్తాయి. రాజ్యాంగ సంస్థలను సృష్టించాలన్నా, వాటిలో మార్పుచేర్పులు చేయాలన్నా ప్రైవేటు బిల్లుతో కానీ, ప్రభుత్వ బిల్లుతో కానీ పని జరగదు. రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాల్సిందే. కేంద్ర మంత్రివర్గ సిఫార్సుతో రాష్ట్రపతి రాజ్యాంగ సంస్థలకు నియామకాలు జరుపుతారు. ప్రభుత్వ జోక్యానికి అతీతంగా కీలక పాలనా విధులను నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థలను ఏర్పరిచారు. ప్రభుత్వం తరఫున కొన్ని ముఖ్యమైన విధులను చేపట్టడానికి చట్టబద్ధ సంస్థలను నెలకొల్పారు.

రాజ్యాంగం ద్వారా కాకుండా పార్లమెంటు చట్టాల ద్వారా ఏర్పడేవి చట్టబద్ధ సంస్థలు. లోక్‌పాల్‌, లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కేంద్ర సమాచార కమిషన్‌ వంటివన్నీ ఇలా ఏర్పడినవే. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చట్టబద్ధ సంస్థ కానీ, రాజ్యాంగ సంస్థ కానీ కాదు. అది దిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ.

సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల పనితీరును సమీక్షించడానికి ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ను నెలకొల్పారు. అవినీతి ఆరోపణల దర్యాప్తునకు లోక్‌పాల్‌ చట్టం తెచ్చారు. పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకు వివిధ చట్టాలు, ప్రత్యేక సంస్థలు తోడ్పడుతున్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగాలు. 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ వంటిది.

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు సరైనవాళ్లు కాకపోతే ఫలితం దారుణంగా ఉంటుంది. రాజ్యాంగంలో లోపాలున్నా అది గొప్పవాళ్ల చేతిలో పడితే మరింత గొప్పగా అమలవుతుంది.

- డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

ఇటీవలి కాలంలో రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థల్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందని విమర్శలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వాటి పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. లోక్‌పాల్‌ చట్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితమే తెచ్చినా దాని అమలుకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. లోక్‌పాల్‌ నియామక బృందంలో ప్రతిపక్ష నాయకుడికీ సభ్యత్వం కల్పించాల్సి ఉన్నా, దీర్ఘకాలం మోకాలడ్డారు.

ప్రభుత్వోద్యోగులు తమ ఆస్తిపాస్తుల వివరాలను సర్కారుకు నివేదించాలన్న నిబంధననూ నీరుగార్చారు. ఇతర సంస్థల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పంజరంలో చిలక దశ నుంచి ప్రభుత్వం ప్రత్యర్థులపై ఉసిగొల్పే స్థాయికి సీబీఐ దిగజారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యుద్ధ విమానాల కాంట్రాక్టుపై దర్యాప్తు జరుపుతానని ఒక సీబీఐ సంచాలకులు ప్రకటించగానే, రాత్రికి రాత్రే ఆయన్ను తొలగించి వేరేవారిని ఆ పదవిలో కూర్చోబెట్టడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. దేశంలో అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారంటేనే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ
ప్రస్తుతం ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలకు సభ్యుల నియామకంపై న్యాయవ్యవస్థ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సరైన ఎంపిక ప్రక్రియను చేపట్టి ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని న్యాయపాలిక పిలుపిస్తోంది. నిజాయతీ, నిష్పాక్షికత, అనుభవం కలిగిన వారిని రాజ్యాంగ సంస్థల సభ్యులుగా నియమించాలి. అందుకు ఎంపిక ప్రక్రియను కట్టుదిట్టం చేయాలి.

ప్రస్తుతం రాజ్యాంగాన్ని ఒక పద్ధతి ప్రకారం బలహీనపరచే ప్రక్రియలు గుట్టుగా సాగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరకూడదు. న్యాయం, సమానత్వాల ప్రాతిపదికపై ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అనుసరించడమే శరణ్యం. సాధారణంగా పాలకుల అవకతవకలపై గళమెత్తడానికి సామాన్యులు వెనకాడతారు. వారి సమస్యలను పరిష్కరించడానికి, వారి హక్కులను కాపాడటానికి రాజ్యాంగ సంస్థలు ఆవ శ్యకం. అవినీతిపై పోరు విజయవంతం కావాలంటే రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిందే.

సంస్కరణలు అవసరం
రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులను జవాబుదారీగా చేయడానికి ప్రస్తుత రాజ్యాంగ సంస్థలను మరింత పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాజ్యాంగ సవరణల ద్వారా కొత్త సంస్థలను రూపొందించాలి. మన చట్టాలు, విధానాలు, సంస్థల్లో తగిన మార్పుచేర్పులు చేయడానికి సంస్కరణలను చేపట్టాలి. లోక్‌పాల్‌, లోకాయుక్త సంస్థలు అవినీతి ఆరోపణల దర్యాప్తునకు సీబీఐ వంటి వాటిపైనే ఆధారపడతాయి.ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి, సొంత దర్యాప్తు యంత్రాంగాలను ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలోనే లోకాయుక్తలు అవినీతిపై గట్టిగా పోరాడుతున్నాయి. ఇలాంటి వ్యవస్థలను మరింతగా బలోపేతం చేయాలి. -పీవీఎస్‌ శైలజ
(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.