ETV Bharat / opinion

పూల కుండీలా ఆప్తుల జ్ఞాపకాలు.. 'హరిత సమాధి' గురించి విన్నారా? - హరిత సమాధి విధానం

అమెరికాలో ఆప్తులను కోల్పోయినవారు నెల రోజుల తరవాత అందమైన పూలకుండీని ఇంటికి తెచ్చుకుంటున్నారు. దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ తమలోని బాధను మరచిపోతున్నారు. ఆ కుండీలోని మట్టి మృతదేహంతో తయారైనది కావడమే ఇందుకు కారణం! పర్యావరణానికి మేలుచేసేలా, గౌరవప్రదంగా నిర్వహించే 'హరిత సమాధి' విధానం ఈ మధ్య ప్రాచుర్యం పొందుతోంది.

human composting
హ్యూమన్ కంపోస్టింగ్
author img

By

Published : Jan 19, 2023, 7:30 AM IST

నిపోయినవారి మృతదేహాలను సేంద్రియ ఎరువుగా మార్చే అత్యాధునికమైన ప్రక్రియకు అమెరికాలోని న్యూయార్క్‌ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ఆమోదం తెలిపింది. 'హ్యూమన్‌ కంపోస్టింగ్‌'గా పిలిచే ఈ విధానాన్ని తొలిసారిగా 2019లోనే వాషింగ్టన్‌ రాష్ట్రం చట్టబద్ధం చేసింది. కొలరాడో, ఒరెగాన్‌, వెర్మాంట్‌, కాలిఫోర్నియాలు దీన్ని అనుసరించాయి. ప్రజల నుంచి మద్దతు పెరగడంతో డెలవేర్‌, ఇల్లినాయిస్‌, మసాచుసెట్స్‌, మిన్నెసోటా తదితర రాష్ట్రాలూ ఇందుకు బిల్లులు రూపొందాయి.

వివిధ సంప్రదాయాల ప్రకారం మృతదేహాన్ని దహనం లేదంటే ఖననం చేయడమే ఎక్కువ. వీటికి ప్రత్యామ్నాయంగా 'హరిత సమాధి' విధానంపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రపంచంలో ఏటా సగటున 5.6కోట్ల మంది కాలం చేస్తున్నారు. భారత్‌లో రోజూ సుమారు 28 వేల మంది కన్నుమూస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో శ్మశానాలు నిండిపోయి, శవాలను పూడ్చిపెట్టేందుకు చోటుదక్కడం గగనమే అవుతోంది. కొవిడ్‌-19 ఉద్ధృతి వేళ ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల మృతదేహాలను గుట్టలుగా పేర్చి తగలబెట్టడం యావత్‌ మానవాళిని కలచివేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇజుమ్‌ తదితర నగరాల్లో చనిపోయినవారి మృతదేహాలు వారాల తరబడి ఎవరి దృష్టికీ రాలేదు. మార్చురీల్లో పేరుకుపోతున్న అనాథ శవాలెన్నో!

ఒక మృతదేహాన్ని దహనంచేస్తే సుమారు 190 కిలోల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుందని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ లెక్కగట్టింది. జీవనవ్యయం మాదిరే అంత్యక్రియల ఖర్చూ అంతకంతకు పెరుగుతోంది. అమెరికాలో 2021లో ఒక్కో అంతిమసంస్కారానికి సగటున సుమారు రూ.6.40 లక్షలు (7,848 డాలర్లు) ఖర్చయినట్లు నేషనల్‌ ఫ్యూనరల్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీఏ) గణాంకాలు చెబుతున్నాయి. పేద కుటుంబాలపై ఇది మోయలేని భారమే! పార్థివ దేహాలను ఎరువుగా మారిస్తే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని, కన్నుమూసిన వారిని మట్టిలో కలిపే సంప్రదాయాలను గౌరవించినట్లూ అవుతుందన్న భావన బలపడుతోంది. మరణానంతరం తాము ఎరువుగా మారి మొక్కల రూపంలో వికసిస్తామంటే అంతకుమించిన ఆనందం ఇంకేం ఉంటుందంటూ ఇప్పటికే వేలమంది అమెరికన్లు 'హ్యూమన్‌ కంపోస్టింగ్‌' కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశంలో 2035 నాటికి 15శాతం ఈ విధానాన్నే ఎంపిక చేసుకుంటారన్నది ఎన్‌ఎఫ్‌డీఏ అంచనా!

వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన, సూక్ష్మజీవుల శాస్త్రవేత్త లీన్‌ కార్పెంటర్‌-బాగ్స్‌ నాలుగేళ్లపాటు పరిశోధన సాగించి మృతదేహాలను ఎరువుగా మార్చే ప్రక్రియను కనుగొన్నారు. ఈ విధానంలో ఒక మృతదేహాన్ని ఎరువుగా మార్చేందుకురూ.5.70లక్షల (7,000 డాలర్ల) వరకు ఖర్చవుతోంది. పోనుపోను ఈ వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్త లీన్‌ పరిశోధన ఆధారంగానే రీకంపోస్‌, రిటర్న్‌హోమ్‌ వంటి సంస్థలు హరిత సమాధి సేవలను అందిస్తున్నాయి.

పూడ్చిపెట్టిన శరీరం భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి నెలల సమయం పడుతుంది. కొత్త విధానంలోనైతే 30 రోజుల్లోనే అది ఎరువుగా మారుతుంది. ఈ ప్రక్రియలో మృతదేహాన్ని ప్రత్యేకమైన పెట్టెలో ఉంచి... చెక్కపొట్టు, కంపోస్టు పదార్థాలు, అధిక వేడిని తట్టుకునే బ్యాక్టీరియా మిశ్రమాన్ని దానికి కలుపుతారు. అనంతరం నాలుగు గంటలపాటు సుమారు 150డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతను ఆ పెట్టెలోకి పంపుతారు. తద్వారా శరీరంలోని హానికర సూక్ష్మజీవులు నశించి, ఎలాంటి సాంక్రామిక వ్యాధుల ముప్పూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నెలరోజుల అనంతరం ఇది సుమారు ఒక టన్ను సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. తరవాత దీన్ని మృతుల కుటుంబసభ్యులకు మొక్కలు పెంచుకోవడానికి అందిస్తారు. అటవీ ప్రాంతాలను సారవంతం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ ఎరువును వినియోగిస్తున్నాయి. పవిత్రంగా భావించే ఈ పదార్థాన్ని పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు మాత్రం ఇవ్వరు. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా అమెరికాలోని మరిన్ని రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, స్వీడన్‌ వంటి దేశాలు హ్యూమన్‌ కంపోస్టింగ్‌ను చట్టబద్ధంచేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయి. కొద్ది సంవత్సరాల్లోనే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది పర్యావరణవేత్తల దృఢ విశ్వాసం!
-- టి.రఘుబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.