ఇటీవల తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అడ్డగూడూరు పోలీసుస్టేషన్లో రెండు లక్షల రూపాయలు దొంగలించారనే కారణంగా తల్లీకుమారులైన మరియమ్మ, ఉదయ్‌కిరణ్‌లపై కేసు నమోదయింది. విచారణ పేరుతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో తల్లి మరియమ్మ మరణించారు. కుమారుడు ఉదయ్‌కిరణ్ ఓ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. మరియమ్మ మృతికిగల కారణాలపై నిగ్గు తేల్చాలని స్పష్టంచేసింది.
పోలీస్ కస్టడీ మరణాలు ఏటా వందల సంఖ్యలో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి 2020 ఏప్రిల్ 17న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి 31 వరకు 113 మంది పోలీసు కస్టడీలో మరణించినట్లు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. దేశంలో సగటున వారానికొకరు చొప్పున కస్టడీలో మరణిస్తున్నట్లు అంచనా. దోపిడి, దొంగతనాలు, అఘాయిత్యాల కేసుల్లో చిక్కుకున్నవారే ఎక్కువగా పోలీస్ కస్టడీలో బందీలుగా ఉంటున్నారు. అలాంటి వారిపట్ల పోలీసులు అతిగా ప్రవర్తించి హింసలు పెడితే తాళలేక ఠాణాల్లోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన రక్షకభటులే ఇలాంటి దారుణాలకు ఒడిగడితే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఎక్కడిది? పోలీసులు సామాన్య ప్రజలపై ప్రతాపం చూపడంకన్నా, నేరారోపణలను రుజువు చేసి న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరంగా శిక్షలు పడేలా చేయడం సముచితంగా ఉంటుంది.
జైలు-హింస..
ఏదైనా ఒక నేరంపై ఫిర్యాదు అందిన తరవాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తారు. ఆ సమయంలో కేసు బాధ్యతలు చేపట్టే పోలీసు అధికారులు నిందితులను విచారించవచ్చు. అయితే నిందితులను 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ ప్రక్రియను అనుసరించడం లేదు. మరోవైపు, కోర్టునుంచి కస్టడీకి తీసుకున్నప్పుడు సైతం నిందితులను రోజుల తరబడి ఠాణాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నంత కాలం వారికి హింస తప్పడం లేదు. దానివల్ల వందల మంది చనిపోతున్నట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తన నివేదికలో స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సరైన సమాచారం సేకరించడానికి, లేదా చేయని తప్పును ఒప్పించేందుకు పోలీసులు అనేక రకాల హింసాత్మక ప్రక్రియలను ప్రయోగిస్తున్నారు. ప్రధానంగా దోపిడి దొంగతనాల కేసుల్లో అమాయకుల్ని హింసించి నేరాన్ని ఒప్పించే సందర్భంలో తమిళనాడు, గుజరాత్, పంజాబ్, బిహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అనేకమంది చనిపోయినట్లు జాతీయ హింసా వ్యతిరేక పోరాట సంస్థ వెల్లడించింది. మహిళలైతే కస్టడీలో లాఠీ దెబ్బలతోపాటు లైంగిక హింసను భరించాల్సి రావడం చేదునిజం.
2019 జులై మూడోతేదీన, 35 ఏళ్ల దళిత మహిళను రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సర్దార్‌షహర్ ఠాణాలో తొమ్మిది మంది పోలీసు సిబ్బంది అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. పలురకాల చిత్రహింసలకు గురిచేసి, కస్టడీలోనే అత్యాచారం చేసిన ఫలితంగా, ఆమె ప్రాణాలు విడిచారు. అదేవిధంగా జువెనైల్ జస్టిస్ చట్టం, 2015 ప్రకారం పిల్లలను అక్రమంగా నిర్బంధించి హింసించడం నేరం. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘించడంతో పోలీసు కస్టడీలో హింసకు గురై గుజరాత్, తమిళనాడులో నలుగురు పిల్లలు మరణించారు.
పోలీసు వ్యవస్థదే బాధ్యత..
పోలీస్ కస్టడీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. 2017 అక్టోబర్‌లో భారత న్యాయ సంఘం హింసా నిరోధక బిల్లు ముసాయిదాను లోక్‌సభలో సమర్పించినప్పటికీ అది ఆమోదం పొందలేకపోయింది. ఆ బిల్లు ఆమోదం పొంది ఉంటే, మూడేళ్ల కాలంలో ఎంతోమంది ప్రాణాలకు రక్షణ లభించేది. జాతీయ హింసా వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 2019 సెప్టెంబర్ అయిదో తేదీన సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రయోజనం లేకపోయింది. గతంలో 2019 ఆగస్టు 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నేరమని స్పష్టం చేశారు. అయినప్పటికీ హింసను చట్టబద్ధంగా నిషేధించే విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి గతంలో రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో అణగారిన వర్గాలపై జరిగే హింసను నియంత్రించే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో మరియమ్మ లాంటి మరెందరో దళితులు పోలీసుల హింసకు బలవుతూనే ఉంటారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది.
- డాక్టర్ సిలువేరు హరినాథ్
('సెస్'లో రీసెర్చ్ అసిస్టెంట్)
ఇవీ చదవండి: