ప్రతి పరిశోధనా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. పరిశోధన అంటే కొత్త భావనలను తరచి ప్రశ్నించి నిజాలను నిగ్గుతేల్చడమే. అది విద్వత్తుకు ప్రాథమిక దశ. పరిశోధన మేధా పరిధిని విస్తరిస్తుంది. సిసలైన వైద్యుడు రోగి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. అంటే, పరిశోధనా తృష్ణ ఉన్న ప్రతి వైద్యుడూ నిత్య విద్యార్థే. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి విద్యార్థీ పరిశోధకుడిగా రాణించగలడు. పరిశోధన అంటే తెలియని విషయాలను శోధించి తెలుసుకోవడమే. శాస్త్ర పరిశోధన అత్యంత ఉత్తేజభరిత, ఫలవంతమైన కార్యకలాపం. ఆరోగ్య సంరక్షణలో, వైద్య రంగంలో అనునిత్యం కొత్త పరిణామాలు సంభవిస్తూ చికిత్సా పద్ధతులను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాయి. వైద్య విద్యార్థిగా నేర్చుకొన్న అంశాలకు వేగంగా కాలం చెల్లిపోతూ- కొత్త విషయాలను నేర్చుకోవలసిన అవసరం వెంట తరుముతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో కనిపెడుతున్న కొత్త అంశాలను ప్రతి వైద్యుడూ ఆపోసన పడుతూ తన చికిత్సా పద్ధతులకు నిరంతరం పదునుపెట్టుకుంటూ ఉండాలి. పరిశోధనలో వెల్లడయ్యే అంశాలను స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. వైద్య, ప్రయోగాత్మక పరిశోధనలు ప్రధానంగా లేబొరేటరీలలో జరుగుతాయి. దానికి ముందే పూర్వ పరిశోధకులు వెల్లడించిన అంశాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాన్ని సందర్శించాలి. మన వైద్యకళాశాలల్లో అధ్యాపకులు పరిశోధన పద్ధతులను విద్యార్థులకు అలవరచడం లేదని, పరిశోధనలకు కావలసిన మౌలిక వసతులు వైద్య కళాశాలలకు లోపించాయని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ లోపాలవల్లే వైద్య పరిశోధనల్లో మనం ముందంజ వేయలేకపోతున్నాం.
వైద్య పరిశోధనల్లో వెనకబాటుతనం ప్రజారోగ్య సంరక్షణలో వైఫల్యాలకు కారణమవుతోంది. దీన్ని తక్షణం అధిగమించాలి. మానవ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా కొత్త తరహా వైద్య పరీక్షలు, చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మనం వేగంగా అందిపుచ్చుకోవాలి. కొత్త మందుల ఆవిష్కరణ సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. జంతువులపై ప్రయోగాల ఫలితాలను విజయవంతంగా మానవులకు అన్వయించగలగాలి. విచ్చలవిడి యాంటీబయాటిక్స్ వాడకాన్ని అరికట్టి మందులకు లొంగని బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించాలి. మాలిక్యులార్ బయాలజీ, హైటెక్ చికిత్సా పద్ధతులు రోగ చికిత్సను విప్లవీకరిస్తున్నాయి. వాటిని భారతీయ వైద్య రంగం ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. వేగంగా మారిపోతున్న వైద్య సంవిధానాల్లో నిష్ణాతులు కావడానికి వైద్యులు నిరంతరం కృషి చేయాలి. ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అధునాతన వైద్యానికి, నైతిక విలువలకు మధ్య ఘర్షణకు తావులేకుండా జాగ్రత్త వహించాలి. ఈ సవాళ్లను విజయవంతంగా అధిగమించడానికి మన వైద్య విద్యా సంస్థలు, వైద్య సంఘాలు సమాయత్తం కావాలి.
పరిశోధన అంటే సమస్య మూలాలను తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడమే. లోతుగా పరిశీలించకుండా స్థిరాభిప్రాయానికి రావడం లేదా ఆరోపణలు చేయడం శాస్త్రీయ దృక్పథమనిపించుకోదు. సంక్షోభం వచ్చిపడినప్పుడే దాన్ని ఎదుర్కోవడమెలాగన్న ఆలోచన వస్తుంది. ఆ భావన నుంచే పరిశోధన ఊపందుకొని వినూత్న పరిష్కారాలు పుడతాయి. న్యూటన్, ఐన్‌స్టీన్‌ల మాదిరిగా ఒంటరిగా పరిశోధనలు సాగించి అద్భుతాలు సృష్టించడం ఈ రోజుల్లో కష్టసాధ్యం. సహచర శాస్త్రజ్ఞులు లేదా పరిశోధకులతో కలిసి నూతన విషయాలు ఆవిష్కరించాలి. ఒక జట్టుగా కలిసికట్టుగా సహకార భావనతో ముందుకు సాగాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలనే తపన జట్టు సభ్యులందరిలో రగలాలి. అందుకు దీక్షాదక్షతలతో నిర్విరామ కృషి చేయకపోతే ఆశించిన ఫలితాలు సిద్ధించవు. పరిశోధనా ఫలాలు అద్భుతంగా తోస్తాయి కానీ, అవి వాస్తవిక ప్రపంచంలో మెరిసిన ఆలోచనలు, నిబద్ధతతో కూడి పరిశ్రమ ద్వారానే ఫలవంతమవుతాయి. కార్యరూపం ధరించి లోకానికి మేలు చేస్తాయి.
వైద్యం, వ్యవసాయాలలో పరిశోధనలు ప్రజల జీవితాలను ఎంతో మెరుగుపరచాయి. ఆహారోత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచి, మొండి రోగాలను సైతం నయం చేయగల సత్తాను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య పరిశోధనలు అసంఖ్యాక ప్రజానీకం ప్రాణాలను రక్షించాయి. ఒకప్పుడు అంటువ్యాధుల వల్ల, మహమ్మారుల వల్ల ఎంతోమంది మరణించేవారు. వాటికి సమర్థమైన చికిత్సలు కనుగొన్నందువల్లే నేడు మానవ జనాభా ఇంతగా విస్తరించింది. గడచిన శతాబ్ద కాలంలో సమర్థ చికిత్సల వల్ల మానవుల ఆయుర్దాయం పెరుగుతూ వచ్చింది. పరిశోధనలో వైఫల్యాలు, తప్పటడుగులు సహజమే. కాలక్రమంలో ఆ పొరపాట్ల నుంచే అనుభవం వస్తుంది. అది కొత్త పరిశోధనలను దిగ్విజయంగా చేపట్టే సామర్థ్యాన్ని కల్పిస్తుంది.
- ప్రొఫెసర్ ఎం.వి.రాఘవేంద్రరావు
(వైద్య పరిశోధనారంగ నిపుణులు)
ఇదీ చూడండి: ముందస్తు చర్యలు కొరవడి... వరదలు!