ఒప్పంద సేద్యాన్ని(కాంట్రాక్టు ఫార్మింగ్) ప్రోత్సహించాలని ఈ నెల ఒకటిన ప్రారంభమైన కొత్త రబీ పంటకాలం నుంచే కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. రైతులకు అన్యాయం జరుగుతుందని పలు రాష్ట్రాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కేంద్రం పట్టుదలతో తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో- ఒకటి ఒప్పందసేద్యానికి సంబంధించింది. మరోవైపు ఈ నెల ఒకటి నుంచే కొత్త 'చక్కెర ఏడాది' ప్రారంభమైంది. ఈ నెల నుంచే కొత్త చెరకు పంటను మిల్లులు గానుగాడటం ప్రారంభించి చక్కెర ఉత్పత్తి చేస్తాయి. ఏటా అక్టోబరు నుంచి మరుసటి సంవత్సరం సెప్టెంబరు వరకు చక్కెర ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చక్కెర మిల్లులు, చెరకు రైతులు పరిగణిస్తారు.
వాస్తవానికి ప్రస్తుత కొత్త చట్టంతో ప్రమేయం లేకుండా దేశంలో చాలా ఏళ్ల నుంచే ఒప్పంద సేద్య విధానం కింద చెరకు సాగు చేస్తున్న రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈ పంట సాగుచేయడానికి చక్కెర మిల్లులతో ఏటా సీజన్‌కు ముందే ఒప్పందసేద్యం పేరుతో పత్రాలు రాసుకుంటున్న రైతులకు చివరికి పంట అమ్ముకుంటే మద్దతు ధర అందడం లేదు. పెట్టుబడి ఖర్చుకన్నా తక్కువ ధర చెల్లించే మిల్లులు ఆ కాసింత సొమ్మునైనా నెలల తరబడి ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. చెరకు ధర రావడం లేదని రైతులు వాపోతుంటే, చక్కెరకు డిమాండు లేక నష్టపోతున్నామని మిల్లులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు నుంచి చక్కెర ఉత్పత్తిని తగ్గించి, ఇథనాల్ తయారీని పెంచాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.
కర్షకులకు లభించని భరోసా
దేశంలో చక్కెర ఉత్పత్తి 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 2006-07లో 2.84 కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తయితే- గత నెలాఖరుతో ముగిసిన 2019-20లో 2.72 కోట్ల టన్నులే వచ్చింది. వాస్తవానికి 2018-19తో పోలిస్తే ఏకంగా 50 లక్షల టన్నులు తగ్గింది. చక్కెర సరైన డిమాండు, ధర లేదని, చెరకు పంటకు రైతులకు మిల్లులు సకాలంలో సొమ్ము చెల్లించడం లేదు. ఉదాహరణకు 2019-20లో చెరకు అమ్మిన రైతులకు రూ.75,585 కోట్లు చెల్లించాలి. కానీ గత నెల 11 నాటికి ఇంకా రూ.12,994 కోట్లు చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఇవే కాకుండా 2016 నుంచి రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు మరో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. చక్కెర చట్టం ప్రకారం చెరకు పంటను మిల్లుకు ఇచ్చినప్పటి నుంచి 14 రోజుల్లోగా సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో మిల్లు యాజమాన్యాలు జమచేయాలి. ఈ నిబంధనను చాలా మిల్లులు ఖాతరు చేయడంలేదు.
సమీప భవిష్యత్తులో దేశ చక్కెర రంగాన్ని ఇథనాల్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం చేయనుందని అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌కు చక్కెర ఎగుమతుల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో అయిదు కోట్ల రైతు కుటుంబాలు చెరకు పంటపై, చక్కెర రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ కుటుంబాలకున్న సగటు భూమి కమతం విస్తీర్ణం అయిదు ఎకరాల్లోపే. ఒప్పంద సేద్యంతో రైతులకెంతో ప్రయోజనాలుంటాయని కొత్తచట్టంపై కేంద్రం చెబుతున్నదే నిజమైతే- చెరకు రైతులకిన్ని కష్టాలెందుకున్నాయనేది కీలకప్రశ్న. చెరకుపంటకు ఏటా 'సలహాధర'ను కేంద్రం ప్రకటిస్తోంది. క్వింటాలు చెరకు పండించడానికి రూ.300కు పైగా ఖర్చవుతుంటే ఈ ఏడాది రూ.285 చెల్లించాలని కేంద్రం ప్రకటించడం అన్యాయమని రైతుసంఘాలు మండిపడుతున్నాయి. పెట్టుబడి వ్యయానికి తగిన ధరను ఇవ్వాలని కేంద్రమే చెప్పకపోతే ఇక ఒప్పందసేద్యం చేయించే మిల్లులెలా ఇస్తాయి?
పెట్రోలు, డీజిల్ వినియోగం వల్ల మనదేశంలోని నగరాలు, పట్టణాలతో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీన్ని తగ్గించడానికి జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలూ చెబుతున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోలు జీవ ఇంధనంగా కాలుష్యం తగ్గించడానికి ఉపకరిస్తుందని అవి సూచిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చెరకు పండిస్తూ చక్కెర, ఇథనాల్ ఉత్పత్తి చేయడంలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంలో బ్రెజిల్ అనుభవాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో మనదేశంలో అదనంగా 400 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు ఉద్దేశించిన 362 ప్రాజెక్టులను కేంద్రం ఇప్పటికే ఆమోదించింది. వీటిలో రూ.18,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లక్ష్యం నెరవేరితే మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 755 కోట్ల లీటర్లకు పెరుగుతుంది. తద్వారా 2030 నాటికి పెట్రోలులో 20శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని చేరగలమనేది కేంద్రం అంచనా.
ఇందులో భాగంగా 2022 నాటికి పెట్రోలులో 10శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని తొలుత సాధించాలని నిర్ణయించింది. ఇథనాల్ కలపడం వల్ల 2018-19లో 190 కోట్ల లీటర్ల పెట్రోలు మిగిలింది. ప్రస్తుతం దేశంలో చక్కెర మిల్లులకు 350 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ ఈ ఏడాది 511 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. అంత ఉత్పత్తి సామర్థ్యం మిల్లులకు లేనందువల్ల వాటిని తక్షణం ఆధునికీకరించాలి. ఇథనాల్‌కు డిమాండు బాగా ఉన్నందున ఈ ఏడాది ధర పెంచి కొనడానికి సిద్ధమని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇథనాల్ లీటరు ధర గతేడాది రూ.59.48; అది మరో మూడు రూపాయల మేర అదనంగా పెరిగే అవకాశముంది.
ఇథనాల్‌తో ఇక్కట్లు తీరేనా?
చక్కెర ఉత్పత్తి తగ్గించకపోతే చెరకు రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించే అవకాశాలు లేవని మిల్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. చక్కెరకు బదులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడమొక్కటే ఇందుకు ఏకైక మార్గమని వాటి వాదన. మిల్లుల నుంచి ఇథనాల్‌ను కొంటున్న చమురు సంస్థలు 30 రోజుల్లో సొమ్ము చెల్లిస్తున్నాయి. కానీ చక్కెర అమ్మితే సొమ్ము రావడం లేదని రైతులకు మిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదు. కచ్చితంగా నెలరోజుల్లో సొమ్ము చేతికొచ్చేందుకు ఇథనాల్ ఉత్పత్తి పెంపు ఒక్కటే మార్గమనే మిల్లుల వాదనను కేంద్రమూ సమర్థిస్తోంది. చమురుకున్న ప్రాధాన్యం దృష్ట్యా చెరకు నుంచి నేరుగా ఇథనాల్ తయారీకే ప్రత్యేకంగా మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. చెరకు పంట సాగుచేయడానికి రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్న మిల్లులు ఏం చెప్పినా వారు వినక తప్పని పరిస్థితి నెలకొంది. మిల్లు కాదంటే బయట పంటను అమ్మలేరు. కొత్త చట్టంవల్ల కంపెనీల ఆంక్షల మేరకు రైతులు నడుచుకోవాల్సి వస్తుందనేది ప్రతిపక్షాల ఆందోళన. చెరకుసాగు, చక్కెర ఉత్పత్తిలో భారత్- బ్రెజిల్ తరవాత రెండోస్థానంలో ఉంది. చెరకు సాగుకు ఒప్పందసేద్యం పక్కాగా అమలవుతున్నా రైతులకు ఆదాయం పెరగడం లేదు. ఇథనాల్ ఉత్పత్తి, చక్కెర ఎగుమతులను గణనీయంగా పెంచితేనే అది సాధ్యమని అందరూ గుర్తించాలి. మిగతా పంటలకు ఒప్పందసేద్యం అమలైతే ఇలాంటి పరిస్థితి రాదనే భరోసానూ ప్రభుత్వాలు రైతులకు కల్పించాలి.
రచయిత- మంగమూరి శ్రీనివాస్