ETV Bharat / opinion

బతికించే చదువుల కోసం... - ఇండియాలో చదువులు

ఈకాలంలో చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉపాధి దొరుకుతోంది. ఈ తరుణంలో ఉద్యోగార్హత కలిగిన పట్టభద్రుల తయారీలో పదేళ్లక్రితం 23వ ర్యాంకుకు పరిమితమైన భారత్‌ ఇప్పుడు పదిహేనో స్థానానికి చేరిందంటున్న సరికొత్త అధ్యయనం- కొంత మెరుగుదలను సూచిస్తోంది. అయితే ఇతర దేశాలు భారత్​ను దాటి వెళ్లిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బోధన సిబ్బంది పోస్టులు ఎన్నో ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదించింది. రేపటి పౌరుల్ని ప్రయోగశీలురు, విజ్ఞాన ఖనులుగా తీర్చిదిద్దగల గురువుల్ని సముపార్జించుకుంటే- కొన్ని తరాలు నిలబడతాయి.

Editorial on education quality in India
బతికించే చదువుల కోసం...
author img

By

Published : Nov 20, 2020, 8:24 AM IST

నేటి పోటీ ప్రపంచంలో సాంకేతికతను, సమున్నత ప్రమాణాలతో కూడిన విద్యను, తగినన్ని నైపుణ్యాలను అందిపుచ్చుకొన్నవారే ఉపాధి వేటలో విజేతలవుతారు. వాస్తవంలో, దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువతలో అత్యధికులు ఉద్యోగాలకు అవసరమైన మౌలిక అర్హతలు కొరవడినవారేనని నిపుణులు ఎన్నాళ్లుగానో మొత్తుకుంటున్నారు. 2014 సంవత్సరంతో పోలిస్తే తరవాతి అయిదేళ్లలోనూ దేశంలో ఉద్యోగార్హులు 33 నుంచి 47 శాతానికి విస్తరించినట్లు భారత నైపుణ్యాల నివేదిక-2019 ఆ మధ్య వెల్లడించింది. ఇంచుమించు అదే సమయంలో వృత్తి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నవారెందరన్న ప్రాతిపదికన 63 దేశాల జాబితాలో ఇండియాది 53వ స్థానమని స్విట్జర్లాండ్‌ అధ్యయన నివేదిక విశ్లేషించింది. వాటితో పోలిస్తే, ఉద్యోగార్హత కలిగిన పట్టభద్రుల తయారీలో పదేళ్లక్రితం 23వ ర్యాంకుకు పరిమితమైన భారత్‌ ఇప్పుడు పదిహేనో స్థానానికి చేరిందంటున్న సరికొత్త అధ్యయనం- కొంత మెరుగుదలను సూచిస్తోంది. ఇంతటితోనే సంబరపడే వీల్లేదు. జనాభా, భౌగోళిక పరిమాణం పరంగా ఇండియాకు సాటి, పోటీ కాలేని వివిధ దేశాలు ఉద్యోగార్హ పట్టభద్రుల రూపకల్పన కృషిలో మనకన్నా ముందున్నాయి. గత పదేళ్లలో అమెరికా అగ్రస్థానం చెక్కుచెదరలేదు. ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే, చైనాలు దాని వెన్నంటి నిలిచాయి. తరవాతి అయిదు ర్యాంకుల్ని ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కైవసం చేసుకున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో 21నుంచి తొమ్మిదో స్థానానికి చేరిన దక్షిణ కొరియా, 12 నుంచి ఎకాయెకి మూడో స్థానానికి ఎగబాకిన జర్మనీలది అక్షరాలా చరిత్రాత్మక ప్రస్థానం. సుశిక్షితులైన నిబద్ధ బోధన సిబ్బందిదే ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో కీలక భూమిక అన్నది యథార్థం. అదే ఇండియాలో- మూడోవంతుకు పైగా బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయన్న పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక, విశ్వవిద్యాలయాల మందగతికి ప్రధాన కారణమేమిటో చాటుతోంది. తొలివరస ర్యాంకుల్ని ఒడిసిపడుతున్న దేశాల అనుభవాల నుంచి గుణపాఠాలు నేరిస్తేనే ఇక్కడి ఉద్యోగార్థుల తలరాత మారేది!

బోధన, పరిశోధనల్లో ఉత్కృష్ట ప్రమాణాలకు మారుపేరై వెలుగొందుతున్న దిగ్గజ యూనివర్సిటీలతో సరిపోలిస్తే మన విశ్వవిద్యాలయాల గతిరీతులు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయంగా ఉద్యోగార్హత ర్యాంకుల్లో ఐఐటీ దిల్లీ(27), ఐఐఎస్‌ బెంగళూరు(71) మాత్రమే వందలోపు స్థానాలు దక్కించుకున్నాయి. రెండువందల ర్యాంకుల వరకు పరిశీలిస్తే- ఆ జాబితాలో ఐఐటీ బాంబే(128), ఐఐఎం అహ్మదాబాద్‌(184), ఐఐటీ ఖరగ్‌పూర్‌(195) చేరతాయి. వెయ్యికి చేరువలో విశ్వవిద్యాలయాలు, సుమారు 40వేల కళాశాలలు, ఇతరత్రా మరో పదకొండున్నర వేల సంస్థలకు నెలవైన భారత ఉన్నత విద్యారంగానికిది సముచితమైన, గౌరవప్రదమైన గుర్తింపా? ఎంతమాత్రం కాదు! అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌ జేగీయమానం కావాలంటే, ఆణిముత్యాల్లాంటి అధ్యాపక బృందాన్ని కొలువు తీర్చాల్సిందేనన్నది ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల మేలిమి సిఫార్సు. అసోచామ్‌ వంటివీ అటువంటి సూచనలే చేశాయి. ఉన్నత విద్య అభ్యసించేవారిలో ఉద్యోగ నైపుణ్యాల పెంపుదలకు, బోధన సిబ్బంది పరస్పర మార్పిడికి వేల్స్‌ ప్రభుత్వంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి గతవారమే అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యాన్ని విద్యావ్యవస్థకు మప్పి, గురువుల శిక్షణ విధివిధానాల పరిపుష్టీకరణకంటూ ‘స్టార్స్‌’ పేరిట ప్రణాళికనొకదాన్ని కేంద్రం ఇటీవల ప్రకటించింది. మేలిమి బోధనే భవితకు మదుపని దేశదేశాల్లో నిరూపితమవుతున్న దృష్ట్యా, అత్యున్నత ఉపాధ్యాయ విద్యను సమకూర్చే విశిష్ట సంస్థను జాతీయ స్థాయిలో అవతరింపజేయడం తక్షణావసరం. రేపటి పౌరుల్ని ప్రయోగశీలురు, విజ్ఞాన ఖనులుగా తీర్చిదిద్దగల గురువుల్ని సముపార్జించుకుంటే- కొన్ని తరాలు నిలబడతాయి. దేశ ప్రతిష్ఠను అంతెత్తున నిలబెడతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.