ETV Bharat / opinion

పోయేలోపు పద్ధతులన్నీ నేర్పే పోతా: కరోనా - కరోనా వైరస్​

క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాస్తా కరోనాకి ముందు- క.ము. (బీసీ-బిఫోర్‌ కరోనా); కరోనా తరవాత- క.త.(ఏసీ - ఆఫ్టర్‌ కరోనా)లుగా రూపాంతరం చెందాయి. మనుషుల ఆలోచనా సరళిలోనూ తేడా వచ్చింది. మాయదారి కరోనా, ఎప్పటికి పోతుందోగాని- పోయే లోపల మనకు పద్ధతులన్నీ నేర్పి వెళ్లేటట్టుంది.

editorial-on-change-in-human-lifestyle-due-to-corona-virus
మాయదారి కరోనా నేర్పిన సంస్కృతి!
author img

By

Published : May 21, 2020, 7:47 AM IST

ఇంతలోనే ఎంతలా మారిపోయింది లోకం? కలలో జరిగినట్లుగా ఉంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాస్తా కరోనాకి ముందు, క.ము. (బీసీ-బిఫోర్‌ కరోనా); కరోనా తరవాత క.త.(ఏసీ - ఆఫ్టర్‌ కరోనా)లుగా రూపాంతరం చెందాయి. స్నేహితుల మధ్య షేక్‌హ్యాండ్లు లేవు. ఆత్మీయుల మధ్య ఆలింగనాలు లేవు. మూతులు, ముక్కులు మూసేసి నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలీకుండా, సంస్కారవంతంగా ఓ నమస్కారం మిగిలిపోయింది- పలకరింపులకు! జీవన విధానంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. మనుషుల ఆలోచన సరళిలోనూ తేడా వచ్చింది...

డబ్బులు డ్రా చేద్దామని ఏటీయం దగ్గరికెళ్ళాను. లోపల ఒకరు ఉంటే, మిగిలిన వాళ్ళందరూ పద్ధతిగా, ఒకరి వెనక ఒకరుగా, దూరం దూరంగా నిలబడి ఉన్నారు- గీతలు, డబ్బాలు గీసిలేకపోయినా సరే... మన ఊరేనా అని ఆశ్చర్యపోయాను! నిన్నటిదాకా నేను ఏటీయం మిషను ఎదురుగా నిలబడుంటే, నా భుజమ్మీద నుంచి మొహం పెట్టి తొంగి చూస్తూ, నా నడుమ్మీద నుంచి వాడి చెయ్యి లోపలికి పెట్టేసి, 'కొట్టండి... పిన్‌ నెంబరు కొట్టండి...' అంటూ తొందర చేస్తూ, అక్షరాభ్యాసంలో పిల్లాడి చేయిపట్టుకుని దిద్దించినట్లుగా నా చేయిపట్టుకుని నెంబర్లన్నీ నాతో నొక్కించేసి, నా ఖాతాలో నిల్వ ఎంతో చూసేసి, కింది నుంచి వచ్చిన డబ్బుల్ని నా చేతిలో కుక్కేసి నన్ను పక్కకు లాగేసిన ఆ అరాచకవాదులేరీ?? 'ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకి, పూలిమ్మని రెమ్మరెమ్మకీ' అన్న కృష్ణశాస్త్రి పాట గుర్తొచ్చింది.

నిన్నటిదాకా మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు. అక్కడ గ్రీన్‌కార్డున్న అమ్మాయి అయితేనే పెళ్ళికి ఆలోచిస్తామన్న తల్లిదండ్రులందరికీ ఇప్పుడింక అనడానికేవీ మిగల్లేదు... మావాడు విదేశాల్లో ఉన్నాడని చెప్పుకోవడానికే భయపడుతున్నారు. 'ఫారిన్‌ రిటర్న్‌డ్'’ అనగానే 'రిజెక్టెడ్‌' జాబితాలోకి తోసేస్తున్నారు.

ఇకపోతే పెళ్ళిళ్లు, ఫంక్షన్ల గురించి ఎంత చెప్పుకొన్నా తరగదు. పెళ్ళి కుదిరినది మొదలు పిల్ల కాపురానికివచ్చేటంత వరకు- అన్నీ విచ్చలవిడి ఖర్చులే. మావాళ్ళు వెయ్యిమంది వస్తారంటే, మావాళ్ళు రెండు వేలమంది వస్తారంటూ పోటా పోటీ... వెరసి ఇన్ని వేలమందికి విందు భోజనం- నోరు తిరగని పేర్లతో నూరూ, నూటయాభై రకాల వంటకాలతో, ఏం వండాలో ఏం తిన్నారో కూడా తెలీకుండా దాదాపు సగం సంభారాలు ప్లేట్లలో వేయించుకుని మరీ పారేస్తే కానీ, పెళ్ళి ఘనంగా చేసినట్టు కాదు...! మరి ఇప్పుడో... 'మేము, మా పిల్లలిద్దరం, మొత్తం నలుగురమే వస్తాము...' అని అబ్బాయి తరఫువాళ్ళు అంటున్నారు. మీరు కూడా నలుగురే ఉండండి, అయ్యగార్లెలాగూ ఇద్దరుంటారు... చాలు అక్కడికి' అని ఆడపెళ్ళివారికి హుకుం జారీ చేస్తున్నారు. కరోనా తరవాత ఈ పదిమంది కోసం పెద్దపెద్ద ఫంక్షన్‌ హాళ్ళెందుకు దండగ, ఇళ్ళల్లోనో, కుదరకపోతే ఏ గుళ్ళోనో కానిచ్చేద్దామనే నిర్ణయానికి వస్తున్నారు. ఏదేమైనా, పెళ్ళికి వచ్చేవాళ్ళు పాతికమందికి మించకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. షాపింగ్‌ల కోసం ప్రత్యేకంగా టీవీ ఛానళ్లు ఉన్నట్టుగా- పెళ్ళిళ్ళకు అన్ని రకాల ఫంక్షన్లకు వేర్వేరుగా టీవీ ఛానళ్లు పుట్టుకొస్తాయేమో! డబ్బులిస్తే మన ఉత్సవాన్ని, మనకిచ్చిన సమయ పరిధిలో 'లైవ్​' టెలికాస్ట్‌ చేసేస్తారు. బంధుమిత్రులందరూ ఎవరింట్లో వాళ్ళుండి, టీవీలో సంబరాల్ని చూసి ఆనందించవచ్ఛు..!! డబ్బులు ఆదా... వృథా లేదు... శ్రమా లేదు. పైపెచ్చు ఎంతో సౌలభ్యం!

నిన్నటిదాకా ఫోన్లు, కంప్యూటర్లు పిల్లలు ఊరికే పట్టుకుంటే తిట్టిన పెద్దలే, ఇప్పుడు వాళ్ళకు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనిపించాల్సి వస్తోంది. అంతా ఆన్‌లైన్‌ క్లాసుల మహత్యం మరి! పిల్లాడు క్లాసులే వింటున్నాడో, గేములే ఆడుకుంటున్నాడో ఏదీ తెలీకుండా పోయింది!!!

జాతి, కుల, మత, వర్గ, లింగ, వయోభేదాలన్నింటినీ తుంగలో తొక్కి రెండు చేతుల్లో అత్యంత జాగ్రత్తగా, భద్రంగా గిన్నెనో, పళ్ళేన్నో పట్టుకుని- ఆత్రంగా, ఆబగా ఎప్పుడెప్పుడు మన పళ్ళెంలోకి వేస్తాడో 'పానీ పూరీ' అని ఎదురు చూసే ఆ గుంపులన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. శ్రీశ్రీ కలలు కన్న 'సమసమాజ భావన' వెల్లివిరిసేదక్కడ! వేలెడంత గరిట చేతిలో పట్టుకుని, మోచేతి దాకా కుండలో ముంచి, ఆ 'పానీ'ని గిరగిరా తిప్పేసి, చిన్నిచిన్ని 'పూరీ'లకి చిల్లుపెట్టి, పానీలో ముంచి పళ్ళెంలో వేసే ఆ పవిత్రమైన చేతులన్నీ చిన్నబోయాయి!! మరి ఇప్పుడో... పానీలు, పూరీలు, అందులోకి చాట్‌లూ- అన్నీ విడివిడిగా ఇస్తే ఎవరికివారు దూరం దూరంగా కూర్చుని, ఎవరి పానీలు వారే పోసుకుని గుటుక్కుమనిపిస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇవే మరి. మాయదారి కరోనా, ఎప్పటికి పోతుందోగాని- పోయే లోపల మనకు పద్ధతులన్నీ నేర్పి వెళ్ళేటట్టుంది. 'జరిగేవన్నీ మన మంచికే' అని అనుకోవాలనేది ఇందుకే గామోసు...!!!

-ఎమ్​ఎస్​ఆర్​ఏ. శ్రీహరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.