దేశ రాజకీయాలను రాష్ట్రపతి ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. అధికార, విపక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రక్తి కట్టిస్తున్నాయి. వ్యూహాత్మంగా భాజపా ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా.. కీలక పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాయి విపక్షాలు. ఇప్పటికే ఇరు పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి.. కీలకమైన ప్రచార పర్వానికి తెరలేపారు.
మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇద్దరి అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనేదానిపై అనేక విశ్లేషణల మధ్య.. ఇరు పక్షాలు విజయంపై ధీమాగా ఉన్నాయి. సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల కూటమిని 'ఇంద్ర ధనుస్సు' కూటమిగా అభివర్ణించారు. వివిధ భావజాలాలు, లక్ష్యాలతో కూడిన పార్టీలు ఒకే వేదికపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే 'ఇంద్ర ధనుస్సు' కూటమి ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది? ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఇరు పక్షాల బలాబలాలు, వ్యూహాలు ఏంటి?
గిరిజన మంత్రం.. ఆ పార్టీల సాయం!
⦁ 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు వాడిన భాజపా ఈసారి.. చరిత్రలో తొలిసారిగా సంతాల్ తెగకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థి ప్రకటనతో భాజపా సగం విజయం సాధించిందనుకోవాలి.
⦁ భాజపాతో పాటు.. ఆ పార్టీ కూటమి పాలనలో ఉన్న రాష్ట్రాలు 18. దేశంలో మరే పార్టీకి ఈ స్థాయిలో బలంగా లేదు.
⦁ ఆదివాసి మహిళను అభ్యర్థిగా ప్రకటించి.. విపక్షాల కూటమిని ఇరుకున పెట్టడంలో విజయం సాధించింది భాజపా. ముర్మును తెరపైకి తేవడం వల్ల కాంగ్రెస్ కూటమిలోని కొన్ని పార్టీలు భాజపా అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితిని తీసుకొచ్చింది భాజపా.
⦁ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు.. ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ముతో మంచి సంబంధాలున్నాయి. సోరెన్ కూడా సంతాల్ తెగకు చెందిన వారు కావడం గమనార్హం. హేమంత్ సోరెన్ గతంలో ఆదివాసి రాష్ట్రపతి కావాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే. ముర్ముకు సోరెన్ మద్దతు ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్ముకే మద్దతు తెలపడం గమనార్హం.
⦁ ఎన్డీఏకు పార్లమెంట్లో మెజార్టీ పుష్కలంగా ఉంది. కానీ అసెంబ్లీలో లేదు. ఈ నేపథ్యంలో ముర్ము గెలవాలంటే.. వైకాపా, బీజేడీ, తెరాస ఓట్లు చాలా కీలకం. ద్రౌపది ముర్ము ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ. దీంతో తమ మద్దతు ఆమెకే ఆని ప్రకటించారు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్. వైకాపా అధినేత జగన్ కూడా ముర్ముకే జై కొట్టారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పాలి.
⦁ ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోడవం ఎన్డీఏ అభ్యర్థికి కలిసొచ్చే అంశం. కలిసి కట్టుగా.. అన్ని ఒక్క తాటి పైకి వస్తేనే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి యశ్వంత్ సిన్హా గెలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పటికే.. వైకాపా, బీజేడీ, బీఎస్పీ ముర్ముకు మద్దతు తెలిపాయి. వ్యూహాలు రచించి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించగల శరద్ పవార్.. ప్రస్తుతం మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
⦁ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహూల్ గాంధీని ఈడీ చిక్కులు చుట్టుముట్టాయి. ఈ పరిణామం.. వీరు రాష్ట్రపతి ఎన్నికల రాజకీయంలో పూర్తి స్థాయిలో భాగస్వాములయ్యే అవకాశాన్ని దెబ్బతీసింది. ఇలా విపక్షాల కూటమిలో పార్టీలు పైకి కలిసి కట్టుగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఇబ్బందులు ఆ పక్షానికి ఉన్నాయి. ఈ పరిణామం ముర్ము విజయానికి దోహదపడుతుంది.
⦁ ఆదివాసి మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా.. అగ్రవర్ణ భావజాలం ఉన్న పార్టీ అనే ముద్రను తొలగించే ప్రయత్నం చేసింది భాజపా.
⦁ ముర్ము ఎంపికతో ఆదివాసి సానుభూతి భాజపాకు పుష్కలంగా లభించే అవకాశముంది. ఈ ఏడాది గుజరాత్, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలున్నారు. ఇన్నాళ్లు భాజపాకు దూరంగా ఉన్న ఆదివాసి తెగ.. ఈ నిర్ణయంతో కాషాయ దళానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆ ఎన్నికల్లో లాభం చేకూరుతుందనే నమ్మకంతో భాజపా ఉంది.
సవాళ్ల మధ్య ఐక్యతా రాగం..
⦁ విపక్షాలు అన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం వారి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. విపక్ష కూటమిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి.
⦁ యశ్వంత్ సిన్హా భాజపా నుంచి వచ్చిన నేత. ఆయనతో ఇంకా ఆ పార్టీ నాయకులు టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాజపాను గందరగోళానికి గురి చేసేందుకు.. యశ్వంత్ సిన్హాను విపక్షాలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
⦁ యశ్వంత్ సిన్హాకు అన్ని పార్టీలతో సత్ససంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద ఉన్న అభిమానంతో.. అధికార పక్షంలోని సభ్యులు కూడా యశ్వంత్ సిన్హా కోసం.. ఇటు వైపు మొగ్గే అవకాశమూ లేకపోలేదు.
⦁ భాజపాలో ఉన్నప్పుడు మోదీని బహిరంగంగానే వ్యతిరేకించారు యశ్వంత్ సిన్హా. వాజ్‌పేయీకి సిన్హా దగ్గరగా ఉండేవారు. వాజ్‌పేయీలో ఉన్న ప్రజాస్వామిక దృక్పథం.. మోదీలో లేదని, ఆనాటి భాజపాకు ఉన్న గుర్తింపు ఇప్పుడు లేదని విమర్శిస్తున్నారు. ఫలితంగా ఓటింగ్ సమయంలో భాజపాలో ఉన్న వాజ్‌పేయీ అభిమానులు, మోదీ వ్యతిరేక వర్గం యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది విపక్షం ఆశ.
⦁ గత ఎన్నికల కంటే ఈసారి ఎన్డీఏకి ఎంపీలు పెరిగినా.. ఎమ్మెల్యేలు మాత్రం బాగా తగ్గిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క యూపీలోనే సుమారు 80మంది ఎమ్మెల్యేలు తగ్గారు.
⦁ గత రాష్ట్రపతి ఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థికి మద్దతిచ్చిన కొన్ని పార్టీలు.. ఇప్పుడు దూరం అయ్యాయి. తెరాస, శివసేన, తెదేపా 2017లో కోవింద్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెరాస, శివసేన విపక్షాలు కూటమిలో కీలకంగా వ్యవహరించడం సిన్హాకు కలిసొచ్చే అంశం.
⦁ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ.. విపక్షాలు కూటమి వైపు మొగ్గినా ఆశ్చర్యపోనసరం లేదు. ఎన్డీఏలో ఉంటూనే.. యూపీఏకు ఓటేసిన అనుభవం జేడీయూకు ఉంది. ఈసారి కూడా అలా జరిగే అవకాశం లేదని చెప్పలేము.
⦁ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేన్ దాఖలు చేయడానికి ముర్ముతో పాటు ప్రధాని, నడ్డా, రాజ్‌నాథ్ నాయకులు అంతా వెళ్లారు. అయితే ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు ముర్ము సమర్పించకుండా.. మోదీ ఇచ్చారు. ఈ క్రమంలో ముర్ము ఎన్నికైనా సొంత నిర్ణయాలకు ఆస్కారం లేదనే విషయాన్ని విపక్షాలు లేవనెత్తాయి. భాజపాలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలు, ప్రధానినే ప్రశ్నించారు సిన్హా. అందుకే ప్రశ్నించే తనకు మద్దతు ఇవ్వాలని అధికార, ప్రతిపక్ష కూటమి సభ్యులను కలవనున్నారు సిన్హా. ఈ వ్యూహం ఏ మేరకు ఫలించినా.. లెక్కలు తారుమారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
⦁ యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ రాజకీయానుభవం ఉంది. బిహార్ పట్నాకు చెందిన సిన్హా.. 24 ఏళ్ల పాటు ఐఏఎస్‌గా సేవలందించారు. లోక్‌సభ, రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.
జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇదీ చదవండి:'నిత్యానంద ఆశ్రమం నుంచి నా కూతుర్ని రక్షించండి'.. తండ్రి ఆవేదన