కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోతుందా? వయనాడ్ ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ పునరుద్ధరించక తప్పదా? తాజా పరిణామాల నేపథ్యంలో.. కొన్ని అంశాలు ఆయనకు కలిసొస్తే ఇవన్నీ సాధ్యమేనని స్పష్టమవుతోంది!
రాహుల్‌పై అనర్హత ఎందుకు?
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సూరత్ కోర్టులో నేరపూరిత పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల శిక్ష విధించింది.
సాధారణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్ష పడిన చట్టసభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ఖరారైన వెంటనే వారు అనర్హులుగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్ మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 23నే ఆయన తన పదవికి అనర్హుడు అయ్యారని స్పష్టం చేసింది.
రాహుల్‌కు ఊరట ఎలా?
అయితే, ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీకి ఊరట లభించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలు సైతం ఆయనకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. అదెలాగంటే..
IPC 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం కేసుల్లో రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.15వేల వరకు జరిమానా విధించవచ్చు. సూరత్ కోర్టు ఈ కేసులో రాహుల్‌కు గరిష్ఠ జైలు శిక్ష విధించింది. శిక్ష అమలును 30 రోజులు వాయిదా వేసి.. బెయిల్ మంజూరు చేసింది. అయితే, రాహుల్ కేసులో రెండేళ్ల శిక్ష అసాధారణమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తనపై పడిన శిక్షను సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్లొచ్చు. పై కోర్టులు రాహుల్ గాంధీపై పడిన శిక్షను ఒక్కరోజు తగ్గించినా.. సూరత్ కోర్టు తీర్పును నిలిపివేసినా.. లేదా శిక్షను పూర్తిగా రద్దు చేసినా.. ఆయనపై పడ్డ అనర్హత తొలగిపోతుంది. దీంతో లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది.
పై కోర్టుల్లో రాహుల్‌కు ఊరట లభించకపోతే మాత్రం పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ, అలా జరిగే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. రాహుల్ తరహా పరిస్థితినే ఎదుర్కొన్న లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్.. తనపై పడ్డ అనర్హతను తొలగించుకోవడమే ఇందుకు కారణం. హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు కింది కోర్టు పదేళ్ల శిక్ష విధించగా.. దాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టు నుంచి శిక్ష సస్పెన్షన్‌కు ఆదేశాలు తెచ్చుకున్నారు. దోషిగా తేలిన సమయంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ రద్దు చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల అనుసారం ఆయనపై విధించిన అనర్హతను లోక్‌సభ వెనక్కి తీసుకుంది.
రాహుల్ కేసు ఎక్కడి వరకు వచ్చింది..
ప్రస్తుతం రాహుల్ గాంధీపై అనర్హత కొనసాగుతోంది. లోక్‌సభ ఎంపీగానూ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానం ఖాళీ అయింది. రాహుల్‌పై శిక్ష పడ్డ కేసును పైకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇంతవరకు రాహుల్ పై కోర్టును ఆశ్రయించలేదని తెలుస్తోంది.
మరోవైపు, వయనాడ్ స్థానానికి అప్పుడే ఉప ఎన్నిక నిర్వహించే ఉద్దేశం లేదని ఎన్నికల సంఘం సైతం స్పష్టం చేసింది. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు 6 నెలల సమయం ఉంటుందని బుధవారం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా గుర్తు చేసింది. న్యాయ సమీక్ష కోసం సూరత్ కోర్టు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చిన నేపథ్యంలో.. ఆ గడువు పూర్తయ్యే వరకు ఎదురుచూస్తామని తెలిపింది.