AZADI KA AMRIT MAHOTSAV: సంస్థానాల విలీనంతో సర్దార్ పటేల్‌కు ఉక్కుమనిషి అనే ప్రశంస లభించింది. కానీ.. ఆయన్ని ఉక్కుమనిషిగా చేయడానికి బొంగరంలా తిరిగి, బొగ్గులా కరిగిన బంగారు మనిషి వీపీ మేనన్! కేరళలోని మలబారు జిల్లా భరతపుళ నదీ తీరాన ఒట్టపాలెం గ్రామంలో 1893 సెప్టెంబరు 30న జన్మించారు మేనన్. పెద్ద కుటుంబం. చాలీచాలని ఆదాయం. పెద్దకొడుకుగా తండ్రికి అండగా నిలిచేందుకు మెట్రిక్యులేషన్ కాగానే చదువును వదిలేశారు. కోలార్ వెళ్లి బంగారు గనుల్లో, భవన నిర్మాణ పనుల్లో కూలీగా చెమటోడ్చారు. ఎక్కడ నేర్చారో కానీ.. ఆంగ్లభాష మీద పట్టుసాధించారు. పైగా టైపు నేర్చుకున్నారు. బెంగళూరులోని పొగాకు కంపెనీలో టైపిస్ట్‌గా పనిచేశారు.
VP Menon biography: ఐదేళ్ల తర్వాత ముంబయికి చేరి తోపుడు బండిపై తువ్వాళ్ల వ్యాపారం చేశారు. తన జీవిత ధ్యేయమైన ప్రభుత్వోద్యోగం కోసం.. 1914లో బ్రిటిష్‌వారి వేసవి రాజధాని శిమ్లా వెళ్లారు. బ్రిటిష్ హోం మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ విభాగంలో చిన్న ఉద్యోగం సంపాదించారు. చెప్పిన పనికంటే.. అదనంగా పనిచేసి అల్లుకుపోయే మేనన్ తత్వం ఆంగ్లేయ అధికారులకు నచ్చింది. రాజ్యాంగ సంస్కరణల విభాగానికి బదిలీ.. ఆయన జీవితాన్నే మార్చేసింది. భారత్‌లో పాలన సంస్కరణల రూపశిల్పి మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ దగ్గర పనిచేశారు. చేసే ప్రతిపనికి తన విషయ పరిజ్ఞానం మేళవించే గుణం ఆయన్ని వరుసగా ముగ్గురు వైస్రాయిలు లిన్‌లితిగో, వేవెల్, మౌంట్‌బాటెన్‌లకు దగ్గర చేసింది. ఇంగ్లండ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక భారతీయ అధికారి మేననే.
1914లో ఉద్యోగంలో చేరాక అంచెలంచెలుగా ఎదిగారు. భారత ప్రభుత్వ రాజ్యాంగ సంస్కరణల కార్యాలయంలో 1933 నుంచి 1934 వరకు అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు. తర్వాత 1934 నుంచి 1935 దాకా అండర్ సెక్రటరీగా ఉండేవారు. 1935 నుంచి 1940 దాకా డిప్యూటీ సెక్రటరీగా, 1941-42లో భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఈ బాధ్యతల కారణంగా.. గాంధీ, నెహ్రూ, జిన్నా, పటేల్‌లాంటి నేతలతోపాటు దేశంలోని అందరు సంస్థానాధీశులతోనూ పరిచయమున్న ఏకైక వ్యక్తిగా మేనన్ నిలిచారు. భారత చివరి వైస్రాయ్‌గా వచ్చిన మౌంట్‌బాటెన్ వద్ద రాజకీయ సంస్కరణల కమిషనర్‌గా మేనన్ నియమితులయ్యారు. తొలుత మౌంట్‌బాటెన్ దేశాన్ని అనేక ముక్కలు చేయాలని భావించాడు. ప్రతి రాష్ట్రానికి, సంస్థానానికి విలీనం లేదా.. స్వతంత్రంగా ఉండే అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఈ ప్రణాళికకు అంగీకరించేది లేదని నెహ్రూ తెగేసి చెప్పారు. దీంతో.. ఏమీ పాలుపోని మౌంట్‌బాటెన్ తన సలహాదారు మేనన్‌వైపు చూశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే స్వాతంత్య్ర ప్రకటన ప్రణాళికకు వీపీ మేనన్ కేవలం మూడున్నర గంటల్లో రూపకల్పన చేశారు. 1947 జున్ 3న దీన్నే మౌంట్‌బాటెన్ తన ప్లాన్‌గా ప్రకటించుకున్నాడు.
పటేల్‌తో ఉక్కు బంధం..
సర్దార్ పటేలంటే మేనన్‌కెంతో అభిమానం ఉండేది. 1947లో పటేల్ నేతృత్వంలోని రాష్ట్రాల మంత్రిత్వ శాఖలో ఆయన కార్యదర్శిగా నియమితులయ్యారు. రామాంజనేయుల్లా.. వీరిద్దరూ సంస్థానాల విలీనాన్ని సజావుగా పూర్తి చేశారు. తనకున్న పరిచయాలతో దేశమంతటా పర్యటించిన మేనన్... సంస్థానాధీశులందరినీ నయానోభయానో ఒప్పించి సంతకాలు పెట్టించుకొచ్చారు. మాట వినని వాళ్లను పటేల్ ముందు నిలబెట్టారు. అప్పటికీ తేలని హైదరాబాద్‌లాంటి చోట్ల మంత్రాంగం నడిపారు. హిందూ మెజార్టీ సంస్థానానికి హిందూ రాజుగా ఉండీ.. పాకిస్థాన్‌లో చేరటానికి ఉత్సాహం చూపిన జోధ్‌పుర్ మహారాజు హన్వంత్‌సింగ్.. తన తలకు తుపాకీ పెట్టినా వెరవకుండా పనికానిచ్చుకొచ్చిన ఘనుడు మేనన్. భారత్‌లో విలీనానికి అంగీకరించేలా కశ్మీర్ రాజుపై ఒత్తిడి తెచ్చిన ఘనతా ఆయనదే. స్వయం కృషితో శిఖర స్థాయికి చేరిన దేశమాత ముద్దుబిడ్డ చరిత్రలో నాలుగో సింహంలా కనిపించకుండా ఉండిపోయారు. పదవీ విరమణ తర్వాత ఒడిశా గవర్నర్‌గా ఏడాది కొనసాగిన వీపీ మేనన్ 1965 డిసెంబరు 31న బెంగళూరులో తన కుమార్తె ఇంట కన్నుమూశారు.
ఇవీ చదవండి: 'ఒంటరైన గాంధీజీ.. కీలక సమయంలో పక్కనబెట్టిన కాంగ్రెస్!'
11 నెలల ముందే భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చిన నేత.. 'మన అట్లీ'!