ETV Bharat / opinion

నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు

కారాగారాలు అవినీతి, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాలుగా అవతరించాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. నేరగాళ్లకు సహకరించినందుకుగాను సస్పెన్షన్​కు గురైన 30 మంది తిహార్​ జైలు అధికారుల వైఖరే అందుకు ఉదాహరణ. ఈ పరిస్థితి కేవలం తిహార్​లో మాత్రమే కాదు.. దేశమంతటా ఉందంటున్నారు విశ్లేషకులు.

author img

By

Published : Oct 17, 2021, 4:55 AM IST

tihar jail news
నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు

తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి మరీ నేరగాళ్లతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఆ కారాగార సిబ్బందిని సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇటీవల అలాగని ఈసడించింది! వారిపై నమ్మకం కోల్పోయామంటూ ఆవేదన వెళ్లగక్కింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఊచలు లెక్కపెడుతున్న యూనిటెక్‌ స్థిరాస్తి సంస్థ మాజీ ప్రమోటర్లతో మిలాఖత్‌ అయినట్లు తేలడంతో ముప్ఫై మంది తిహార్‌ జైలు అధికారులపై తాజాగా సస్పెన్షన్‌ వేటుపడింది. మరో ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను సర్వీసులోంచి పూర్తిగా తొలగించారు. నేరగాళ్లకు స్వర్గధామంగా ఆ కారాగారం అలరారుతోందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించి, విచారణకు ఆదేశించిన తరవాత చోటుచేసుకున్న పరిణామాలివి! దేశంలోనే అతిపెద్ద కారాగారమైన 'తిహార్‌'లో నేరగాళ్ల ఎంగిలి మెతుకులకు లొట్టలు వేసే అధికారులు, సిబ్బందికి లోటే లేదు! ఆ మాటకొస్తే- తరతమ భేదాలతో ఆసేతుహిమాచలం అధిక శాతం కారాగారాలు అలాగే వర్ధిల్లుతున్నాయి. డబ్బిస్తే చాలు.. ఉగ్రవాదులకైనా ఊడిగం చేసే ఇంటిదొంగలతో అవి లుకలుకలాడుతున్నాయి.

దిల్లీలోని రోహిణి జైలు నుంచి అక్రమ వసూళ్ల దందా నడిపించిన సుఖేష్‌ చంద్రశేఖర్‌ లీలలు రెండు నెలల క్రితమే బయటపడ్డాయి. మహా మాయగాడిగా, కోటీశ్వరుడైన మోసగాడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతగాడు- తాను కోరిందల్లా క్షణాల్లో అందించడానికి కారాగార అధికారులకు పక్షం రోజులకు రూ.65 లక్షలు చొప్పున ముట్టజెప్పినట్లు విచారణలో వెల్లడించాడు! సీసీ కెమెరాలకు దుప్పట్లు అడ్డంపెట్టి, ఐఫోన్‌తో వ్యవహారాలు నడిపించిన సుఖేష్‌- జైలులోంచే అనేక మందిని బెదిరించి కోట్లు దండుకున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సందేహిస్తోంది. ఆ ప్రబుద్ధుడి మోచేతినీళ్ల రుచిమరిగిన ఆరుగురు సిబ్బందిని ఇటీవల సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు, మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. సుఖ భోగ కేళీ విలాస లాలసుడైన సుఖేష్‌ మూడేళ్ల క్రితం తన పుట్టినరోజు నాడు ప్రేయసితో కలిసి జైలులోనే పార్టీ చేసుకున్నాడు. వాళ్లకు ఆ ఏకాంతవాసం కల్పించిన 'పుణ్యానికి' ఒక హెడ్‌వార్డర్‌ అప్పట్లోనే బలయ్యాడు. అయినా బుద్ధితెచ్చుకోని మిగిలిన సిబ్బంది నిర్లజ్జగా అతడి అడుగులకు మడుగులొత్తుతూ ఇన్నేళ్లుగా తరించిపోయారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాలు..

పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, రాజస్థాన్‌, గుజరాత్‌లలో కారాగారాలు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాలుగా అవతరించాయని కేంద్రమే లోగడ కుండ బద్దలు కొట్టింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాస్తూ- జైళ్లలోని ముష్కరమూకలు, మాఫియా డాన్లకు రాచమర్యాదలు దక్కుతున్న తీరును తీవ్రంగా ఆక్షేపించింది. అక్రమార్కులైన కొంతమంది సిబ్బంది మూలంగా దేశభద్రతే పెను ప్రమాదంలో పడుతోందని, అటువంటి వాళ్లను తక్షణం కట్టడిచేయాలని హెచ్చరించింది. కారాగారాల్లో సెల్‌ఫోన్ల వినియోగంపై నిఘాపెట్టాలని, జామర్లను బిగించాలని సూచించింది. ఏమి లాభం? తిహార్‌ జైలులో యమదర్జాగా కాలం గడుపుతున్న ఇండియన్‌ ముజాహిదీన్‌ ముష్కరుడు తెహసీన్‌ అక్తర్‌ దగ్గర ఎన్‌ఐఏ అధికారులు ఇటీవలే ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఆ ఉగ్రవ్యాఘ్రానికి ఫోన్‌ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు!

కశ్మీరంలో అమాయకులను ఊచకోత కోస్తున్న ఉగ్రవాద తండాల పీచమణచడానికి సైనికులు ఒకవైపు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మరోవైపు ఆ నరహంతక మూకల సేవలో జమ్మూకశ్మీర్‌ జైళ్ల సిబ్బంది తరించిపోతున్నారు. అక్కడి కారాగారాల్లోని ఉగ్రవాదుల దగ్గర నుంచి పదుల కొద్దీ సెల్‌ఫోన్లు, ఇతర అధునాతన ఉపకరణాలను నాలుగు నెలల కింద సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌ జైలులో మొబైళ్లే కాదు- ఐపాడ్‌ వంటివీ లభ్యమైన సందర్భాలున్నాయి. కారాగారాల్లో పెచ్చరిల్లుతున్న చరవాణుల వాడకంపై సుప్రీంకోర్టు సైతం ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన వ్యక్తంచేసింది. అయితేనేమి? గుండెలు తీసిన బంట్ల వంటి నేరగాళ్లు, పలుకుబడి కలిగిన ఖైదీలకు హస్తభూషణాలుగా సెల్‌ఫోన్లు జైళ్లలో నిరాటంకంగా పనిచేస్తూనే ఉన్నాయి. తిహార్‌ జైలులో 2011లో తొమ్మిది మొబైళ్లను అధికారులు పట్టుకుంటే, పదేళ్లలో ఆ సంఖ్య ఆరు రెట్లకు ఎగబాకింది. యంత్రాంగం చేపట్టే సాధారణ కంటితుడుపు చర్యల్లోనే ఇంతగా 'అభివృద్ధి' నమోదైతే- వాస్తవంగా అక్కడ వాటి వాడకం ఏ స్థాయిలో ఉందో ఊహకందని విడ్డూరమేమి కాదు!

కేరళలోని వియ్యూర్‌, కన్నూర్‌ కారాగారాల్లో నిరంతరాయంగా మోగుతున్న మొబైళ్లపై గతంలో 23 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లోని లూథియానా జైలులో ఆరు నెలల క్రితం జరిగిన తనిఖీల్లో ఇబ్బడిముబ్బడిగా సెల్‌ఫోన్లు పట్టుబడ్డాయి. దానికి రెండు నెలల ముందు జోధ్‌పూర్‌(రాజస్థాన్‌) కేంద్ర కారాగారంలో ఖైదీల నుంచి పదుల కొద్దీ చరవాణులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైలులో సర్కారీ సిబ్బంది పహరా నడుమ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అలా దందాలు నడిపిస్తున్న కాకలుతీరిన ఘనులు దేశవ్యాప్తంగా కోకొల్లలు. నేరాలకు పుట్టిళ్లుగా, నేరగాళ్లకు అత్తవారిళ్లుగా అవతరించిన కారాగారాలు- న్యాయస్థానాల తీర్పులనే నవ్వులపాలు చేస్తున్నాయి. స్వార్థ పిశాచావతారాల పుణ్యమా అని గంజాయి మొదలు రకరకాల మాదకద్రవ్యాల వరకు అన్నింటికీ ఆలవాలాలుగా అవి కునారిల్లుతున్నాయి.

జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల మేరకు 4.78 లక్షలకు పైగా ఖైదీలతో దేశవ్యాప్త కారాగారాలు కిక్కిరిసిపోయాయి. అందులో దాదాపు మూడొంతుల మంది విచారణ ఖైదీలే! ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జైళ్లలో మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా కారాగారాల్లో ఉండాల్సిన వారికంటే 150శాతానికి పైగా ఎక్కువగా ఉన్న ఖైదీలు- ప్రాథమిక వసతులకు నోచుకోక జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. సామాన్య ఖైదీల దుర్భరావస్థపై సుప్రీంకోర్టు, మానవహక్కుల సంఘం లోగడ ఎన్నోసార్లు స్పందించాయి. అయినా జైలు సంస్కరణలపై సాగిన చర్చోపచర్చలన్నీ అరణ్యరోదనలై- ఆయా కమిటీల నివేదికలన్నీ అటకెక్కాయి. నరకానికి నకళ్లుగా పరిణమించి అభాగ్యుల జవజీవాలను తోడేస్తున్న భారతీయ కారాగారాలు- అంగబలం, అర్థబలం దండిగా ఉండే ఖైదీలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాయి. సమగ్ర సంస్కరణలతో జైళ్లను ప్రక్షాళన బాట పట్టించనంత కాలం- దేశంలో న్యాయం మిథ్యే!

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చూడండి : 'ఆకలి సూచీక పూర్తిగా అశాస్త్రీయమైనది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.