ETV Bharat / opinion

బాల్యాన్ని దారి మళ్లిస్తున్న ఆధునిక జీవనశైలి

దేశంలో నానాటికీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. రోజుకో తీరున హత్యలు,మానభంగాలు,కిడ్నాప్​ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో నేర స్వభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వీటి కారణంగా చిన్న వయస్సులోని పిల్లలపై ఈ ప్రభావం అధికంగా పడుతోంది. తద్వారా ఆనందానూభూతులతో నిండాల్సిన బాల్యం దారి తప్పుతోందని అంటున్నారు నిపుణులు.

A modern lifestyle that redirects childhood into crime
బాల్యాన్ని దారి మళ్లిస్తున్న ఆధునిక జీవనశైలి
author img

By

Published : Nov 16, 2020, 10:51 AM IST

కొన్నాళ్లుగా హత్యలు, మానభంగాలు, అపహరణలపై వార్తలు లేని రోజంటూ ఉండటం లేదు. మనుషుల్లో నేర స్వభావం పెచ్చరిల్లుతోందనడానికి నడుస్తున్న చరిత్రే నిదర్శనం. ఇలా మానవ మానసిక ప్రవర్తన నేర స్వభావంగా మారడానికి కారణాలు అనేకం. కష్ట పడకుండా లభించే భోగ లాలసత్వం, అదుపులో పెట్టుకోలేని లైంగిక కోరికలు, తమకన్నా బలహీనుల మీద దౌర్జన్యం చేసే మనస్తత్వం తదితర అంశాలు ప్రధానమైనవి. పెంపకం, విద్యావిధానం, పరిసరాలు మాత్రమే కాకుండా- సెల్‌ఫోన్లు, టీవీ కార్యక్రమాల్లోనూ ఇవే పెడ ధోరణులు ఉంటున్నాయి. స్వీయ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని తదనుగుణంగా తమ జీవిత గమనాన్ని సాగించడం మానేసి 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' ఎవరితోనో తమను పోల్చుకుంటూ, ఏదో పొందాలనే యావతో పెడదోవ పడుతున్నారు.

నీతి కథలు చెప్పేవారు కరవు..

పిల్లలు మానసిక వికాసంతో ఎదిగేలా చూడటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లింది. పిల్లలకు సరైన సూచనలిచ్చే పెద్దలు ఇంట్లో లేకపోవడం ఒకరకంగా లోపమే. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. సాధారణంగా తల్లిదండ్రులిద్దరూ పనిచేసేవారే కావడంతో పిల్లలకు సరైన సూచనలిచ్చి నడిపించేవారు కరవయ్యారు. పిల్లలను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చేర్చేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవారు బహు కొద్దిమంది. పునాది బలంగా ఉంటేనే ఎంతటి భవనం అయినా నిలబడుతుంది. వ్యక్తి జీవితానికి బాల్యం పునాదివంటిది. ప్రతి మనిషి జీవితంలో తొలి అయిదేళ్లు అమూల్యమైనవి. ఆ వయసులో వారికి అవగాహన శక్తి ఎక్కువ. అందువల్లే తల్లిదండ్రులు పిల్లల ఆలోచనా సరళిని విస్తృతపరచే విధంగా మాతృ భాషలో సరళమైన పదాలతో నీతి కథలు చెబుతూ విలువలను నేర్పాలి. పిల్లలకు తల్లిదండ్రులు ప్రథమ గురువులు. తరవాతే ఉపాధ్యాయులు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో వర్క్‌బుక్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌ అంటూ పరుగులు తీయిస్తూ పసి మనసుల వికాసాన్ని కాలరాస్తున్నారు. పట్నంలో పెరిగిన పిల్లల కన్నా పల్లెటూళ్లలో పదిమంది మధ్యలో పెరిగిన పిల్లల మానసిక దృఢత్వం మెరుగ్గా ఉంటుందన్నది నిర్వివాదం.

నేరస్వభావానికి బీజం వేస్తున్న అన్​లైన్​ ఆటలు..

పేరొందిన కార్పొరేట్‌ విద్యాసంస్థల వైఖరి ఇలా ఉంటే... చిన్నా చితకా ప్రైవేటు విద్యాసంస్థలు ఇంకో రకం. ఇక్కడ బోధనాపరమైన శిక్షణ లేని అధ్యాపకులు ఎందరో! వీరివల్ల మానసిక అభివృద్ధికి అడుగులు పడతాయని చెప్పలేం. ఇక ప్రభుత్వ పాఠశాలలో బోధనా ప్రావీణ్యత ఉన్నా, ఇతర బాధ్యతల కారణంగా ఉపాధ్యాయులు తూతూమంత్రంగా బోధనను ముగిస్తున్నారనేది కాదనలేని సత్యం. మరోవైపు టీవీ, సినిమా, వీడియో గేమ్స్‌ ద్వారా చిరుప్రాయంలోనే మనసుకెక్కుతున్న హింస, అశ్లీల దృశ్యాలు మానసిక ఉన్మాద ప్రవృత్తికి బీజం వేస్తాయి. పెద్దయ్యాక మానసిక రోగులుగా పరివర్తన చెంది, సామాజిక వ్యతిరేకులుగా, నేరస్తులుగా మారతారు.

ప్రత్యేక శ్రద్ధ అవసరం..

మనో వికాసానికి బాల్యంలోనే పునాదులు వేయాలి. తల్లిదండ్రులిద్దరూ మంచి బట్టలు, స్కూల్‌, సౌకర్యాలను అందివ్వడం మాత్రమే కాక పిల్లలతో తమ సమయాన్ని ఎక్కువగా గడపాలి. వారికి సామాజిక అవగాహనను పెంపొందించే విధంగా వివిధ రకాల అంశాలను నీతి కథల రూపంలో చెప్పాలి. అలాగే పిల్లలు ఏ అంశాలపట్ల ఆకర్షితులవుతున్నారనే దాన్ని గమనిస్తూ ఉండాలి. హింసాత్మక దృశ్యాల పట్ల ఆటల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అంటే వారికి తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి, ఇప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులు సైతం పిల్లల మనోవికాసానికి సంబంధించిన వివిధ విజ్ఞానపరమైన అంశాలను సరళమైన విధానంలో వారి మనసులకు హత్తుకునే విధంగా బోధించాలి. తోటివారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటూ ఉండాలి. మోతాదుకు మించి అసహజ ప్రవర్తన కలిగి ఉంటే ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్లాలి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు బోధనేతర విధులను కేటాయించకుండా, ఉపాధ్యాయులు గుర్తించిన అసహజ ప్రవర్తన కలిగిన పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి మండలస్థాయిలో కనీసం ఒక్క మానసిక నిపుణులైనా ఉండేట్లుగా మార్పులు చేపట్టాలి. చీడ పెచ్చరిల్లి పంటను నాశనం చెయ్యక ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లుగా, మంచి పౌరులను తీర్చిదిద్దడం కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు... సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరిదీ!

- షణ్మితా రాణి
(బెంగళూరు ‘నిమ్హాన్స్‌’లో సైకాలజీ కౌన్సెలర్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.