ఈ పెళ్లి పత్రిక చూశారా.. వివాహానికి రాకుండా ఇంటి నుంచే తిలకించమని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా.. కరోనా కాలంలో జరుగుతున్న పెళ్లి కదా.. అందుకే పెళ్లి కొడుకు కుటుంబీకులు అందరి క్షేమం కోరి విభిన్నంగా, ఆసక్తికరంగా లగ్నపత్రికను ముద్రించారు.. తెలంగాణ జగిత్యాల జిల్లా లంబాడిపల్లి మైవిలేజ్‌షో సభ్యుడు అనిల్ జీల మే 1న పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన హితులకు, బంధుగణానికి పత్రికను పంపేందుకు రూపొందించారు.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్ల పేర్ల పక్కన కొవిడ్ నెగెటివ్ సూచన, పెళ్లికి రాకండంటూ.. వేడుకను ఆన్‌లైన్‌లో చూడమంటూ.. అందుకోసం ఒక జీబీ డేటాను ఫోన్‌లో పెట్టుకోండన్న అభ్యర్థనలతో ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లిపత్రిక ఆకట్టుకుంటోంది. కట్నాలు ఇవ్వాలనుకునే వారు గూగుల్‌పే క్యూఆర్ కోడ్ ద్వారా పంపాలని అభ్యర్థించారు. ఆ సొమ్మునంతా కరోనా వేళ ఆకలితో అలమటించే వాళ్లకు అందిస్తాననే హామీ ఇచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లో పెళ్లి చూడండని.. ఏమనుకోకుండా ఎవరి ఇళ్లవద్ద వాళ్లే ఉండాలని కార్డుతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో విన్నవిస్తున్నారు. లగ్గం జాగ, ఎవ్వరింట్ల ఆల్లు బువ్వ తినుర్రి.. ఇలా తెలంగాణ యాసలోని పదాలు పత్రికలో ప్రత్యేకతగా నిలిచాయి.