ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెద్దల మాటతో తనకు దూరమైందన్న కసితో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20) చిత్తూరులో, పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన డిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు చదువుకునేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కళాశాలలకు వెళ్లేందుకు పెనుమూరు మార్గంలోనే వచ్చేవారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించి.. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయారు. తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె తప్పిపోయిందని యువతి తండ్రి షణ్ముగరెడ్డి ఆ సమయంలో పెనుమూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ప్రేమికుల ఆచూకీని గుర్తించిన పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. గాయత్రి తన తల్లిదండ్రులతోనే ఉండేందుకు అంగీకరించి వెళ్లిపోయింది. అప్పటి నుంచి డిల్లీబాబుకు దూరంగా ఉంటోంది.
చంపాలన్న ఉద్దేశంతోనే..
ప్రేమించిన యువతి తనతో ఉండటం లేదంటూ డిల్లీబాబు కక్ష పెంచుకున్నాడు. ఇంటి సరకుల కోసం గాయత్రి తన బంధువుల అమ్మాయితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై పెనుమూరుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న డిల్లీబాబు ఆమెను తిరుగు ప్రయాణంలో ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో అడ్డుకున్నాడు. మాట్లాడేందుకు ప్రయత్నించగా గాయత్రి నిరాకరించింది. అప్పటికే వెంట తెచ్చుకున్న చిన్నపాటి చాకుతో మొదట గొంతుపై పొడవగా అది వంగిపోయింది. మరో కత్తితో విచక్షణారహితంగా కడుపులో 10 సార్లు పొడిచాడు. అడ్డుపడితే నిన్నూ చంపేస్తానంటూ ఆమె వెంట వచ్చిన యువతిని బెదిరించాడు.
ఆ యువతి సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారాన్ని చేరవేసింది. అదే సమయంలో అటుగా ఓ వ్యక్తి రావడంతో.. డిల్లీబాబు తన బైక్‌పై పరారయ్యాడు. గాగమ్మవారిపల్లె సమీపంలో వాహనాన్ని వదిలేసి అడవుల్లోకి పారిపోయాడు. బాధితురాలిని తొలుత పెనుమూరు పీహెచ్‌సీకి, తర్వాత వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయత్రి మరణవార్త తెలియగానే బంధువులు ఆగ్రహంతో చింతమాకులపల్లెకు వెళ్లి నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. అతని తండ్రిని బంధించి కొట్టారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం వచ్చి.. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హత్య, దాడి ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వేడెక్కిన కృష్ణా జిల్లా రాజకీయం: కొడాలి వ్యాఖ్యలపై దేవినేని ఆందోళన..