తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(34).. అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏవోగా పనిచేస్తున్నారు. గతంలో నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో వ్యవసాయాధికారిణిగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన శివకుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు రుద్రవీర్(3), విరాట్(11 నెలలు) ఉన్నారు. సంగారెడ్డిలో నివాసముంటున్నారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వరకు విధులు నిర్వహించి... ఇంట్లో పని ఉందని కారులో బయల్దేరారు. అక్కడి నుంచి మనూరు మండలం రాయిపల్లి శివారులోని మంజీర నది వద్దకు వచ్చారు. ఆమె తమ్ముడు శివకుమార్‌కు ఫోన్ చేసి నదిలో దూకి చనిపోతున్నాని చెప్పారు. శివకుమార్ తిరిగి అదే నెంబర్‌కు ఫోన్ చేస్తే... కలవకపోవడం వల్ల వంతెన వద్దకు వచ్చి గాలించారు. వంతెనపై కారు, పర్సు, ఫోన్, చెప్పులు ఉండటంతో మనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మంజీరలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పోలీసులకు గాలించడం కష్టంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు. వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో కట్నకానుకలు ఇచ్చారు. అయినప్పటికీ... మామ బస్వరాజ్, ఇద్దరు అత్తలు, భర్త, అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారని... దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగ్‌శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు నెలలుగా అరుణ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సహోద్యోగలు, స్నేహితులు తెలిపారు.
ఇదీ చూడండి: