తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య, శంకర్ అన్నదమ్ములు. ఇద్దరి మధ్య భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ.. అదే విషయమై చర్చించుకున్నారు. ఆ సమయంలో రాజయ్యకు కొడుకులు లేని కారణంగా అతని భూమి కూడా తనకే చెందుతుందని తమ్ముడు శంకర్ అన్నాడు.
అందుకు ఒప్పుకోని రాజయ్య శంకర్‌తో వాదించాడు. మద్యం మత్తులో కోపగించుకున్న శంకర్.. రాజయ్య మీద అదే రాత్రి కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా.. శంకర్ పారిపోయి.. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.