పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో గుప్త నిధులు ఉన్నాయంటూ ముగ్గురు వ్యక్తులు మోసం చేశారు. ఏలేటిపాడు నివాసి నల్లమిల్లి రామారెడ్డి వద్దకు ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన దూలపల్లి బాబూరావు, తణుకుకు చెందిన గుబ్బల రమాదేవి, కంచెర్ల వేణుగోపాలకృష్ణ కలిసి రామారెడ్డి పొలంలో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికారు.
తొలుత నమ్మించేందుకు..
బాధితుడు నమ్మేలా తవ్వకాల నుంచి వివిధ రకాల వస్తువులు బయటకు తీశారు. ఈ నేపథ్యంలో గుప్త నిధులను వెలుపలికి తీసేందుకు హోమాలు చేయాలంటూ పలు మార్లు రూ.2 లక్షల రూపాయల వంతున సొమ్ము రాబట్టారు.
మొత్తం రూ.11 లక్షలకు టోకరా
ఫలితంగా నమ్మకం కలిగిన రైతు దఫ, ధపాలుగా నిందితులకు సుమారు రూ. పదకొండు లక్షలను సమర్పించుకున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించి ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు కొంతమేర తవ్వించారని, తర్వాత జేసీబీతో తవ్వించారని బాధితుడు తెలిపారు. తవ్వకాల్లో వజ్రం, వెండి చెంబు, రాగిచెంబు వంటి వస్తువులు బయటికి రావడం చూసి నమ్మి డబ్బులు ఇచ్చానని పోలీసులకు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇరగవరం పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి : ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడి మృతి.. బంధువుల ఆందోళన