మూడ్రోజుల క్రితం ఖమ్మంలోని ఇందిరానగర్‌లో కార్తికమాసం సందర్భంగా తెల్లవారుజామున పూజ కోసం ఇంటి ముందున్న చెట్టుపై పూలు కోసుకుంటున్న మహిళను కత్తితో బెదిరించి ఓ దొంగ ఆమె మెడలో బంగారు గొలుసును దోచుకెళ్లాడు. మహిళ వెంబడించినా దొరకకుండా పారిపోయాడు. అంతకు రెండ్రోజుల ముందు అదే కాలనీలో మరో వీధిలో.. వాకిలి ఊడుస్తున్న మహిళ మెడలో గొలుసు లాగేందుకు విఫలయత్నం చేసిన ఓ దొంగ ఆ మహిళ ప్రతిఘటించడం వల్ల పారిపోయాడు.
ఇటీవల రాపర్తినగర్ బైపాస్ రోడ్డు సమీపంలో తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి బయటకొచ్చిన ఓ మహిళను కత్తితో బెదిరించిన ఓ దొంగ బంగారు గొలుసు దోచుకెళ్లాడు. బైపాస్ రోడ్ సమీపంలోని రహమత్‌నగర్‌లో మధ్యాహ్నం సమయంలో అద్దె ఇంటి కోసమంటూ ఇంట్లోకి వచ్చిన ఓ ఆగంతకుడు మహిళను తుపాకితో బెదిరించి ఆమె మెడలో నుంచి నాలుగున్నర తులాల మంగళసూత్రం అపహరించుకుపోయాడు.
తెలంగాణ.. ఖమ్మం నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా ఆగడాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఇటీవల నగరంలో తెల్లవారుజామునే ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. మహిళలు ఒంటరిగా ఉండటం చూసిన దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఉదయపు నడకకు వెళ్తున్న వారిలా ఎలాంటి అనుమానం రాకుండా ఠీవీగా వెళ్తున్న దొంగలు.. మహిళలు ఒంటరిగా కనబడటం చూసి చోరీలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు వారిపై దాడికి పాల్పడటానికి వెనకాడటం లేదు.
నెలరోజుల్లో 4 చోరీలు
నెలరోజుల వ్యవధిలో ఖమ్మం నగరంలో ఒకే తరహాలో 4 వరుస చోరీలు చోటుచోసుకోవడం వల్ల మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాలన్నీ సీసీకెమెరాలు లేని వీధుల్లో జరగడం వల్ల.. ముందే రెక్కీ నిర్వహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. దొంగలను మహిళలు గుర్తిస్తున్నా.. సీసీకెమెరాలు లేకపోవడం వల్ల పట్టుకోవడం కష్టంగా మారుతోందని పోలీసులు తెలిపారు.
నిద్రావస్థలో నిఘావ్యవస్థ
పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ఠం చేశామని, 24 గంటలు నిఘా వ్యవస్థ పనిచేస్తుందని పోలీసులు చెబుతున్నా.. అవి ఆర్భాటానికే పరిమితమవుతున్నాయని నగరవాసులు అంటున్నారు. మొబైల్ బృందాలు, బ్లూకోర్టు టీంలు, స్టేషన్ల వారీగా ఎస్సై స్థాయి అధికారితో పెట్రోలింగ్ బృందాలు ఎప్పటికప్పుడు సంచరిస్తున్నా చోరీలను అరికట్టలేకపోతున్నారని చెబుతున్నారు. రాత్రివేళల్లో గస్తీ ప్రధాన రహదారుల వద్దే పరిమితమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తమై వీధుల్లో గస్తీ నిర్వహించాలని, దొంగలను పట్టుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
గస్తీ పెంచుతున్నాం.. చోరీలు అరికడతాం
ఇటీవల జరిగిన దొంగతనాల దృష్ట్యా నగరంలో గస్తీ మరింత పెంచుతున్నామని నగర ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొంతమంది దొంగలను గుర్తించి పట్టుకున్నామని చెప్పిన ఏసీపీ.. చోరీలు అరికడతామని హామీ ఇచ్చారు.