అఫ్గానిస్థాన్‌లో(afghan news) తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక తలపాగా, హిజాబ్(మహిళలు ముఖానికి చుట్టుకునే వస్త్రం) అమ్మకాలు అమాంతం పెరిగినట్లు కాబుల్‌లోని దుకాణదారులు చెబుతున్నారు. అయితే వీటిని ధరించే విషయమై తాలిబన్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
"గతంలో నేను రోజుకు నాలుగు లేదా ఐదు హిజాబ్‌లను విక్రయించేవాడిని. కానీ తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు 15 నుంచి 17 వరకు అమ్ముతున్నాను."
-ఫైజ్ అఘా, దుకాణదారుడు
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత హిజాబ్‌ల ధరలు పెరిగాయి. కానీ వాటిని కొనే వారు కూడా ఎక్కువ అయ్యారు. అందుకే ఒక హిజాబ్‌ను గతంలో 1,000 అఫ్గానిస్కు అమ్మే నేను ఇప్పుడు దానిని 1,200 అఫ్గానిస్కు అమ్ముతున్నాను.
-నియామతుల్లా, దుకాణాదారుడు
మరో దుకాణాదారుడు అబ్దుల్ మాలిక్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇంతకుముందు 6 నుంచి 7 హిజాబ్‌లు అమ్మే అతను ప్రస్తుతం రోజుకు 20 విక్రయిస్తున్నట్లు తెలిపారు. తలపాగాలు కూడా అదే సంఖ్యలో అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. గతంలో 300 అఫ్గానిస్ పలికే తలపాగా... నాణ్యతను బట్టి ప్రస్తుతం 3000 అఫ్గానిస్ వరకు అమ్ముడవుతున్నట్లు పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్‌లో తలపాగాలు, హిజాబ్‌లు ధరించడంపై తాలిబన్లు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయనప్పటికీ.. కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా ధరించేందుకు ఇష్టపడుతున్నట్లు దుకాణాదారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Kabul airport: తాలిబన్ల టెస్ట్ పాసైతేనే ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ!