భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్ దర్యాప్తు ప్రారంభించింది. పెగసస్ స్పైవేర్‌ను రూపొందించిన ఎన్ఎస్ఓ గ్రూప్ కార్యాలయాల్లో ఆ దేశానికి చెందిన వివిధ దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ఎగుమతుల నియంత్రణ విభాగం(ఈసీడీ), జాతీయ భద్రతా మండలికి చెందిన సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ఈసీడీ ఇచ్చిన అనుమతుల మేరకు ఎన్ఎస్ఓ గ్రూప్ పని చేసిందా లేదా అన్న అంశంపై ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్.. పెగసస్ స్పైవేర్‌ను ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది.
అయితే భారత్ సహా వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులపై పెగసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్ల హ్యాకింగ్ జరిగిందని ఇటీవల ద వైర్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ ఆరోపణల పరిశీలనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గత వారమే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: 'పెగసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వాస్తవమే'