UK Queen funeral: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలు నిర్వహించారు. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు, రాజులు, రాణులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
సోమవారం ఉదయం 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో రాణి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైనట్లైంది. వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే వరకూ రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి 12.15 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వెల్లింగ్టన్ అర్చి వరకు సాగింది. అక్కడి నుంచి విండ్సర్స్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకెళ్లారు. ఈ అంతిమయాత్రలో కింగ్ ఛార్లెస్-3తోపాటు రాజ కుటుంబం పాల్గొంది. కింగ్ జార్జ్-6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.
రాణి అంత్యక్రియల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. అంతిమయాత్రను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా పౌరులు లండన్ వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని నియంత్రించేందుకు లండన్‌లో 36 కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ప్రాంతాల్లో రాణి అంత్యక్రియలను లైవ్ టెలికాస్ట్ చేశారు. బ్రిటన్‌లోని పార్కులలో భారీ తెరలు ఏర్పాటు చేసి అంత్యక్రియలను ప్రదర్శించారు. 1965లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత భారీ స్థాయిలో జరిగిన కార్యక్రమం ఇదేనని సమాచారం.
క్వీన్ ఎలిజబెత్ 2.. కింగ్ జార్జ్-4, క్వీన్ ఎలిజబెత్ దంపతులకు 1926 ఏప్రిల్ 21న లండన్‌లోని టౌన్‌హౌస్‌లో జన్మించారు. తండ్రి మరణానంతరం పాతికేళ్ల వయసులో బ్రిటన్ పగ్గాలు చేపట్టిన క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించారు. అత్యంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పరిపాలించిన సామ్రాజ్ఞిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 8న తన 96వ ఏట తుది శ్వాస విడిచారు.