UK PM election: బ్రిటన్‌లో కొత్త ప్రధాన మంత్రి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ మళ్లీ అన్వేషణ మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కొద్ది నెలల కిందట బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తరవాత కొత్త ప్రధానిని ఎన్నుకునే తతంగం రెండు నెలలపాటు సాగింది. ఈసారి కొత్త సారథి ఎంపిక వారం రోజుల్లోనే పూర్తి కావచ్చు. ఈనెల 21న నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 650 సీట్లు గల బ్రిటిష్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధానమంత్రి పదవికీ పోటీపడవచ్చు.
ఇంతకుముందు నామినేషన్ వేయడానికి 20 మంది ఎంపీల మద్దతు ఉంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులని ప్రకటించారు. దీంతో ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ సారథ్యానికి పోటీపడగలుగుతారు. అక్టోబరు 24 మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల లోపల పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవలసిందే.
మిగిలిన ఇద్దరికి ఎంపీలు సూచనాత్మక ఓట్లు వేస్తారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 1,72,000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను ఎంచుకుంటారు. ఈ నెల 28న విజేతను ప్రకటిస్తారు. అతడు లేక ఆమెను కొత్త ప్రధానమంత్రిగా బ్రిటిష్ రాజు ప్రకటిస్తారు.
రిషి ఫేవరేట్..
ప్రధాని పదవి కోసం ఇటీవల ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ కొత్త ప్రధానిగా ఎన్నికవుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ట్రస్, సునాక్‌లతో నాయకత్వం కోసం పోటీ పడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈసారి తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. రక్షణ మంత్రి బెన్ వాలెస్ కూడా తాను పోటీలో ఉండబోనని శుక్రవారం స్పష్టంచేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ బరిలో దిగినట్లు ప్రకటించారు. వీరిలో ఎంపీల మద్దతు రిషి సునాక్‌కే ఎక్కువగా లభించొచ్చని భావిస్తున్నారు. ట్రస్ చెబుతున్నట్లు పన్నులకు కోత పెట్టడం విపత్కరమవుతుందని ఆయన పదేపదే కన్జర్వేటివ్ పార్టీ నేతలను హెచ్చరించారు. చివరికి ఆయన చెప్పిందే నిజమైంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను రిషి మాత్రమే పరిష్కరించగలరని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
బోరిస్‌కు సైతం..
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకునేవారూ గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ తన మనోగతాన్ని బయటపెట్టకున్నప్పటికీ పార్లమెంటులో ఆయన మద్దతుదారులు రంగంలోకి దిగారు. బోరిస్‌కు మద్దతివ్వాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. 2019లో పార్టీని ఆయన విజయపథంలో నడిపించారని కొందరు కన్జర్వేటివ్ నేతలు వాదిస్తున్నారు. ఎంపీల్లో కన్నా క్షేత్రస్థాయి పార్టీ క్యాడర్‌లో ఆయనకు మంచి ఆదరణ ఉందని చెబుతున్నారు. ఇలాంటి విజేత ఉంటేనే పార్టీ మనుగడ సాధిస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఆయన కుంభకోణాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ఒకప్పుడు ఆయనకున్నంత కరిష్మా ఇప్పుడు లేదని మరికొందరు వాదిస్తున్నారు.
మీరు తప్పుకోండి: రిషికి జాన్సన్ విజ్ఞప్తి..
ఈసారి పోటీలోకి దిగొద్దని, తనకు అవకాశం కల్పించాలని బోరిస్ జాన్సన్.. రిషి సునాక్‌ను కోరినట్లు బ్రిటిష్ మీడియాలో వార్తలు వచ్చాయి. 2024 డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీని ఓటమి నుంచి కాపాడే సత్తా తనకు మాత్రమే ఉందని జాన్సన్.. పార్టీ ఎంపీలకు స్పష్టంచేస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
ట్రస్‌కు ఏడాదికి రూ.కోటి
బ్రిటన్ ప్రధానిగా గురువారం రాజీనామా చేసిన లిజ్ ట్రస్ 45 రోజులు మాత్రమే ఆ హోదాలో ఉన్నప్పటికీ ఆమెకు పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్స్ (పీడీసీఏ) కింద ఏడాదికి 115,000 పౌండ్లు (రూ.1.05 కోట్లు) అందుతాయి. పదవి నుంచి తప్పుకొన్నప్పటికీ ఇంకా ప్రజాజీవితంలోనే ఉండే మాజీ ప్రధానుల కోసం 1991 నుంచి ఈ భత్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు మాజీ ప్రధానులు ఈ అలవెన్స్‌ను పొందుతున్నారు. అయితే పదవిలో 45 రోజులే ఉన్నందువల్ల ట్రస్ స్వచ్ఛందంగా ఈ భత్యాన్ని వదులుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.