Sri Lanka economic crisis: ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణలతో రణరంగంగా మారిన ద్వీప దేశం శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త కర్ఫ్యూను బుధవారం వరకు పొడిగించారు. మంగళవారం ఘర్షణలు జరగకున్నా ఆ పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉండడంతో రాజధాని కొలంబో సహా కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారులపై మాజీ ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారుల దాడి తీవ్ర ఘర్షణలకు దారితీయగా... ఆందోళనలు ఆయన అధికారిక నివాసానికి కూడా తాకాయి. కొలంబోలోని మహింద రాజపక్స అధికారిక నివాసానికి భారీగా చేరుకున్న ఆందోళనకారులు ఇంటిపై దాడికి యత్నించారు. ఆయన నివాస ప్రాంగణంలోకి 10 పెట్రోల్ బాంబులను విసిరారు. సోమవారం రాత్రంతా భాష్ప వాయువు గోళాలు ప్రయోగించి భద్రతా బలగాలు ఆందోళనకారులను కట్టడి చేశాయి.
Sri Lanka protests: ప్రాణ భయంతో మహింద కుటుంబం.. సైన్యం సహాయంతో కొలంబో వదిలి హెలికాప్టర్‌లో పారిపోయింది. కొలంబోకు 2వందల 70 కిలోమీటర్ల దూరంలోని ట్రింకోమలి నౌకా కేంద్రంలో మహింద కుటుంబంతో సహా ఆశ్రయం పొందుతుండగా, దాని ఎదుట కూడా నిరసనకారులు మంగళవారం ఆందోళనలు చేపట్టారు.
కాగా, నిరసనకారులు హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన తండ్రి స్మారకార్థం నిర్మించిన మ్యూజియంను ధ్వంసం చేశారు. మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. ఆయన పూర్వీకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మహింద రాజపక్స నివాసాలు పూర్తిగా కాలిపోయాయి. కురునెగలాలో కూడా మహింద నివాసానికి నిప్పుపెట్టారు. మహింద కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. 14 మంది మాజీ మంత్రులు, 18 మంది ప్రజాప్రతినిథులు, రాజపక్స అనుకూలురైన నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. రాజపక్స కుటుంబ మద్దతుదారులు దేశం విడిచి పారిపోకుండా బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయ దారుల్లో ఆందోళనకారులు చెక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. మహింద నౌకాశ్రయంలో తలదాచుకుంటున్నా... ఆయనకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఘర్షణలకు కారణమైన మహిందను అరెస్టు చేయాలని విపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఆయనను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సహా వివిధ విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం చెలరేగిన ఘర్షణల్లో 8 మంది మృతిచెందగా 249 మంది గాయపడ్డారు. ఘర్షణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని శ్రీలంక అటార్నీ జనరల్ సంజయ్ రాజరత్నం.... ఆ దేశ పోలీసు విభాగం అధిపతికి సూచించారు. ప్రజల రాజ్యాంగ హక్కుల్లో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నారని, అవి ఘర్షణలకు దారి తీశాయని అన్నారు. అటు ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు పార్లమెంటును సమావేశ పర్చాలని స్పీకర్ మహింద యాపా అబేయవర్థన.....అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను కోరారు. ప్రజలు సాటి వారిపై హింస, ప్రతీకార చర్యలను నిలిపివేయాలని అధ్యక్షుడు గొటబాయ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
రణరంగంలా శ్రీలంక.. ఘర్షణల్లో ఎంపీ మృతి.. ఆస్తులు ధ్వంసం
శ్రీలంకలో హింస.. రాజపక్స ఇంటికి నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం