బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోని కొన్ని రహస్య పత్రాలు... నాటి ఉపాధ్యక్షుడైన జో బైడెన్ ఉపయోగించిన ఓ కార్యాలయంలో బయటపడటం సంచలనం రేపింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి. అవి కొద్ది సంఖ్యలోనే ఉన్నాయని, వాటి విషయంలో నేషనల్ ఆర్కైవ్స్, న్యాయశాఖలకు శ్వేతసౌధం పూర్తిగా సహకరిస్తోందని అధ్యక్షుడి ప్రత్యేక న్యాయవాది రిచర్డ్ సౌబర్ తెలిపారు.
వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్‌లో గల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడానికి అక్కడున్న బీరువాలో ఫైళ్లను అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులు ప్యాక్ చేస్తుండగా ఇవి బయటపడ్డాయని సౌబర్ చెప్పారు. 2017 మధ్య నుంచి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యేవరకూ ఈ కార్యాలయాన్ని బైడెన్ వాడుకున్నారు. రహస్య పత్రాలున్నట్లు తెలియగానే.. అంటే 2022 నవంబరు 2నే ఈ విషయాన్ని నేషనల్ ఆర్కైవ్స్‌కు చెప్పామని సౌబర్ అన్నారు. వాటిని ఆ మర్నాడే ఆ సంస్థ తీసుకుందని తెలిపారు. అధ్యక్షుడి న్యాయవాదులే వీటిని కనుగొన్నారు తప్ప.. ఆర్కైవ్స్ వీటిపై ఎలాంటి విచారణా చేయలేదని స్పష్టం చేశారు. అప్పటి నుంచి న్యాయశాఖతో పాటు నేషనల్ ఆర్కైవ్స్‌కు సైతం పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు.
ప్రత్యర్థుల విమర్శలు..
ఈ విషయంలో బైడెన్‌పై రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. 'ఇది రాజద్రోహమని, అభిశంసనకు అర్హమని, మరణశిక్ష సైతం పడొచ్చని కొన్ని నెలల నుంచి వింటున్నాం.. కానీ ఏమీ జరగదని నేను భావించాలా!?' అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశారు.'బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలున్నట్లు బయటపడింది. అవి అక్కడెందుకు ఉన్నాయి? న్యాయశాఖ ఈ పత్రాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు?' అని సెనెటర్ మార్షా బ్లాక్‌బర్న్ ప్రశ్నించారు. బైడెన్ ఇంటిపై ఎఫ్‌బీఐ ఎప్పుడు దాడి చేస్తుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ట్రాయ్ నెల్స్ ప్రశ్నించారు.
న్యాయశాఖ సమీక్ష..
రహస్యపత్రాల వ్యవహారంపై న్యాయశాఖ సమీక్షిస్తోందని శ్వేతసౌధం తెలిపింది. ఈ విషయాన్ని నేషనల్ ఆర్కైవ్స్ సంస్థ న్యాయశాఖకు తెలియజేసిన తర్వాత, దీన్ని సమీక్షించాల్సిందిగా నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇలియనోయి అటార్నీ అయిన జాన్ లాష్‌ను అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్ కోరారని సమాచారం. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి దాదాపు 300 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయమై న్యాయశాఖ చాలాకాలంగా దర్యాప్తు చేస్తోంది. గత ఆగస్టులో ఎఫ్‌బీఐ ఏజెంట్లు ట్రంప్ ప్రైవేటు ఎస్టేట్ అయిన మార్-ఎ-ఎలాగోలో సోదాల కోసం సెర్చ్ వారంట్ జారీ చేశారు.