Russia Ukraine War : రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ల దాడి జరిగింది. దీంతో అక్కడి భవనాలు దెబ్బతిన్నాయని రష్యా తెలిపింది. మాస్కోలోకి ప్రవేశిస్తున్న ఎనిమిది డ్రోన్‌లను నిలువరించినట్లు వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడికి ఉక్రెయిన్నే కారణమని రష్యా ఆరోపించింది. అనంతరం ఉక్రెయిన్‌పై కూడా దాడులకు పాల్పడింది రష్యా. 24 గంటల్లో మూడు సార్లు ఉక్రెయిన్‌పై బాంబు దాడులు జరిపింది. తమపై జరిగిన ఘటనను 'కీవ్ ఉగ్రవాద దాడి'గా రష్యా అభివర్ణించింది.
మాస్కోపై జరిగిన దాడుల్లో పలు భవనాలు దెబ్బతిన్నట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ప్రకటించారు. ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని.. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న భవనాల్లో నివసిస్తున్న వారిని రష్యా అధికారులు ఖాళీ చేయించారు. మాస్కోకు వస్తుండగా పలు డ్రోన్లను పేల్చివేసినట్ల తెలిపారు. ఈ నెలలో మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. ఇంతకు ముందు రష్యా అధ్యక్ష భవనంపై దాడి చేసి పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్లు వచ్చినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. వాటిని వెంటనే కూల్చివేసినట్లు తెలిపారు. తాజా ఘటనపై ఉక్రెయిన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా లేదు.
మాస్కోపై డ్రోన్ల దాడి అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రాత్రి నుంచి కొనసాగిన రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని.. అక్కడి అధికారులు చెప్పారు. అయితే ఈ దాడుల్లో కొన్ని భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. కీవ్ గగనతలంలో 20కిపైగా షాహెద్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు సమాచారం. గత 24 గంటలుగా డ్రోన్ల శబ్దాలతో పాటు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని.. కీవ్ ప్రజలు తెలిపారు. ఘటనలో హోలోసివ్ జిల్లాలోని ఒక భవంతిలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారని అధికారులు వివరించారు. ఆ భవంతి నుంచి 20 మందిని ఖాళీ చేయించినట్లు వెల్లడించారు.
'పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నం.. అధ్యక్ష భవనంపై డ్రోన్లతో దాడి'..
Ukraine Drone Attack on Russia : మే నెల ప్రారభంలోనూ రష్యా అధ్యక్ష భవనం(క్రెమ్లిన్)పై డ్రోన్ దాడి జరిగింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ ఈ దాడులకు యత్నించిందని అప్పుడు రష్యా ఆరోపించింది. పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని క్రెమ్లిన్‌పై దాడి జరిగిందని పేర్కొంది. అందుకు రెండు డ్రోన్లను వినియోగించిందని రష్యా వివరించింది. కాగా ఆ రెండు డ్రోన్లను రష్యా రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పుతిన్‌కు గానీ, భవనానికి గానీ అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి