బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్ ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను మర్చిపోలేదు. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన రిషి సునాక్ హిందూ మూలాలను ఎప్పటికీ మర్చిపోనని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. తన అత్తమామలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి-సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని గతంలో స్పష్టం చేశారు.
రిషి సునక్ గతంలో ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో తాను ఆచరణాత్మక హిందువునని ధైర్యంగా చెప్పారు. బ్రిటిష్ హౌసాఫ్ కామన్స్ సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. జనాభా లెక్కల సేకరణకు వచ్చిన అధికారులకు ఇచ్చిన పత్రంలోనూ బ్రిటిష్ ఇండియన్ కేటగిరీ మీద టిక్కు పెడతానని రిషి సునక్ ఎలాంటి బెరుకు లేకుండా ప్రకటించారు. తాను పూర్తిగా బ్రిటిష్ వాణ్ని అని అయితే సంస్కృతి రీత్యా తాను భారతీయుడినని, హిందువునని బాహాటంగానే వెల్లడించారు.
తాను బీఫ్ తిననని అది తినకపోవడం వల్ల తనకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదని రిషి సునక్ వెల్లడించారు. అమెరికా రాజకీయ జీవితంలో మతం విస్తరించి ఉందని.. కానీ ఇంగ్లండ్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. 95 శాతం శ్వేతజాతీయులు ఉన్న రిచ్మండ్ నుంచి తాను వరుసగా బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడమే బ్రిటన్ వాసులు విశాల హృదయులు అనడానికి నిదర్శనమని రిషి సునాక్ ఎప్పుడూ చెబుతుంటారు.
2009లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి- సుధామూర్తి కుమార్తె అక్షతకు.. రిషితో వివాహం జరిగింది. భర్త బ్రిటన్ ఆర్థికమంత్రి అయ్యాక కూడా అక్షత బ్రిటిష్ పౌరసత్వం తీసుకోలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో రిషి సునాక్ సూటిగా సమాధానమిచ్చారు. తన భార్య నిర్ణయాలు, ఇష్టాలను తాను గౌరవిస్తానని ఆమె భర్త ఆస్తి కాదని స్పష్టం చేశారు. తన అత్తామామలైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి-సుధా మూర్తిలు సాధించిన ఘనత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని రిషి సునాక్ స్పష్టం చేశారు. బ్రిటన్‌లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఇన్ఫోసిస్ కూడా ఒకటని గుర్తు చేశారు.