Srilanka Crisis: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ప్రత్యేక కమిటీని నియమించానని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఈ కమిటీలో త్రివిధ దళాల కమాండర్లు, పోలీసు ఉన్నతాధికారులు, జవాన్లు ఉన్నారని, వారి సర్వ హక్కులు కల్పిసున్నట్లు చెప్పారు. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే వారం జరగబోయే ఓటింగ్‌లో ఎంపీలు పాల్గొని స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరారు. అందుకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి కంటే పార్లమెంటుకే ఎక్కువ అధికారాలు ఉండేలా రాజ్యాంగ సవరణ చేస్తానని విక్రమ సింఘే హామీ ఇచ్చారు.
"తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నాను. కొత్త ప్రెసిడెంట్‌ను పరిచయం చేసేటప్పడు ఉపయోగించే 'హిజ్ ఎక్సలెన్సీ' అనే పదాన్ని నిషేధిస్తున్నాం. దాంతో పాటు అధ్యక్ష జెండాను రద్దు చేస్తున్నాం. నిరసనకారులు సృష్టించిన బీభత్సంలో 24 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పార్లమెంటు ఆవరణలో భద్రతా దళాలకు చెందిన రెండు బుల్లెట్లతో నిండి ఉన్న ఆయుధాలను సైతం నిరసనకారులు దొంగలించారు."
-- రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు
'వారికి వీరికి చాలా తేడా ఉంది'.. తిరుగుబాటుదారులకు, నిరసనకారులకు చాలా తేడా ఉందని విక్రమసింఘే అన్నారు. నిరసనకారుల విధ్యంసక చర్యలపై అనేక మంది లంక ప్రజలే వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ దేశాన్ని నాశనం చేయడానికి చాలా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
'కొత్త అధ్యక్షుడి కోసం శనివారం పార్లమెంటు సమావేశం'.. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు శ్రీలంక పార్లమెంటు శనివారం సమావేశం కానుందని స్పీకర్ అభయ్‌వర్ధన తెలిపారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకూ ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆయన ప్రకటించారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ప్రజాస్వామ్య క్రతువులో ఎంపీలంతా పాల్గొనేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని శ్రీలంక స్పీకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
'విక్రమ సింఘేకు ఎస్ఎల్పీపీ పార్టీ మద్దతు'.. శ్రీలంక అధ్యకుడు గొటబాయ రాజపక్స రాజీనామా అనంతరం అధ్యకుడి పదవి కోసం వచ్చే వారం జరగనున్న పార్లమెంటరీ ఓటింగ్‌లో తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు మద్దతు ఇవ్వాలని అధికార ఎస్ఎల్పీపీ శుక్రవారం నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ సాగర కరియవారస తెలిపారు. అధ్యక్షుడి పదవి కోసం రేసులో ఉన్న విక్రమసింఘేకు క్రాస్-పార్టీ మద్దతును తాను ఆశిస్తున్నట్లు ఓ ఎంపీ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ నాయకుడు సాజిత్ ప్రేమదాస తన అభ్యర్థిత్వాన్ని ఇంకా ప్రకటించలేదు. కాగా, ఆయనకు 50 మందికి పైగా ఎంపీల మద్దతు ఉంది.
నష్టాల్ని లెక్కించిన ఫోరెన్సిక్ బృందాలు.. లంక అధ్యక్షుడి పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు కొలంబోని అధ్యక్షుడి భవనాన్ని తమ అధీనంలోకి తీసుకుని రచ్చరచ్చ చేశారు. మంచాలపై పడుకుని సేదతీరారు. స్విమ్మింగ్‌పూల్‌లో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే నిరసనకారులను తాజాగా లంక సైన్యం చెదరగొట్టింది. ఆ తర్వాత శుక్రవారం ఫోరెన్సిక్ బృందాలు కొలంబోని అధ్యక్షుడి భవనాన్ని సందర్శించాయి. జరిగిన నష్టాన్ని పరిశీలించి లెక్కలు నమోదు చేశాయి.
'మేము కేవలం అనుమతించాం.. ఆశ్రయమివ్వలేదు'.. గొటబాయ రాజపక్సకు ఆశ్రయం కల్పించామన్న వార్తలను సింగపూర్ ప్రభుత్వం ఖండించింది. ప్రైవేటు పర్యటనలో భాగంగానే ఆయన్ను తమ దేశంలోకి అనుమతించినట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. తమ దేశంలో ఆశ్రయం కావాలని ఆయన కోరలేదని, అలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేసింది. సాధారణంగా ఆశ్రయం కోరే అభ్యర్థనలను తాము అనుమతించబోమని సింగపూర్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: గొటబాయ రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. 7 రోజుల్లో కొత్త అధ్యక్షుడు