Russian Military Size: సైన్యాన్ని బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదనంగా 1,37,000 మందిని నియమించాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకాలతో కలిపి సాయుధ బలగాల మొత్తం సంఖ్య 20,39,758కు చేరుతుందని రక్షణశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరంచేసే ఉద్దేశంతోనే వాలంటీర్లు, ప్రైవేటు సైనికులు, ఖైదీలను సైన్యంలో నియమించేందుకు క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా మీడియా పేర్కొంది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో సైనికులకు పరికరాలను తీసుకెళ్తున్న రైలుపై బుధవారం రష్యా చేపట్టిన రాకెట్ దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 25కు చేరినట్టు అధికారులు తెలిపారు.
క్షణక్షణం 'అణు'భయం
యుద్ధారంభంలో పుతిన్ సేనలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్న జపోరిజియా అణు కార్మాగారం మరోసారి తీవ్ర ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. దీని భద్రతను రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అక్కడ భారీగా ఆయుధాలను నిల్వచేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధ్వంసమైన ఈ ప్లాంటు వద్ద మాస్కో బలగాల కార్యకలాపాలు భారీ విపత్తుకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, పవర్ గ్రిడ్ నుంచి జపోరిజియా అణు కర్మాగారాన్ని తప్పించినట్టు ఉక్రెయిన్ పవర్ ఆపరేటర్ సంస్థ ఎనర్గోటామ్ వెల్లడించింది. దీంతో మరో కొత్త చిక్కు తలెత్తింది. ఈ కర్మాగారం సురక్షితంగా ఉండాలంటే ఇక్కడ శీతలీకరణ వ్యవస్థలు తప్పనిసరిగా నిరంతరాయంగా పనిచేయాలి. పవర్ గ్రిడ్‌తో అనుసంధానం లేకపోతే, ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పూర్తిగా డీజిల్‌పై ఆధారపడి శీతలీకరణ వ్యవస్థలను కొనసాగించడం చాలా కష్టమని, లోటుపాట్లు తలెత్తితే విధ్వంసం తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మాస్కోతో దక్షిణ కొరియా భారీ ఒప్పందం
ఈజిప్టులో తొలి అణు విద్యుత్ కర్మాగారాన్ని దక్షిణ కొరియా నిర్మించనుంది. ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు.. రష్యా ప్రభుత్వ అణు ఇంధన సంస్థ 'ఏఎస్‌ఈ'తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ సుమారు రూ.18 వేల కోట్లు (2.25 బిలియన్ డాలర్లు). రాజధాని కైరోకు 130 కిలోమీటర్ల దూరంలోని దబా వద్ద ఈ ప్లాంటును దక్షిణ కొరియా నిర్మించనుంది.
రష్యా అధికారులను సంప్రదిస్తున్నాం: అరిందమ్ బాగ్చి
భారత్‌లో అధికార పార్టీ నేతలను లక్ష్యం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని రష్యా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై తాము రష్యా అధికారులతో సంప్రదింపులు చేపడుతున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి భాజపా బహిష్కృత నేతలు నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నేతలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది దుశ్చర్యకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి: పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య, కారు బాంబు పేల్చి
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 6 నెలలు, ఎవరిది విజయం, ముగింపు ఎప్పుడు