ఇరాన్‌లో బాలికల విద్యపై విషం కక్కుతున్నారు. వందలాది మంది బాలికలపై విషవాయువు ప్రయోగించారు. ఇప్పటివరకు 30కి పైగా పాఠశాలల్లో విషప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అర్డబిల్ నగరంలోని ఏడు బాలికల పాఠశాలలు ఈ విషవాయువు బారిన పడ్డాయి. దీంతో విద్యార్థినులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మూడు పాఠశాలల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. నవంబర్ నుంచి ఇరాన్‌లో జరిగిన ఇటువంటి సంఘటనల్లో దాదాపు వెయ్యి మందికి పైగా బాలికలు ఆసుపత్రిపాలయ్యారు. దాదాపు మూడు నెలల నుంచి పలు నగరాల్లో విషప్రయోగాలు జరుగుతున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
కుళ్లిన నారింజలు, క్లోరిన్, శుభ్రపర్చే రసాయనాలను తరగతి గదుల్లోకి రహస్యంగా వదిలినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ఏవో గుర్తుతెలియని వస్తువులను పాఠశాల మైదానాల్లోకి విసిరినట్లు విద్యార్థులు చెప్పారు. అస్వస్థతకు గురైన బాలికలు తలనొప్పి, వికారం వంటి సమస్యలతో బాధపడతున్నారు. మరికొందరు తాత్కాలికంగా పక్షవాతానికి గురైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఖోమ్ పట్టణంలో జరిగిన విషప్రయోగంతో ఓ బాలిక చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆమె తండ్రి, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ మాత్రం దీనికి విరుద్ధ ప్రకటన చేశారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా బాలిక చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఆమె విషవాయువు కారణంగా చనిపోలేదని వెల్లడించారు.
ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనలను ప్రారంభంలో పట్టించుకోనట్టు వ్యవహరించింది. ఈ ఘటనలను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించింది. ఇటువంటి ఘటనలు వరుసగా జరగడం వల్ల.. మాటమార్చింది. ఇరాన్ డిప్యూటి హెల్త్ మినిస్టర్ యూనిస్ పనాహీ తొలిసారి ఈ విషప్రయోగాలు జరుగుతున్న విషయాన్ని అంగీకరించారు. బాలికల పాఠశాలలు మొత్తం మూసివేయించడానికి కొందరు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషవాయువుల్లో నైట్రోజన్‌ను గుర్తించినట్లు పార్లమెంటరీ ఎడ్యుకేషన్ కమిటీ ఛైర్మన్ అల్‌రజా మోనాడి సెఫీదాన్ పేర్కొన్నారు. శీతాకాలంలో పాఠశాలలను వెచ్చగా ఉంచడానికి వాడే గ్యాస్ నుంచి విడుదలయ్యే ఉద్గారాల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని ఇరాన్ విద్యాశాఖ మంత్రి తొలుత బుకాయించారు. కానీ, ఆ తర్వాత ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ఈ ఘటనలపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న దాడులని అనుమానం వ్యక్తం చేశారు.
చేసిందెవరు?
ఇరాన్‌లోని అతివాద ఇస్లామిస్ట్‌లు, ప్రభుత్వ అనుకూల వర్గాలే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో.. మహిళలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ దాడులు చేస్తున్నారని పలువురు అనుమానిస్తున్నారు. కానీ, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇరాన్ శత్రువులే ఇలాంటి పనులు చేస్తున్నారని గతవారం చెప్పుకొచ్చారు.
ఇదే పద్ధతులను అఫ్గానిస్థాన్‌లో.. తాలిబన్లు 2010లో అనుసరించారు. నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు కూడా ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు. 2014లో 216 మంది బాలికలను వారు కిడ్నాప్ చేశారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడుతున్నారని.. బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలను బడికి పంపించకుండా చేయడమే వారి లక్ష్యమన్నారు. దీనిపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు.