China population: ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశంగా పేరు పొందిన చైనా.. ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనాలో పెళ్లికి యువత దూరంగా ఉండటం, జననాల రేటు తగ్గడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గత ఏడాది చైనాలో నమోదైన వివాహాలు 36 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది దేశ జననాల రేటులో మరింత క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
falling in Marriage registrations: చైనాలో వరుసగా ఎనిమిదేళ్లపాటు వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోతూ వస్తోంది. గతేడాది 2021లో దేశవ్యాప్తంగా 7.63 మిలియన్ల జంటలు వివాహానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పౌర వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 1986 తర్వాత ఇదే అత్యల్పం. అంటే వివాహాలు 36 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయన్నమాట. పెళ్లిళ్లు తగ్గిపోవటం.. శిశు జననాల రేటు మరింత తగ్గిపోయేందుకు కారణమవుతోంది. జాతీయ స్టాటిస్టికల్ బ్యూరో(ఎన్బీఎస్) ప్రకారం గత ఏడాది జనాభా వృద్ధి అర మిలియన్ కంటే తక్కువగా నమోదైంది. జనాభా సంక్షోభంపై ఆందోళన కలిగిస్తోంది. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
- 2020 నుంచి చూసుకుంటే ఏడాదికి 4,80,000 జనాభా వృద్ధి కనిపిస్తోంది. అయితే, గతంలో అది 12 మిలియన్లుగా ఉండేది. దీనికి తోడు వివాహాల నమోదులోనూ గత మూడేళ్లుగా భారీగా తగ్గుదల కనిపిస్తోంది. 2019లో 10 మిలియన్ల మంది జంటలు వివాహం చేసుకోగా.. అది 2020లో 9 మిలియన్లలోపునకు, 2021లో 8 మిలియన్ల దిగువకు చేరింది.
- 2021లో వివాహం చేసుకున్న వారి సంఖ్య 2013 నాటి గణాంకాలతో పోలిస్తే కేవలం 56.6 శాతమే. 2013లో చైనా చరిత్రలోనే అత్యధిక వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
- వరుసగా ఎనిమిదేళ్లుగా వివాహాల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల నమోదవుతోంది. అందుకు యువత తగ్గిపోవటం, వివాహ వయసు వచ్చిన మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా ఉండటం. అలాగే, పెళ్లిపై నిర్ణయం తీసుకునేందుకు వెనకాడటం వంటివి కనిపిస్తున్నాయి. వాటితో పాటు మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించటమూ కారణంగా తెలుస్తోంది.
- వివాహాల్లో క్షీణత కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికంగా ఉంది. దానికి పెళ్లి, పిల్లల పెంపకం ఖర్చులు భారీగా పెరిగిపోవటమూ ఓ కారణం. అలాగే.. పెళ్లి పీటలెక్కుతున్న వారి వయసు సైతం ఎక్కువగానే ఉంటోంది. 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో సరాసరి వివాహ వయసు 33.31 ఏళ్లు. అది 2008లో 26 ఏళ్లుగా ఉండేది.
- జనాభా సంక్షోభానికి కారణంగా చెప్పుకుంటున్న దశాబ్దకాలం నాటి ఒకే బిడ్డ విధానానికి స్వస్తి పలికి.. 2016లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేందుకు చైనా ప్రభుత్వం అనుమతిచ్చింది. గతేడాది జనాభా, కుటుంబ ప్రణాళిక చట్టానికి సవరణలు చేసి ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు వీలు కల్పించింది.
ఇదీ చూడండి: కులం- మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు బ్రాహ్మణ యువతి