Hindu Temple Demolished In Pakisthan : పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు అక్కడి అధికారులు. సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో ఉన్న మారిమాత ఆలయాన్ని.. రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. 150 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయాన్ని.. కూలిపోయే దశలో ఉందన్న కారణంతో ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న హిందూ కమ్యూనిటీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. కనీస సమాచారం ఇవ్వకుండా.. ఈ చర్యకు పాల్పడటంపై మండిపడింది.
మారిమాత ఆలయం వద్దకు శుక్రవారం రాత్రి బుల్డోజర్లో అధికారులు వచ్చారని రామ్‌నాథ్ మిశ్రా మహారాజ్ తెలిపారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించి.. తెల్లవారేసరికి ఆలయాన్ని నేలమట్టం చేశారని ఆయన వెల్లడించారు. మిశ్రా స్థానికంగా ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ మందిరంలో సంరక్షకుడిగా పనిచేస్తున్నారు. గుడి చుట్టు ఉన్న ప్రహారి గోడను, ప్రధాన గేట్‌ను మాత్రం విడిచి పెట్టి.. లోపల భాగం మొత్తాన్ని ధ్వంసం చేశారని ఆయన వివరించారు.
"ఈ గుడి 150 ఏళ్ల క్రితం నిర్మించారు. మారి మాత దేవాలయ ప్రాంగణం అడుగు భాగంలో భారీ స్థాయిలో సంపదను పాతిపెట్టారనే కథనాలు ఉన్నాయి. 400 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయం విస్తరించి ఉంది. చాలా కాలం క్రితమే ఈ దేవాలయంపై భూ కబ్జాదారుల కన్ను పడింది." అని రామ్‌నాథ్ మిశ్ర వివరించారు. ఆలయం ప్రమాదకర స్థాయిలో ఉందని అధికారులు గుర్తించారని.. వారి ఆదేశాల మేరకే గుడి కూల్చివేశామని స్థానిక పోలీసులు తెలిపారు. కరాచీలోని మద్రాసీ హిందూ సంఘం.. ఈ ఆలయ బాధ్యతలను చూసుకుంటుందని వారు వెల్లడించారు. ఆలయ యాజమాన్యం అయిష్టంగానే దేవతల విగ్రహాలను.. తాత్కాలింగా ఓ చిన్న గదిలో ఉంచిందని వారు వివరించారు.
ఆలయాన్ని ఖాళీ చేయాలని చాలా రోజుల నుంచే యాజమాన్యంపై ఒత్తిళ్లు వస్తున్నాయని స్థానిక హిందూ కమ్యూనిటీ నాయకుడు రమేశ్ తెలిపారు. ఇక్కడ కమర్శియల్ బిల్డింగ్ కట్టాలని చూస్తున్న ఓ డెవలపర్‌కు.. నకిలీ పత్రాలతో ఆలయ స్థలాన్ని అమ్మినట్లు ఆయన ఆరోపించారు. ఘటనపై అత్యవసరంగా స్పందించాలని.. పాకిస్థాన్ హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్‌ను హిందూ కమ్యూనిటి విజ్ఞప్తి చేసింది. కరాచీలో పురాతన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. హిందువులు పాకిస్థాన్‌లో మైనార్టీ వర్గాలుగా ఉన్నారు. దాంట్లో చాలా మంది సింధ్ ప్రావిన్స్‌లోనే నివాసం ఉంటున్నారు.