Kim Jong Un nuclear weapons: అమెరికా, దక్షిణ కొరియాతో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. తమ ప్రత్యర్థులు కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధంలోకి నెడుతున్నారని కిమ్ ఆరోపించారు. 1950-53 కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ సైనికులను ఉద్దేశించి కిమ్ మాట్లాడారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టదలిచిన యుద్ధ విన్యాసాలను.. తమపై దండయాత్రకు రిహార్సల్స్‌గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే అమెరికా, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు.
తమ సైనిక దళాలు ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాయని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అణ్వస్త్ర దళాలు కూడా ప్రత్యర్థులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.అమెరికా తన శత్రు విధానాలను సమర్థించుకునేందుకు ఉత్తర కొరియాను బూచిగా చూపుతోందని కిమ్ ఆరోపించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలు అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. అదే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తే దాన్ని అమెరికా ముప్పుగా పేర్కొంటోందని విమర్శించారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ను యుద్ధ ఉన్మాదిగా కిమ్ అభివర్ణించారు. మేలో దక్షిణ కొరియా అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గర నుంచి అమెరికాతో సైనిక సహకారాన్ని యోల్ మరింత బలోపేతం చేశారు. తద్వారా ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధ ముప్పును ఎదుర్కొనేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై యుద్ధానికి వస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తామని కిమ్ హెచ్చరించారు.
అత్యాధునిక అణ్వాయుధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రత్యర్థులను ఉత్తర కొరియా బెదిరిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాను చేరుకోగలిగే పలు రకాల క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా ప్రయోగించింది. చర్చలకు అమెరికా, దక్షిణ కొరియా చేసిన ప్రతిపాదనలను ఇప్పటికే ఉత్తర కొరియా తిరస్కరించింది. తమ ప్రత్యర్థులు తొలుత శత్రుత్వ విధానాలను విడనాడాలని హితవు పలికింది. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందాలంటే ఉత్తర కొరియా తొలుత అణ్వాయుధ కార్యక్రమానికి స్వస్తి పలకాలని అమెరికా నేతృత్వంలోని దౌత్యవేత్తలు ఉత్తర కొరియాను కోరుతున్నారు.