Israel Hezbollah War : ఒకవైపు హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి లెబనాన్‌లోని హెజ్బొల్లా సంస్థ నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. హెజ్బొల్లా బలగాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పలుమార్లు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దు నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటున్న తమ దేశం పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల పరిధి వరకు నివాసితులను ఖాళీ చేయించేందుకు ఓ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 28 ప్రాంతాల నుంచి ప్రజలను తరలించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
లెబనాన్ నుంచి కూడా..
Israel Hezbollah Conflict : ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దు నుంచి తరలించనున్న పౌరులకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ ఈ ప్లాన్‌ను ఆమోదించినట్లు వెల్లడించింది. స్థానిక అధికార యంత్రాంగం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తరలింపు ప్రక్రియ సాగుతుందని చెప్పింది. హమాస్ దాడుల అనంతరం లెబనాన్ నుంచి కూడా హెజ్బొల్లా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు జరిగాయి. ఇటీవల జరిపిన ఓ క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్ సైతం లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది.
పాలస్తీనా మిలిటెంట్ల చేతుల్లో 199 మంది..
Hamas Hostages : హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ల చేతుల్లో 199 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన రేర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తెలిపారు. అయితే, బందీలుగా ఉన్నవారిలో విదేశీయులూ ఉన్నారా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. దాదాపు 10 రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్లు వందమందికిపైగా ఇజ్రాయెల్ వాసులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బందీలను విడిపించుకునేందుకుగానూ గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కూడా కోరారు.
'మమ్మల్ని పరీక్షించొద్దు.. ఇరాన్, హెజ్బొల్లాలకు హెచ్చరిక!'
హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర వైమానిక దాడులతో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, నీళ్లు లేక గాజా వాసులు అలమటిస్తున్నారు. నీరు, విద్యుత్తు, నిత్యవసరాలు, ఆసుపత్రుల్లో మందులు, వైద్య సామగ్రి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిణామాల నడుమ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం పార్లమెంటు ను ఉద్దేశించి ప్రసంగించారు. గాజాకు మానవతా సాయం అందించేందుకు అనుమతిస్తామని ప్రకటించారు. హమాస్ మిలిటెంట్లు అపహరించిన తమదేశ పౌరులను తిరిగి తీసుకొచ్చే విషయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఐసిస్ వంటి హమాస్ ఉగ్రసంస్థను అణచివేసేందుకు ప్రపంచమంతా ఒక్కటవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ముప్పు కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ ఇరాన్‌తోపాటు ఆ దేశ మద్దతుగా నిలిచిన హెజ్బొల్లాను హెచ్చరించారు.
యాహ్యా సిన్‌వార్‌పై ఇజ్రాయెల్ గురి
Yahya Sinwar News : మరోవైపు, హమాస్ గాజా హెడ్ యాహ్యా సిన్‌వార్‌పై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అతడే తమకు ప్రత్యక్ష శత్రువని ప్రకటించింది. తమ లక్ష్యాల జాబితాలో సిన్‌వార్ బృందం మొత్తం ఉందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. సిన్‌వార్ తమ దేశానికే దేశానికే కాదు.. ప్రపంచం మొత్తానికి శత్రువు అంటూ ఇజ్రాయెల్ సైన్యం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో సిన్‌వార్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది.
Yahya Sinwar Hamas : యాహ్యా సిన్‌వార్ అసలు పేరు.. యహ్యా ఇబ్రహీం హస్సన్ సిన్‌వార్. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో సిన్‌వార్ జన్మించాడు. అతడి పూర్వీకులు 1948 వరకు నేటి ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్‌వార్ కుటుంబం గాజాకు తరలివెళ్లింది. అతడు గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
Who Is Yahya Sinwar : 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరంపై సిన్‌వార్ తొలిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్‌లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్‌వార్ 1988లో అరెస్ట్ కాగా.. 1989లో ఇతడికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత పలుమార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ మొత్తం 1,026 మందిని విడుదల చేసింది. వీరిలో సిన్‌వార్ కూడా ఉన్నాడు.
హమాస్‌లో సిన్‌వార్ వేగంగా అగ్రస్థానానికి చేరుకొన్నాడు. ముఖ్యంగా మిలిటరీ వింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. 2015లో సిన్‌వార్‌ను అమెరికా విదేశాంగశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాస్‌లోని అల్ కస్సామ్ బ్రిగేడ్ల ఏర్పాటుకు ముందున్న సంస్థను ఇతడే ఏర్పాటు చేసినట్లు అమెరికా వెల్లడించింది. 2017లో సిన్‌వార్ గాజాలో హమాస్‌కు అధిపతిగా ఎన్నికయ్యాడు. హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరోకు ఇస్మాయిల్ హనియా అధ్యక్షుడు. అతడు స్వచ్ఛందంగా ప్రవాసంలో ఉంటున్నాడు. దీంతో గాజాపట్టీలో అప్రకటిత పాలకుడు సిన్‌వారే. అతడు ఇజ్రాయెల్‌తో రాజీని అంగీకరించడని.. దాడులకే మొగ్గు చూపుతాడనే పేరుంది. ఇజ్రాయెల్‌పై దాడుల్లో సిన్‌వార్ కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ ఆరోపిస్తోంది. సిన్‌వార్ రాక్షసుడని.. తమపై దాడుల మాస్టర్‌మైండ్ అతడే అని ఇజ్రాయెల్ వెల్లడించింది. సిన్‌వార్‌ను ఇజ్రాయెల్ ఏమాత్రం సహించదని చెప్పారు.
Hamas Secret Weapon : 'రహస్య ఆయుధం'తో హమాస్ దొంగదెబ్బ!.. ఇజ్రాయెల్‌ను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్!