India on Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు సత్ఫలితాన్ని ఇస్తాయని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి యుద్ధానికి ముగింపు పలకాలని చెప్పింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఐరాస భద్రతా మండలి సమావేశంపై మంగళవారం మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చ గురించి ప్రస్తావిస్తూ ఈ మేరకు తెలిపారు. ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Russia Ukraine talks: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు తిరుమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే రెండు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తగ్గించి శాంతి, సుస్థిరత నెలకొల్పేనేందుకు ప్రయత్నించడమే తమ ఐక్య కార్యాచరణ అని వివరించారు. యుద్ధం కారణంగా ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వస్తువుల ధరలు కూడా పెరగడం ఇందుకు నిదర్శనం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. ఇందులో కీలకు ముందడుగు పడింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి: ఉక్రెయిన్, రష్యా చర్చల్లో కీలక ముందడుగు.. త్వరలో పుతిన్- జెలెన్స్కీ భేటీ!