ETV Bharat / international

చైనా ప్రగతికి అవరోధంగా 'జీరో కొవిడ్‌ విధానం'.. ఇదే భారత్​కు చక్కని అవకాశం! - డ్రాగన్‌కు అవరోధం భారత్‌కు అవకాశం

మూడు దశాబ్దాలపాటు దూసుకెళ్ళిన చైనా అభివృద్ధి కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతోంది. కరోనా వైరస్‌ కట్టడికి అనుసరించిన 'జీరో కొవిడ్‌ విధానం' ఆ దేశ ప్రగతికి అవరోధంగా మారింది. ప్రపంచ ఆర్థిక ప్రగతికి చైనా అభివృద్ధి ఒక ఇరుసులా పనిచేస్తుందని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తుంటారు. అలాంటిదిప్పుడు డ్రాగన్‌ మందగమనం అన్ని దేశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

China economic slowdown opportunities for India

author img

By

Published : Jan 7, 2023, 7:42 AM IST

Updated : Jan 7, 2023, 7:59 AM IST

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) సభ్యత్వాన్ని 2001లో పొందిన తరవాత చైనా అభివృద్ధి పరుగు మొదలైంది. మిగతా ప్రపంచంతో వాణిజ్యం నెరపడంలో దాని రూపురేఖలే మారిపోయాయి. వస్తు ఉత్పత్తి, తయారీ రంగాలు వాయువేగంతో విస్తరించాయి. దాంతో ఇరవై ఏళ్లలోనే చైనా అమెరికా దరిదాపుల్లోకి వెళ్ళింది. యాపిల్‌, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు చైనా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. 2001-2021 మధ్యకాలంలో ఆ దేశ ఎగుమతులు నాలుగింతలు అయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో ఆ దేశ వాటా 4 నుంచి 15శాతానికి చేరింది. అదే సమయంలో అమెరికా వాటా 12 నుంచి 8 శాతానికి పడిపోయింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే చైనా అమెరికాను అధిగమించి ప్రపంచ వర్తక కేంద్రంగా మారడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాల్ని కరోనా తలకిందులు చేసింది.

వికటించిన జీరో కొవిడ్‌ విధానం
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అక్కడి విధాన నిర్ణేతలు అనుసరించిన జీరో కొవిడ్‌ విధానం దేశాన్ని చిక్కుల్లో పడేసింది. వస్తు తయారీ కేంద్రాలైన షాంఘై, బీజింగ్‌, షెన్‌జెన్‌ సహా మొత్తం 22 నగరాల్లో 2019 చివరి నుంచి లాక్‌డౌన్‌ అమలుచేస్తూ వచ్చారు. కఠిన నిబంధనల కారణంగా తయారీ రంగం స్తంభించింది. దాంతో నిరుద్యోగిత రేటు ఎన్నడూ లేనంతగా గతేడాది జులైలో 19.9 శాతానికి చేరింది. డాలరుతో పోలిస్తే యువాన్‌ విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వీటికి తోడు తైవాన్‌ విషయంలో అమెరికాతో వివాదం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం డ్రాగన్‌ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తదితర సంస్థలు చైనా జీడీపీ, ఆర్థికవృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించాయి. చైనా వృద్ధిరేటు 2022లో 4.4శాతంగా ఉంటుందని కొత్త సంవత్సరం ముందురోజు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని కొట్టిపారేసిన ప్రపంచ ఆర్థికవేత్తలు డ్రాగన్‌ వృద్ధిరేటు 2.7శాతం నుంచి 3.3శాతం మధ్యే ఉంటుందని అంచనా కట్టారు. ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా సైతం చైనా వృద్ధిరేటు 3.5శాతానికి పరిమితం అవుతుందన్నారు. ఆ ప్రభావం వల్ల ప్రపంచంలోని మూడో వంతు దేశాలు మాంద్యం ఛాయల్లోకి వెళ్తాయని హెచ్చరించారు.

చైనా ఆటుపోట్ల ప్రకంపనలు ప్రపంచ దేశాలను తాకుతున్నాయి. ఈ పరిస్థితి భారత్‌కు సవాలు విసరడంతోపాటు- ప్రాభవం, పరపతి పెంచుకునే అవకాశాన్నీ తెచ్చిపెట్టింది. 2020-21 నాటికి చైనా నుంచి మన దిగుమతులు 10.7 నుంచి 16.6శాతానికి పెరిగాయి. ఎగుమతులు 6.4 నుంచి 7.2శాతం వరకు పుంజుకొన్నాయి. మనం ప్రధానంగా రసాయనాలు, ఖనిజ ఇంధనాలు వంటివి ఎగుమతి చేస్తూ విద్యుత్తు యంత్ర పరికరాలు, ఎలెక్ట్రానిక్‌ సాధనాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం.

చైనాలో ఈ ఉత్పత్తుల తయారీ నిలిచిపోవడంతో భారత్‌కు సంకట స్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'భారత్‌లో తయారీ' స్ఫూర్తితో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే మనదేశం ఉత్పత్తుల తయారీ కేంద్రంగా అవతరిస్తుందన్నది నిపుణుల అంచనా. మన ఆర్థిక ప్రగతి భేషుగ్గా ఉండటం ఇందుకు కలిసివచ్చే అంశం. భారత్‌ 7.5శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలోనే రెండో గరిష్ఠ వేగాన్ని అందుకొందంటూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు కితాబిస్తున్నాయి. నిరుడు మన ఎగుమతులు నిర్దేశిత లక్ష్యాన్ని దాటి రూ.50లక్షల కోట్ల మార్కును చేరుకొన్నాయి.

పెరుగుతున్న పరపతి..
రాజకీయపరంగానూ భారత్‌ పరపతి పెరుగుతోంది. ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలన్నీ చైనా సాయం కోసం ఆశగా ఎదురుచూసినా డ్రాగన్‌ విదిల్చింది ఏమీలేదు! ఈ పరిస్థితిని భారత్‌ తెలివిగా వాడుకుంది. గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో భారత్‌ ఆ దేశానికి 3.8 బిలియన్‌ డాలర్ల సాయం అందించి పెద్ద మనసు చాటుకొంది. భారత్‌కు సహజ మిత్రురాలిగా భావించే నేపాల్‌ కొంతకాలం కిందట చైనా పంచన చేరింది. అయినా ఆపదలో ఉన్న నేపాల్‌ను డ్రాగన్‌ పక్కన పెట్టింది. ఇదే సమయంలో... భారత్‌ నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టీకరణకు పెద్దమనసుతో స్నేహహస్తం అందించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ఇతోధికంగా సాయం అందిస్తోంది.

రెండు దేశాల సరిహద్దుల్లో క్రాస్‌ బోర్డర్‌ రైల్‌ లింకులను నిర్మిస్తోంది. జోగ్బనీ-బిరాట్‌నగర్‌, జైనగర్‌-బర్దీబాస్‌ మార్గాల్లో రాకపోకలు సవ్యంగా సాగేందుకు సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉభయ దేశాల్లో ప్రవహించే నదులపై ఉమ్మడిగా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకొంది. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ను ఇండియా పెద్దన్నలా ఆదుకొంది. షేక్‌ హసీనా ప్రభుత్వం వచ్చాక భద్రత, రక్షణ, వర్తకం, విద్యుత్తు, రవాణాతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాధినేతలు కృషి చేస్తున్నారు. ఈ చర్యలన్నీ ఆసియాలో బలీయమవడానికి భారత్‌ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే!

అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి...
చైనా ఆర్థిక మందగమనం కారణంగా చమురు ధరలు మున్ముందు క్షీణించవచ్చు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఇది సానుకూల అంశమే. 'భారత్‌లో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. ప్రపంచస్థాయి వైద్య వసతులు ఉన్నాయి. ఈ-కామర్స్‌ దూకుడుగా విస్తరిస్తోంది. సుశిక్షిత మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికీ మించి జనాభాలో యువతే ఎక్కువ. ఇన్ని సానుకూలతలతో భారత్‌ ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు రంగం సిద్ధమవుతోంది' అంటూ హాంకాంగ్‌ పోస్ట్‌ ఈమధ్యే సంచలనాత్మక కథనం వెలువరించింది. డ్రాగన్‌ ఆధిపత్యాన్ని సహించని పాశ్చాత్య దేశాలు దిగుమతుల కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి ఇండియా వైపు చూస్తున్నాయి. వీటన్నింటినీ అనుకూలంగా మలచుకొని ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశం భారత్‌ ఎదుటే ఉంది!

స్థిరాస్తి సంస్థలకు రుణాలిచ్చి..
ప్రపంచవ్యాప్తంగా 2008లో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీని దుష్ఫలితాలను అరికట్టేందుకు చైనా పెద్దయెత్తున ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అక్కడి స్థానిక ప్రభుత్వాలు స్థిరాస్తి, నిర్మాణ సంస్థలకు హామీదారులుగా ఉంటూ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు ఇప్పించాయి. దాంతో ఇబ్బడిముబ్బడిగా గృహాలను నిర్మించినా వాటిని కొనేవారే లేకపోయారు. ఇళ్ల ధరలు ఊహించనంతగా పడిపోవడంతో నిర్మాణ సంస్థలు రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాయి. ఫలితంగా బ్యాంకులు దివాలా అంచుల్లోకి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల నుంచి కోలుకుంటుండగానే కరోనా విరుచుకుపడింది.

Last Updated : Jan 7, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.