Shinzo Abe Shot: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. ఈ మేరకు జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే వరల్డ్ న్యూస్ వెల్లడించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో ప్రసంగిస్తున్నారు అబే. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ దుండగుడు అబేపై దాడి చేసినట్లు పేర్కొంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ప్రస్తుతం ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ వెల్లడించారు. జపాన్‌లో అధికారికంగా మరణాన్ని ధ్రువీకరించడానికి ముందు ఈ పదాన్ని తరచూ ఉపయోగిస్తుంటారు.
ఈ క్రమంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సహా కేబినెట్ మంత్రులు టోక్యోకు పయనమయ్యారు.
అబేకు రక్తస్రావం అయినట్లు చెప్పారు ఎన్‌హెచ్‌కే రిపోర్టర్. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రజలు కూడా ఏదో గన్ షాట్ సౌండ్ వినిపించినట్లు చెప్పుకొచ్చారు. షాట్గన్తోనే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. హత్యాయత్నం చేసినట్లుగా అనుమానిస్తున్న 41 ఏళ్ల యమగామి టెట్సుయాను ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. జపాన్‌లో గన్ వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినా.. ఒక మాజీ ప్రధానిపై ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
అనారోగ్యం కారణంగా.. 2020లో జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు షింజో అబే. అనంతరం.. కిషిదా కొత్త పీఎం బాధ్యతలు చేపట్టారు.
విషమంగానే ఉంది: కిషిదా
అబేపై కాల్పుల ఘటన క్షమించరానిదని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం షింజో అబే పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అబేను కాపాడేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అబేను తన స్నేహితుడిగా అభివర్ణించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనపై కాల్పుల ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబం, సన్నిహితులు, జపాన్ ప్రజలకు సానుభూతి తెలిపారు.
జపాన్ మాజీ ప్రధానిపై హింసాత్మక దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది వైట్ హౌస్. కాల్పుల ఘటనతో షాక్ గురైనట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.