తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్ గత 3 వారాలుగా దుబాయ్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ముషారఫ్‌కు వెంటిలేటర్ తొలగించారని, ఆయన పరిస్థితి కోలుకోవడం సాధ్యం కానంత క్లిష్ట స్థితిలో ఉందని వెల్లడించారు. ఆయన అవయవాలు పని చేయడం లేదని వివరించారు. ఆయన కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు.
ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు. అభిశంసనను తప్పించుకునేందుకు పదవికి రాజీనామా చేశారు. పాక్ సైనిక దళాల ప్రధానాధికారిగా పని చేసిన ముషారఫ్ 1999లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల అనంతరం పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన దుబాయ్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. దేశ విభజనకు ముందు ఆయన దిల్లీలో జన్మించారు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు.