కాంగోలో కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మసీసీ ప్రాంతంలోని బొలోవా అనే గ్రామంలో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 25 మంది మహిళలు తమ పిల్లలతో కలిసి కొండ దిగువన ఉన్న ప్రవాహంలో బట్టలు ఉతుకుతున్న సమయంలో.. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అయితే, గతేడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలోని బిహంబ్వే గ్రామంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.
కాంగోను ముంచెత్తిన వరదలు..
గతేడాది డిసెంబర్లో కాంగో రాజధాని కిన్షానాను వరద ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తులో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. భారీ వర్షాలకు వరద ప్రవాహం, మట్టి పెళ్లలు విరిగిపడటం వంటి విపత్తులతో కోటి మందికి పైగా జనాభా ఉన్న కిన్‌షాసా చిగురుటాకులా వణికింది.
మలేసియాలో విరిగిపడ్డ కొండచరియలు..
గతేడాది డిసెంబరులో మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బటాంగ్ కలి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. స్థానిక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 94 మంది మలేసియన్లు ఉన్నారు. వీరిలో 59 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
2022లో ఫిలిప్పీన్స్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో సుమారు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది ఆచూకీ గల్లంతయ్యారు. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమయింది. వందమందికి పైగా ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి.
మయన్మార్‌లో..
2021 డిసెంబర్లో మయన్మార్ కాచిన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతయ్యారు. హాపాకంత్ ప్రాంతంలోని జేడ్(పచ్చరాయి) మైన్‌లో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయారు. పలు దుకాణాలు సైతం ఇందులో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలించారు.