New Zealand PM : న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ రాజీనామాతో కొత్త ప్రధానమంత్రి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. జెసిండా స్థానంలో పోటీలో క్రిస్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం తన లేబర్ పార్టీలోని సభ్యులతో ఆమోదం పొందాలి. పోటీలో ఒక్కరే ఉండటం వల్ల సభ్యుల ఆమోదం పొందడం ఇక లాంఛనమయింది. ఆ స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్ల.. చట్ట సభ్యులు హిప్కిన్స్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిప్కిన్స్కు దాదాపు 8 నెలల సమయం ఉంది. తన ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ వెనుకంజలో ఉందని ఒపీనియన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో లేబర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత హిప్కిన్స్పై ఉంది.
కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమర్థంగా బాధ్యతలు నిర్వహించి ప్రజల్లో గుర్తింపు పొందారు హిప్కిన్స్. కొత్త శైలి నాయకత్వానికి ఐకాన్‌గా గుర్తింపు పొందిన జెసిండా ఆర్డెర్న్ నీడలో ఇంతకాలం ఉన్నందున ఆయన పేరు బయటకు రాలేదు. విద్యాశాఖతో పాటు, పోలీసు, పబ్లిక్ సర్వీస్ శాఖ బాధ్యతలు కూడా హిప్కిన్స్ నిర్వర్తిస్తున్నారు. పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్‌గా కూడా హిప్కిన్స్కు పేరుంది. దీంతో పాటు లాక్డౌన్ సమయంలో ప్రజల్ని బయటకు వెళ్లొచ్చు అనే వ్యాఖ్యలతో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు.
చట్ట సభ్యుడిగా 15 ఏళ్ల అనుభవం కలిగిన హిప్కిన్స్.. ఆర్డెర్న్ కన్నా సమతుల్య భావాలు కలిగిన వాడని పేరుంది. వచ్చే ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ రూపంలో హాప్కిన్స్కు పెద్ద సమస్య ఎదురుకానుంది. ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం మెరుగుపరుస్తుందని హిప్కిన్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ నిరుద్యోగం రేటు 3.2 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 7.2 శాతంగా ఉంది. దీంతో దవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆ దేశ రిజర్వు బ్యాంకు వడ్డీ శాతాన్ని 4.25 శాతానికి పెంచింది. కాగా, ఈ ఏడాది న్యూజిలాండ్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.