Rishi Sunak on China: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారత సంతతి నేత రిషి సునాక్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై విరుచుకుపడ్డారు. బ్రిటన్‌తోపాటు యావత్ ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని ధ్వజమెత్తారు. అమెరికా నుంచి భారత్ వరకూ చాలా దేశాలను డ్రాగన్ లక్ష్యంగా చేసుకుందని అనేందుకు ఆధారాలు ఉన్నాయని సునాక్ తెలిపారు.
తాను బ్రిటన్ ప్రధానమంత్రి అయితే చేపట్టే ప్రణాళికలను ఎన్నికల ప్రచారంలో వివరించిన రిషి.. నాటో తరహాలో కొత్త సైనికకూటమిని ఏర్పాటుచేస్తానని ప్రతిపాదించారు. తద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్న చైనాకు కళ్లెం వేస్తామని వివరించారు. సాంకేతిక భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటామని తెలిపారు. బ్రిటన్‌లో చైనా భావజాలాన్ని పెంపొందిస్తున్న 30 చైనా సంస్థలను మూసివేస్తామని ప్రకటించారు. సైబర్ దాడుల ద్వారా బ్రిటన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దొంగిలిస్తోందని ఆరోపించిన రిషి.. యూనివర్సిటీల్లోకి సైతం డ్రాగన్ చొచ్చుకొస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను సమర్థిస్తూ తైవాన్‌ను బెదిరిస్తూ పెద్దఎత్తున మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల చైనా దురాగతాలను రిషి సునాక్ వివరించారు. ఆయా దేశాల ఆర్థిక సమస్యలను ఆసరాగా చేసుకొని వారికి అప్పులిస్తూ పరిస్థితిని మరింత దిగజారుస్తోందని మండిపడ్డారు. అప్పులు తీర్చలేకపోయిన దేశాల మెడపై కత్తి పెట్టి ఆస్తులను సీజ్ చేస్తోందని ఆరోపించారు. షింజియాంగ్, హాంకాంగ్ వంటి దేశాల్లో తమ సొంత ప్రజలను కూడా వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. విదేశాల కరెన్సీని అణగదొక్కి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మల్చుకుంటోందంటూ చైనాపై రిషి సునాక్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
బ్రిటన్‌లో దిగ్గజ వ్యాపార సంస్థలు, టెక్నాలజీ కంపెనీలకు చైనా నుంచి పొంచి ఉన్న సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు చర్యలు చేపడతామని రిషి సునాక్ తెలిపారు.కంపెనీలు తమ మేథో సంపత్తి హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు. చైనా ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ నేతలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: