China CPC meeting 2022 : మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను ప్రతిష్ఠించడమే ప్రధాన అజెండాగా చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభలు ఆదివారం బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. జిన్‌పింగ్ నాయకత్వానికీ, జీరో కొవిడ్ విధానానికీ వ్యతిరేకంగా ప్రజా ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అటు పార్టీపై, ఇటు అధికార పీఠంపై ఏక కాలంలో తన పట్టును పూర్తిస్థాయిలో బిగించేందుకు ఈ మహాసభల్ని వేదికగా చేసుకోనున్నారు చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అధినేత, ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్(69). వరుసగా మూడోసారి జోడు పదవులను చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల్ని, సాధించిన పురోగతిని ఈ సమావేశాల వేదికగా జిన్‌పింగ్ వివరించనున్నారు.
జిన్‌పింగ్ మినహా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌తో పాటు సీనియర్ నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తారు. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలు జరుగుతాయి. పార్టీ ఇకపై అనుసరించాల్సిన సైద్ధాంతిక పంథా, వ్యూహపరమైన దృక్పథాన్నీ మహాసభల్లో ఆమోదిస్తారని సీపీసీ ప్రతినిధి సన్ యెలి చెప్పారు.
నిరసనలు తీవ్రం..
మరోవైపు బీజింగ్‌లో విశ్వవిద్యాలయాలు, టెక్ సంస్థలు నెలకొన్న హైడాన్ ప్రాంతంలోని వంతెన మీద నిరసనకారులు ప్రదర్శించిన బ్యానర్లు గురువారంనాడు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ‘ఆహారం కావాలి, జీరో కొవిడ్ వద్దు; కావలసింది సంస్కరణలు, సాంస్కృతిక విప్లవం కాదు; స్వేచ్ఛ ముద్దు, లాక్‌డౌన్‌లు వద్దు; హుందాతనం ముద్దు..అబద్ధాలు వద్దు; మేము పౌరులం, బానిసలం కాము’ అనే నినాదాలు ఆ బ్యానర్లపై లిఖించి ఉన్నాయి. జీరో కొవిడ్ విధానం, నిరంకుశ పాలనకూ చైనాలో వ్యతిరేకత పెరుగుతోందని ఆ బ్యానర్లు సూచిస్తున్నాయి. దీంతో పోలీసులు బీజింగ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
జీరో కొవిడ్ వల్ల, ప్రైవేటు సంస్థలపై దాడుల వల్ల దేశంలో నిరుద్యోగం 19 శాతానికి చేరుకోవడంపై ప్రజల్లో, పార్టీలో అసమ్మతి పెరుగుతోంది. అదే సమయంలో గడచిన పదేళ్లలో అవినీతిపై చేపట్టిన పోరులో మంత్రులు, సైన్యాధికారులతో సహా లక్షల మంది అధికారులను శిక్షించడం మన్ననలు అందుకొంటోంది. ఇలా శిక్ష పడినవారి సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు భారత్, జపాన్‌లతో వివాదాలు, అమెరికా, ఐరోపాలతో పెరుగుతున్న వైరం చైనాలో ఆందోళన రేపుతోంది. అయితే, సీపీసీ 20వ మహాసభలు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టబోతోంది. దానికోసం 9.5 కోట్ల మంది పార్టీ సభ్యులకు మార్గదర్శకత్వం నెరపే సీపీసీ నిబంధనావళిని సవరిస్తారు.